ఇంటికి చేరని రేషన్
- మీ ఇంటికి ... మీ రేషన్ అమలు అంతంతే
- మంత్రి సొంత మండలంలోనూ అధ్వానం
- 26 మంది ఉంటే 6 మందికే అందిన వైనం
అనంతపురం అర్బన్ : జిల్లాలో మీ ఇంటికి.. మీ రేషన్ పంపిణీ అంతంత మాత్రంగానే జరుగుతోంది. చౌక దుకాణాలకు వచ్చిన రేషన్ తీసుకోలేని కార్డు దారుల ఇంటికి వీఆర్‌ఓలు నేరుగా వెళ్లి రేషన్ అంచాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ విధానం ఇప్పుడు మొక్కుబడి మారింది. పౌర సరఫరాల శాఖ మంత్రి సొంత మండలం రామగిరిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
1,246 మందిలో 836 మంది పంపిణీ
జిల్లా వ్యాప్తంగా 63 మండలాల పరిధిలో ప్రస్తుత నెలలో 1,286 మంది లబ్ధిదారులకు మీ ఇంటికి... మీ రేషన్ ద్వారా సరకులను వీఆర్‌ఓలు అందించాల్సి ఉంది. అధికారిక నివేదిక ప్రకారం 836 మంది మాత్రమే సరుకులను వీఆర్‌ఓలు అందజేశారు. 410 మందికి సరుకులు అందలేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత మండలం రామగిరిలోనూ మీ ఇంటికి... మీ రేషన్ సక్రమంగా అమలు కాలేదు. అక్కడ 26 మందికి మీ ఇంటికి– మీరేషన్ కింద సరుకులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఆరుగురికి మాత్రమే పంపిణీ చేశారు. మరికొన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గార్లదిన్నె మండలంలో ఇద్దరు ఉంటే ఇక్కడ మాత్రమే ఆ ఇద్దరికి అందజేశారు. పదహైదు మండలాల్లో ఫర్వాలేదు అనే విధంగా పంపిణీ జరిగింది. దీన్ని బట్టి చూస్తే విధానం అమలులో చిత్తశుద్ధి లోపించిందనేది స్పష్టమవుతోంది.
మచ్చుకు కొన్ని మండలాల్లో పంపిణీ
మండలం వీఆర్‌ఓలకు అప్పగించిన కార్డులు వీఆర్‌ఓలు పంపిణీ చేసింది సరుకులు అందని సంఖ్య
అనంతపురం 147 104 43
ధర్మవరం 60 36 24
గుంతకల్లు 51 13 38
రామగిరి 26 6 20
అమరాపురం 24 7 17
బొమ్మనహళ్ 25 15 10
రొద్దం 34 19 15
తాడిపత్రి 35 21 14
మడకశిర 25 12 13