కదిలిన వైద్య సిబ్బంది
– గ్రామాల్లో వైద్య శిబిరాలు
ఎమ్మిగనూరు రూరల్ : మండలంలో ప్రబలిన విష జ్వరాలపై మంగళవారం ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించారు. ఎమ్మిగనూరు మండలంలోని వెంకటగిరి, ఎర్రకోట, కందనాతి, మసీదపురం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలు అందించారు. శిబిరాల్లో మాత్రలతోపాటు సూదులు కూడా వేశారు. వెంకటగిరి గ్రామాన్ని ఎంపీపీ వాల్మీకి శంకరయ్య సందర్శించి వైద్య శిబిరానికి వెళ్లి రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యంపై చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులకు సూచించారు. మసీదు పురంలో హాలహర్వి పీహెచ్‌సీ డాక్టర్ అఖిలేష్ రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఎర్రకోటలో దైవందిన్నె పీహెచ్‌సీ డాక్టర్ దుర్గాబాయి పరీక్షలు నిర్వహించి, సూదులు, మందులు వేశారు. ఈ గ్రామాల్లో మందును స్ర్పే చేయించి, బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించారు.