వైఎస్ జగన్ను కలిసిన సంధ్యారాణి పేరెంట్స్
Published Sat, Nov 12 2016 4:47 PM | Last Updated on Tue, Oct 9 2018 7:18 PM
హైదరాబాద్ : వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో విద్యార్థిని సంధ్యారాణి తల్లిదండ్రులు శనివారం ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తన కుమార్తె చావుకు కారణం అయిన ప్రొఫెసర్ లక్ష్మిపై ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డను కోల్పోయిన తమకు న్యాయం చేయాలని సంధ్యారాణి తల్లిదండ్రులు కోరారు. వైఎస్ఆర్ సీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
కాగా గుంటూరు జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లో వైద్యురాలు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డా.లక్ష్మి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. మరోవైపు రాజకీయ జోక్యంతోనే పోలీసులు ఆమెను అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తన ఆత్మహత్యకు ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని సంధ్యారాణి సూసైడ్ నోట్ రాయగా, ఈ ఘటనపై ఏర్పాటు అయిన కమిటీ కూడా లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. అయినా లక్ష్మిని అరెస్టు చేయకపోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లక్ష్మి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement