
‘మందుల’ కష్టం
– మెడికల్ షాపుల బంద్ విజయవంతం
– ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలు
అనంతపురం మెడికల్ : ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలకు వ్యతిరేకంగా చేపట్టిన మెడికల్ దుకాణాల బంద్ సామాన్యులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ బతుకులు బజారున పడతాయని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఒక్క రోజు షాపులు తెరుచుకోకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు అక్కడక్కడ దుకాణాలు తెరచి ఉంచడంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, కదిరి డివిజన్ల పరిధిలో సుమారు 1600 మెడికల్ షాపులున్నాయి. వీటిపైనే ఆధారపడి వందలాది మంది జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలు చేయాలని భావిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్త బంద్‌లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. అనంతపురంలో పెద్ద సంఖ్యలో ఔషధ విక్రయాలు జరిగే సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్, శ్రీకంఠం సర్కిల్, పాతూరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లోని మెడికల్ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఆస్పత్రులకు అనుసంధానంగా ఉన్న మెడికల్ షాపులు తెరచుకోవడంతో కాస్త ఊరట కలిగించింది. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రంగారెడ్డి తెలిపారు. తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సర్వజనాస్పత్రి సమీపంలో జనరిక్ మందుల అమ్మకాలు జరిపే అన్న సంజీవని దుకాణం కూడా మూతపడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.