- పుష్కర స్నానానికి వెళ్లి నీట మునిగిన వైనం
- భద్రత చర్యలు లేవని అధికారులపై విమర్శలు
గోదావరిలో మునిగి యువకుడి మృతి
Published Sun, Aug 7 2016 6:51 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
కేదారిలంక (కపిలేశ్వరపురం) :
గోదావరి నదిలో కేదారిలంక వద్ద పుష్కర స్నానానికి వెళ్లిన యువకుడు యర్రంశెట్టి సతీష్(19) నీటమునిగి చనిపోయాడు. గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటనతో విషాదం అలముకుంది. అధికారులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేదారిలంక గ్రామానికి చెందిన సతీష్, తన ఇద్దరి స్నేహితులతో కలిసి పుష్కర స్నానానికి వెళ్లాడు. తొగరపాయ వద్ద అధికారికంగా పుష్కర ఏర్పాట్లు చేసినప్పటికీ, విశాలంగా ఉండడంతో సతీష్, అతడి స్నేహితులు ఇసుక ర్యాంపు రేవు వద్ద స్నానానికి దిగారు. స్నానం చేస్తుండగా సతీష్ అదుపుతప్పి నదిలో మునిగిపోయాడు. తహసీల్దార్ జి.చిన్నిబాబు ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టడంతో, అదే ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. ఎస్సై కె.దుర్గాప్రసాద్, వీఆర్‌ఓ వెంకటరమణ శవ పంచనామా చేసి, పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొడుకు అర్ధాంతరంగా దూరమయ్యాడంటూ సతీష్ తండ్రి నాగేశ్వరరావు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
చివరి క్షణంలో హడావిడి చర్యల వల్లే..
గ్రామంలో అంత్య పుష్కరాల నిర్వహణ కోసం ఘాట్‌కు అనుమతి ఇవ్వలేదు. చివరలో ఉన్నతాధికారులు రేవులో ఏర్పాట్లు చేయండంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో, గ్రామంలోని సూర్యగుండాల రేవు వద్ద అధికారికంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు అక్కడ కాకుండా, విశాలంగా ఉన్న ఇసుక ర్యాంపు రేవు వద్ద స్నానాలు చేస్తున్నారు. ప్రధాన పుష్కరాల సమయంలో కూడా ఇదే పరిస్థితి తలñ త్తడంతో, అధికారులు రెండు చోట్లా ఏర్పాట్లు చేసి, భద్రత చర్యలు తీసుకున్నారు. అంత్య పుష్కరాలకు మాత్రం ఇసుక ర్యాంపు రేవు వద్ద చర్యలు చేపట్టలేదు. పడవలో గజఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయలేదు. దీనిపై తహశీల్దార్ జి.చిన్నిబాబును వివరణ కోరగా, అపాయకర రేవు వద్ద స్నానాలకు దిగవద్దని రెవెన్యూ, పోలీసు సిబ్బంది వారిస్తున్నా, భక్తులు మాట వినకపోవడం వల్ల సమస్య తలెత్తిందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement