professor lakshmi harassesment
-
16 చోట్లకు మారిన ప్రొఫెసర్ లక్ష్మి
-
16 చోట్లకు మారిన ప్రొఫెసర్ లక్ష్మి
గుంటూరు : మెడికో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె భర్త విజయ సారథిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఐజీ సంజయ్ మీడియాకు వివరించారు. ప్రొఫెసర్ లక్ష్మితో పాటు ఆమె భర్తను సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నామని, లక్ష్మితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఐజీ తెలిపారు. సంధ్యారాణి ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్న లక్ష్మి...బెయిల్ వచ్చేవరకూ ఆచూకీ తెలియకూడదనే ఉద్దేశంతో 16 ప్రాంతాలు మార్చారని ఐజీ సంజయ్ తెలిపారు. పుల్లలచెరువు మొదలు పాండిచ్చేరీ, చెన్నై, తిరుపతి,గుంటూరు,హైదరాబాద్, షిర్డీ సహా బెంగళూరు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు చెప్పారు. బెంగళూరులో లక్ష్మి దంపతులకు ప్రయివేట్ బ్యాంక్ ఉద్యోగి సహకరించాడని, అలాగే వారికి సహకరించినవారిపై చర్యలు తీసుకుంటామని సంజయ్ వెల్లడించారు. విచారణ దాదాపు పూర్తయిందని, టెక్నికల్ గా మరింత సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. అలాగే స్థానిక పోలీసుల వైఫల్యంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో లక్ష్మి వేధింపులకు సంబంధించి ముఖ్యమైన ఆధారం ఆత్మహత్య చేసుకున్న సంధ్యారాణి డైరీ అన్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లోనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు ఆమె తన డైరీలో రాసుకున్నట్లు చెప్పారు. కేసు విచారణను జాప్యం చేస్తున్నారంటూ తమపై ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది టీమ్‌లు పనిచేశాయని ఐజీ తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దురదృష్టకర ఘటన సంధ్యారాణి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ప్రొఫెసర్ లక్ష్మి భర్త విజయ్ సారథి అన్నారు. చట్టం మీద గౌరవం ఉందని, అయితే బెయిల్ వస్తుందనే ఉద్దేశంతోనే తాము పలు ప్రాంతాలు తిరిగినట్లు చెప్పారు. కారణాలు ఏవయినా తమ కుటుంబంలో ఓ సభ్యురాలు చనిపోయిందనే బాధ తమలో ఉందన్నారు. నేను ఏ తప్పు చేయలేదు తాను ఏ తప్పు చేయలేదని, తనపై ఎలాంటి ఆరోపణలు లేవని ప్రొఫెసర్ లక్ష్మి అన్నారు. సంధ్యారాణికి పీజీలో గైనికాలజీ చేయడంపై ఆసక్తి లేదన్నారు. అయితే సంధ్యారాణి భర్త ఒత్తిడి చేయడంతోనే ఆమె గైనిక్ చేస్తోందని లక్ష్మి తెలిపారు. తాను చెప్పింది సంధ్యారాణి అర్థం చేసుకోలేదని అన్నారు. -
గుంటూరుకు ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు
గుంటూరు : పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి బలవన్మరణం కేసులో నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున గుంటూరు తీసుకు వచ్చారు. వీరిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లక్ష్మితో పాటు ఆమె భర్త డాక్టర్ విజయసారథిని పోలీసులు సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు బెంగళూరులోని ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీస్ బృందం నిన్న దాడి చేసి వీరిని అరెస్టు చేసింది. వీళ్లు పోలీసులకు దొరక్కుండా 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాలు చుట్టేశారు. పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారితో పాటు, ఓ రిటైర్డ్ జడ్జి, అధికార నేతల సలహా మేరకే బెయిల్ వచ్చే వరకూ పోలీసులకు దొరకకూడదని వీరు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ప్రొఫెసర్ లక్ష్మిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం బూటకమని, బెయిల్‌పై జిల్లా కోర్టు, హైకోర్టులో ఆమెకు చుక్కెదురు అవడంతో గత్యంతరం లేని స్థితిలోనే ఆమె పోలీసులకు లొంగిపోయిందని న్యాయవాది వైకే ఆరోపించారు. -
ప్రొఫెసర్ లక్ష్మి దంపతుల అరెస్ట్
- మూడు రోజులుగా బెంగళూరులోని స్నేహితుడి ఇంట్లో మకాం - పక్కా సమాచారంతో దాడిచేసి పట్టుకున్న ప్రత్యేక పోలీస్ బృందం సాక్షి, గుంటూరు/ బెంగళూరు: డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మితో పాటు ఆమె భర్త డాక్టర్ విజయసారథిని పోలీసులు సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులుగా బెంగ ళూరులోని ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీస్ బృందం దాడి చేసి వీరిని అరెస్టు చేసింది. సోమవారం అర్థరాత్రికి వీరిని గుంటూరు తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా, లక్ష్మి దంపతులు పోలీసులకు దొరక్కుండా 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాలు చుట్టేశారు. పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారితో పాటు, ఓ రిటైర్డ్ జడ్జి, అధికార నేతల సలహా మేరకే బెరుుల్ వచ్చే వరకూ పోలీసులకు దొరకకూడదని వీరు నిర్ణరుుంచుకున్నట్లు సమాచారం. గత నెల 24న సంధ్యారాణి మృతిచెందగా, ఆ రోజు రాత్రి లక్ష్మి దంపతులు గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి ఏర్పాటు చేసిన ట్రావెల్స్ కారులో మొదట ప్రకాశం జిల్లాకు వెళ్లి, అటు నుంచి తమ కుమారుడు చదువుకుంటున్న పాండిచ్చేరి వెళ్లి అక్కడ ఓ లాడ్జిలో బస చేశారు. ఆ తర్వాత చెన్నై, తిరుపతి వెళ్లిన వీరు.. తమ కుమారుడిని తిరిగి పాండిచ్చేరికి పంపించేశారు. ఇక అటు నుంచి మహారాష్ట్రలోని షిరిడీ, శనిసింగనాపూర్, షోలాపూర్ వంటి పుణ్యక్షేత్రాలు తిరిగి చివరకు హైదరాబాద్ చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అరుుతే హైదరాబాద్‌లో వీరి జాడ కనిపెట్టలేక పోయారు. అక్కడి నుంచి మంత్రాలయం, మహానంది వంటి క్షేత్రాలకు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందడంతో కొన్ని బృందాలను పంపారు. మరోవైపు ఆమె భర్త, ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయసారథికి గతంలో రెండు సార్లు బైపాస్ సర్జరీ జరిగింది. అలాగే మానసిక ఒత్తిడి, యూరిన్‌లో రక్తం పడుతుండటంతో ఆయన మార్గంమధ్యలో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రయాణిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సినీఫక్కీలో అరెస్ట్ : ఈ క్రమంలో లక్ష్మి దంపతులు బెంగళూరుకు చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. కర్ణాటక డీజేపీ ఓం ప్రకాశ్‌తో పాటు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌కు సమాచారం అందించారు.ఆ దంపతులు ఏటీఎం ద్వారా ఎక్కడ డబ్బులు డ్రా చేసినా పోలీస్ అధికారుల సెల్‌కు మెసేజ్ వచ్చేలా బ్యాంకు అధికారుల సహకారం తీసుకున్నారు. బెంగళూరులోని జయనగర్‌లో ఓ స్నేహితుడి ఇంట్లో మూడ్రోజులుగా ఉన్న వీరు డబ్బులు డ్రా చేయాలని స్నేహితుడి కుమారుడికి ఏటీఎం కార్డు ఇచ్చి పంపారు. అలా డబ్బు డ్రా చేయగానే పోలీసు అధికారి సెల్‌కు మెసేజ్ రావడంతో వారు వెంటనే ఏటీఎం సెంటర్ లొకేషన్ కనిపెట్టి ఆ ఏరియా పోలీసులను అలర్ట్ చేసి.. అతన్ని వెంబడించి అతను ఇంట్లోకి వెళ్లగానే పోలీసులు ఆ గృహాన్ని చుట్టుముట్టి దాడి చేశారు. లక్ష్మి దంపతులు అక్కడే ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు.ఓ పోలీసు ఉన్నతాధికారి లక్ష్మి దంపతులకు తమ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు అధికార నేతల అండదండలు కూడా పుష్కలంగా ఉండటంతో చివరకు వీరిని పట్టుకోవడానికి పోలీసులకు 22 రోజులు పట్టింది. సెలవడిగితే శాడిజం చూపేది గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు పీజీ విద్యార్థుల లేఖ సాక్షి, గుంటూరు: ‘మొగుడితో గడపడానికైతే టైం ఉంటుందా’ అంటూ చెప్పలేని అసభ్య పదజాలంతో సంధ్యారాణిని ప్రొఫెసర్ లక్ష్మి వేధించేదని, ఆమె వల్లే డాక్టర్ సంధ్యారాణి మృతి చెందిందని, అదే విభాగంలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థులు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. డాక్టర్ సంధ్యారాణి మృతిచెందిన నాలుగు రోజులకే అంటే గత నెల 27న 23 మంది పీజీ వైద్య విద్యార్థులు ఈ లేఖలో తమ ఆవేదనను, సంధ్యారాణికి జరిగిన అన్యాయం గురించి వివరించారు. సంధ్యారాణిని ఉద్దేశించి లక్ష్మి చేసిన పరుష వ్యాఖ్యలను వారు అందులో ప్రస్తావించారు. -
ప్రొఫెసర్ లక్ష్మి అరెస్ట్
-
ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలి: కేటీఆర్
హైదరాబాద్ : గుంటూరు వైద్య కళాశాలలో మెడికో సంధ్యారాణి ఆత్మహత్యకు కారకులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సంధ్యారాణి తల్లిదండ్రులు శనివారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ వారు .. కేటీఆర్‌ను కోరారు. ప్రొఫెసర్ లక్ష్మి వేధించడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్యారాణి తన సూసైడ్ నోట్లో పేర్కొందని మంత్రికి సంధ్యారాణి కుటుంబీకులు వివరించారు. మరో రెండు నెలల్లో విద్య పూర్తి అయ్యేదని, అయితే ప్రొఫెసర్ వేధింపులకు ఇలా బలి అయిపోయిందని వాపోయారు. ఆమె కుటుంబానికి కేటీఆర్ సానుభూతి తెలుపుతూ వెంటనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రొఫెసర్ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం దారుణమంటూ ఆమె కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేకున్నా నిందితురాలికి శిక్ష పడాలని కోరారు. అలాగే ఏపీ డీజీపీ సాంబశివరావుతోనూ ఫోన్లో మాట్లాడి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుని నిందితురాలిని వెతికి పట్టుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కాగా, ఈ విషయంలో మృతురాలి కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఈమేరకు ఏపీ వైద్య విద్యార్థులకు హామీ ఇచ్చి వచ్చామని, దాన్ని నిలబెట్టుకుంటామని ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. లక్ష్మి భర్తను కూడా ఉద్యోగం నుంచి తప్పిస్తామన్నారు. అవసరమైతే ఏపీ సీఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడతారని సంధ్యారాణి కుటుంబానికి కేటీఆర్ హామీ ఇచ్చారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన సంధ్యారాణి పేరెంట్స్
హైదరాబాద్ : వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో విద్యార్థిని సంధ్యారాణి తల్లిదండ్రులు శనివారం ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తన కుమార్తె చావుకు కారణం అయిన ప్రొఫెసర్ లక్ష్మిపై ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డను కోల్పోయిన తమకు న్యాయం చేయాలని సంధ్యారాణి తల్లిదండ్రులు కోరారు. వైఎస్ఆర్ సీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాగా గుంటూరు జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లో వైద్యురాలు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డా.లక్ష్మి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. మరోవైపు రాజకీయ జోక్యంతోనే పోలీసులు ఆమెను అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తన ఆత్మహత్యకు ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని సంధ్యారాణి సూసైడ్ నోట్ రాయగా, ఈ ఘటనపై ఏర్పాటు అయిన కమిటీ కూడా లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. అయినా లక్ష్మిని అరెస్టు చేయకపోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లక్ష్మి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. -
ప్రొఫెసర్ లక్ష్మికి చుక్కెదురు
గుంటూరు: మెడికో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్ లక్ష్మికి కోర్టులో చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. గత నెల 24న మెడికో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ప్రొఫెసర్ లక్ష్మీ నిందితురాలు. దీంతో ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు నిరాకరించింది. జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తాళలేక పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి 12 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉంది. అయితే ముందస్తు బెయిల్ కోసం గుంటూరు జిల్లా కోర్టులో ఆమె తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను కోర్టు తొలుత ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. పోలీసులు కేసు డైరీ కోర్టుకు పంపకపోవడంతో బెయిల్‌పై విచారణను వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చారు. అప్పటివరకు ప్రొఫెసర్ లక్ష్మికి తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరఫు న్యాయవాది కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిందని విచారణ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. -
ప్రొఫెసర్ లక్ష్మి బెయిల్ పిటిషన్ 7కు వాయిదా
గుంటూరు : ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి కేసులో నిందితురాలిగా ఉన్న జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మి 12 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉంది. అయితే ముందస్తు బెయిల్ కోసం గుంటూరు జిల్లా కోర్టులో ఆమె తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను కోర్టు ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. పోలీసులు కేసు డైరీ కోర్టుకు పంపకపోవడంతో బెయిల్‌పై విచారణను వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చారు. అప్పటివరకు ప్రొఫెసర్ లక్ష్మికి తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరఫు న్యాయవాది కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. గురువారం పీజీ విద్యార్థులు భారీగా కోర్టు వద్దకు చేరుకుని ఉత్కంఠగా ఎదురు చూశారు. మరోవైపు తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలంటూ మృతురాలు డాక్టర్ సంధ్యారాణి తండ్రి సత్తయ్య తరఫు న్యాయవాది వైకే గురువారం పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సైతం కోర్టు 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిందని విచారణ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. -
బాలింతను జుట్టుపట్టి ఈడ్చి..
- బట్టబయలైన ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు - ఆమె వ్యవహారశైలిపై విచారణ కమిటీకి ఫిర్యాదుల వెల్లువ - వేధింపులు తాళలేకే సంధ్యారాణి ఆత్మహత్యని తేల్చిన విచారణ కమిటీ సాక్షి, అమరావతి/గుంటూరు: అప్పుడే పుట్టిన బిడ్డకు పాలిస్తున్న బాలింతను అసభ్య పదజాలంతో దూషిస్తూ జుట్టు పట్టుకుని మంచంపై నుంచి ఈడ్చి కింద పడేసింది.. నీ భర్త నీతో ఎలా కాపురం చేస్తున్నాడంటూ వికలాంగురాలైన స్టాఫ్ నర్సును తీవ్ర వేధింపులకు గురిచేసింది.. నొప్పులతో బాధపడుతున్న గర్భిణులను నోటికొచ్చినట్లు తిట్టేది.. పెళ్లి కోసం సెలవు పెట్టిన డాక్టర్ సంధ్యారాణిని చెప్పలేని భాషలో తిడుతూ తన శాడిజాన్ని ప్రదర్శించింది. ప్రాణాలు కాపాడే ఉన్నత స్థానంలో ఉన్న ఓ వైద్య అధికారిణి ఇవన్నీ చేసిందంటే నమ్మక తప్పదు. ఆమె వేధింపులను బయటకు చెప్పుకోలేక తీవ్రంగా మధనపడుతున్నవారు కొందరైతే.. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేక మిన్నకుండిపోయినవారు మరికొందరు. చివరకు ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తీవ్రస్థాయికి చేరడంతో భరించలేక పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. దీనిపై జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టడంతో ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసి విచారణ జరిపింది. ఈ సందర్భంగా వందలాది మంది లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ► జూలై 25న లాలాపేటకు చెందిన మౌనిక అనే బాలింత బిడ్డకు పాలిస్తూ ఉండగా.. ఆమె మూడేళ్ల పెద్ద కుమార్తె వార్డులో తిరుగుతోందనే కారణంతో మౌనికను లక్ష్మి జుట్టుపట్టి ఈడ్చి కింద పడేసి అసభ్య పదజాలంతో దూషించింది. దీనిపై మౌనిక భర్త విజయకుమార్ ఆర్ఎంవో రమేశ్, సూపరింటెండెంట్ రాజునాయుడుకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు సూపరింటెండెంట్ ఆదేశించారు. కానీ అప్పటికే మౌనిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు చూపి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. ► కుంటిదానివైన నిన్ను నీ భర్త ఎలా పెళ్లి చేసుకున్నాడు.. ఉన్నాడా.. వదిలి వెళ్లిపోయాడా.. అంటూ గైనకాలజీ ఓపీ విభాగంలో పనిచేసిన వికలాంగురాలైన స్టాఫ్ నర్సును తీవ్ర వేధింపులకు గురిచేసింది. దీంతో లక్ష్మిపై నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పకు ఆమె ఫిర్యాదు చేశారు. అంతా నిలదీయడంతో మరోసారి ఇలా జరగనివ్వనని చెప్పి లక్ష్మి తప్పించుకుంది. కానీ మళ్లీ అదే తరహాలో వేధింపులకు పాల్పడుతూనే ఉందని విచారణ కమిటీకి వంద మంది స్టాఫ్‌నర్సులు ఫిర్యాదు చేశారు. మరో 20 మంది పీజీ విద్యార్థులు, సుమారు 40 మంది నాల్గో తరగతి ఉద్యోగులు, జీజీహెచ్ వైద్యాధికారులు సైతం విచారణ కమిటీ ఎదుట లక్ష్మిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సహచర విద్యార్థినుల ముందు ఎంత అసభ్య పదజాలం వాడినా డా.సంధ్యారాణి ఓపికతోనే ఉండేదని, చివరకు ఆమె ఓపిక నశించి ఆత్మహత్యకు పాల్పడిందని కమిటీ తేల్చింది. ప్రొఫెసర్ వేధింపుల వల్లే సంధ్యారాణి మృతి చెందిందని నిర్ధారిస్తూ విచారణ కమిటీ ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా మంత్రి కామినేని శ్రీనివాస్ లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిందని ప్రకటించారు. నివ్వెరపోతున్న కమిటీ సభ్యులు ఇదిలాఉండగా, లక్ష్మి వ్యవహారశైలిపై పలువురు వెల్లడించిన విషయాలతో కమిటీ సభ్యులే నివ్వెరపోయినట్లు తెలుస్తోంది. విచారణలోని పలు అంశాలను వైద్య విద్యా శాఖకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ‘‘ఒక వైద్యురాలు తీవ్ర అసభ్య పదజాలాన్ని వాడటం దారుణం. ప్రతి చిన్న విషయాన్ని కూడా భార్యాభర్తల లైంగిక విషయాలకు ముడిపెట్టడం, సెలవులు అడిగినా ఏం భర్తను చూడలేకపోతే ఉండలేవా? అంటూ తీవ్ర అసభ్య పదాలు వాడినట్టు తేలింది’’ అని చెప్పారు. ఒక అధ్యాపకురాలు, విద్యార్థి మధ్య ఈ తరహా వేధింపులు ఇప్పటివరకూ వినలేదని పేర్కొన్నారు. లక్ష్మిని డిస్మిస్ చెయ్యండి.. ఆమె భర్తను తొలగించండి తన భార్య చనిపోయినా న్యాయం జరగడం లేదంటూ మనోవేదన చెందిన డా.సంధ్యారాణి భర్త డాక్టర్ రవి కూడా ఆత్మహత్యకు యత్నించి మృత్యువుతో పోరాడుతున్న విషయం తెలిసిందే. సంఘటన జరిగి 10 రోజులు దాటినా ప్రభుత్వం, పోలీసులు ఇంతవరకు లక్ష్మిని అరెస్టు చేయకపోవడంపై జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే లక్షి భర్త విజయసారథిని కూడా ఎంసీఐ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరారు. ప్రొ.లక్ష్మిని రక్షించేందుకు ఆయన ఉన్నతస్థాయిలో పావులు కదుపుతున్నాడని ఆరోపించారు. కాగా, ప్రొ.లక్ష్మిపై నివేదిక వచ్చినా.. ఇది కూడా చివరకు రిషితేశ్వరి ఆత్మహత్య కేసులాగే అవుతుందేమోనని జూనియర్ వైద్యుల సంఘం అనుమానం వ్యక్తం చేసింది.