అరచేతిలో అందాల పంట
అరచేతిలో అందాల పంట
Published Thu, Jul 21 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
‘గోరింటా పూసింది కొమ్మాలేకుండా..మురిపాల అరచేత మొగ్గాతొడిగింది...’వంటి పాటలు వినగానే..ఎర్రగా పండిన చేతులతో సందడి చేసే యువతులు, మహిళలే గుర్తుకొస్తారు. మిగతా కాలాల్లో ఏమో కానీ ఆషాఢ మాసంలో మాత్రం గోరింటాకు పెట్టుకోవాల్సిందే.æ సాయంత్రం వేళ సామూహికంగా కూర్చుని అరచేతులకు గోరింటా పెట్టుకుంటున్న మహిళలు మనకు ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంటారు. –విశాఖ–కల్చరల్
ఆషాఢంతో అనుబంధం
తెలుగునాట ఆషాఢ మాసానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. చెమటలు కక్కించిన గ్రీష్మం వెనక్కి తగ్గగా, వరుణుడి కటాక్షంతో పుడిమి తల్లి పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. చిరుజల్లులకు తనువు, మనసు పులకరిస్తుండగా..ఆత్మీయ బంధాల వైపు అందరి ప్రాణం లాగుతుంది. దీంతో కొత్తగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిన కూతుళ్లను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకొస్తారు. ఇంకేముందు ఆ వెంటనే కొత్తగా చిగురించిన గోరింటాకు చేతులకు పెట్టుకుని ఆ కూతురు మురిసిపోతుంటే తల్లిదండ్రులు పడే ఆనందం అంతా ఇంతా కాదు.
అందుబాటులో కోన్లు
గోరింటాకు కోసం వెతకకుండా రెడీమేడ్ కోన్లు కూడా సిటీలో లభిస్తున్నాయి.అలాగే ఆషాఢంలో వినియోగదారులు ఆకట్టుకునేందుకు సీఎంఆర్ వంటి కొన్ని కార్పొరేట్ సంస్థలు కొత్తగా పెళై ్లన యువతులను గుర్తించి చక్కటి డిజైన్లతో మెహందీ పెడుతున్నారు.
శాస్త్రియ ఆధారాలు
గోరింటాకు పెట్టుకోవాల్సిన కారణాలు, పెట్టకుంటే కలిగే లాభాలపై శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. వర్షకాలం, ఆషాఢం కలిసే వస్తాయి. దీంతో బురదలో ఎక్కువగా తిరిగే వారితోపాటు పొలాల్లో నాట్లు వేసే మహిళల పాదాలు దెబ్బతింటాయి. ఇళ్లలో ఉండే మహిళల పాదాలు కూడా నీటిలో నానుతాయి. ఈ మేరకు పాదాలకు గోరింటాకు పెట్టుకుంటే దానిలోని ఔషధ గుణాల వల్ల బాధతీవ్రత తగ్గుతుంది. నీటి తడికి చెడిపోతాయనే కారణంతో చేతులకు కూడా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
పురాణాల్లో
గోరింటాకు పెట్టే అరచేతులు, పాదాలు బాగా పండాలని మహిళలు, యువతలు కోరుకుంటారు. ఏమంటే భాద్రపద శుద్ధ తదియ రోజున సాక్షాత్తు పార్వతీదేవి మగువలకు ప్రసాదించిన అయిదోతనం సంపూర్ణమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక పెళ్లికాని యువతుల చేతులు గోరింటాకు మందార వర్ణంలో పండితే మంచి మొగుడొస్తాడనే పెద్దల చమత్కరిస్తుంటారు.
పాఠశాలల్లో పోటీలు
భారతీయ సంస్క తికి భావితరాలకు అందించేందుకు ముగ్గులు పోటీలను ఎన్నో సంస్థలు కొంత కాలంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల కొన్ని కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థునులకు మెహందీ పోటీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవలే మిత్రమండలి, సజన వంటి కొన్ని సంస్థలు పాఠశాలల్లో విద్యార్థులకు మెహందీ పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశాయి.
ఆషాఢంలో రెండుసార్లు
గోరింటాకు పెట్టుకుంటే చేతులు అందంగా కనిపించడమే కాదు ఆరోగ్యానికి మంచిది. అందుకే నేను ఆషాఢం ప్రారంభంతో పాటు చివరలో రెండుసార్లు పెట్టుకుంటా. కొత్తగా పెళ్లయి తల్లిగారి ఇంటికొచ్చిన వారు తప్పక పెట్టుకోవాలని పెద్దలు చెప్పేవారు.
–సుచిత్ర, విశాలాక్షినగర్
Advertisement