16 చోట్లకు మారిన ప్రొఫెసర్ లక్ష్మి
గుంటూరు : మెడికో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె భర్త విజయ సారథిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఐజీ సంజయ్ మీడియాకు వివరించారు. ప్రొఫెసర్ లక్ష్మితో పాటు ఆమె భర్తను సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నామని, లక్ష్మితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఐజీ తెలిపారు. సంధ్యారాణి ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్న లక్ష్మి...బెయిల్ వచ్చేవరకూ ఆచూకీ తెలియకూడదనే ఉద్దేశంతో 16 ప్రాంతాలు మార్చారని ఐజీ సంజయ్ తెలిపారు. పుల్లలచెరువు మొదలు పాండిచ్చేరీ, చెన్నై, తిరుపతి,గుంటూరు,హైదరాబాద్, షిర్డీ సహా బెంగళూరు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు చెప్పారు.
బెంగళూరులో లక్ష్మి దంపతులకు ప్రయివేట్ బ్యాంక్ ఉద్యోగి సహకరించాడని, అలాగే వారికి సహకరించినవారిపై చర్యలు తీసుకుంటామని సంజయ్ వెల్లడించారు. విచారణ దాదాపు పూర్తయిందని, టెక్నికల్ గా మరింత సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. అలాగే స్థానిక పోలీసుల వైఫల్యంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
ఈ కేసులో లక్ష్మి వేధింపులకు సంబంధించి ముఖ్యమైన ఆధారం ఆత్మహత్య చేసుకున్న సంధ్యారాణి డైరీ అన్నారు. ఈ ఏడాది ఆగస్ట్లోనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు ఆమె తన డైరీలో రాసుకున్నట్లు చెప్పారు. కేసు విచారణను జాప్యం చేస్తున్నారంటూ తమపై ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది టీమ్లు పనిచేశాయని ఐజీ తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
దురదృష్టకర ఘటన
సంధ్యారాణి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ప్రొఫెసర్ లక్ష్మి భర్త విజయ్ సారథి అన్నారు. చట్టం మీద గౌరవం ఉందని, అయితే బెయిల్ వస్తుందనే ఉద్దేశంతోనే తాము పలు ప్రాంతాలు తిరిగినట్లు చెప్పారు. కారణాలు ఏవయినా తమ కుటుంబంలో ఓ సభ్యురాలు చనిపోయిందనే బాధ తమలో ఉందన్నారు.
నేను ఏ తప్పు చేయలేదు
తాను ఏ తప్పు చేయలేదని, తనపై ఎలాంటి ఆరోపణలు లేవని ప్రొఫెసర్ లక్ష్మి అన్నారు. సంధ్యారాణికి పీజీలో గైనికాలజీ చేయడంపై ఆసక్తి లేదన్నారు. అయితే సంధ్యారాణి భర్త ఒత్తిడి చేయడంతోనే ఆమె గైనిక్ చేస్తోందని లక్ష్మి తెలిపారు. తాను చెప్పింది సంధ్యారాణి అర్థం చేసుకోలేదని అన్నారు.