తామరాకుల కోసం వెళ్లి మృతి
Published Tue, Oct 18 2016 9:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
రాజానగరం :
గ్రామంలోని రావుల చెరువులో పెరిగిన తామరాకులను తీసి, వాటిని విక్రయిస్తూ గత రెండు దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న పసలపూడి సుబ్రహ్మణ్యం (52), అదే చెరువులో ప్రమాదవశాత్తు పడి మృత్యువాత పడ్డాడు. తరచు చేసే పనే అయినాగాని మద్యం మత్తు ఎక్కువగా ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పంచాయతీ కార్యదర్శితోపాటు పలువురు స్థానికులు భావిస్తున్నారు. గ్రామస్తులు మంచినీటి చెరువుగా ఉపయోగిస్తున్న రావుల చెరువులో తామరాకులు విపరీతంగా పెరుగుతుంటాయి. వాటిని తీసుకుని విక్రయించుకునేందుకు పంచాయతీ ప్రతి ఏటా వేలం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో గత రెందు దశాబ్దాలుగా పసలపూడి సుబ్రహ్మణ్యం, అతని కుటుంబ సభ్యులు దీనినే జీవనాధారంగా చేసుకుని తామరాకుల విక్రయాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే చెరువులోని ట్యూబ్ సాయంతో దిగిన సుబ్రహ్మణ్యం మద్యం సేవించి ఉండటంతో బ్యాలెన్స్‌ని సరిగా కవర్ చేసుకోలేక ప్రమాదానికి గురయ్యాడు. చెరువులో మృతి చెందిన అతని దేహాన్ని బయటకు తీసిన కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి హనుమంతరావును వివరణ కోరగా చెరువులో తామరాకులు తీసేందుకు ప్రస్తుతం ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. వేసవిలో చెరువును అభివృద్ధి చేసే సమయంలో రూ.వెయ్యి కట్టించుకుని అప్పటికి ఉన్న తామరాకులను తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు. అనధికారికంగా చెరువులోకి వెళ్లి, మద్య మత్తులో ప్రమాదానికి గురయ్యాడని సుబ్రహ్మణ్యం మృతికి కారణాలను వివరించారు.
Advertisement