ఎట్టకేలకు ఎంఈఓ పోస్టుల భర్తీ
ఎట్టకేలకు ఎంఈఓ పోస్టుల భర్తీ
Published Wed, Feb 8 2017 11:10 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM
కౌన్సెలింగ్ ద్వారా 50 ఎంఈఓలు, రెండు డీఐ పోస్టుల భర్తీ
ఏజెన్సీలో ఏడు ఎంఈవో పోస్టులు
రాయవరం : ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎంఈఓల పోస్టుల భర్తీ ఎట్టకేలకు బుధవారం పూర్తయింది. కౌన్సెలింగ్ ద్వారా జిల్లాలోని 50 ఎంఈఓ పోస్టులు, అర్బన్‌లో రెండు డీఐ పోస్టులు భర్తీ చేశారు. ఏజెన్సీలోని 11 ఎంఈఓ పోస్టుల్లో ఏడింటిపై ఎవరూ ఆసక్తి కనబర్చక పోవడంతో అవి భర్తీ కాలేదు. 1998లో కామన్ సర్వీస్ రూల్స్ ఉత్తర్వులను 505, 530 జీఓలుగా ప్రభుత్వం విడుదల చేసింది. 1998 తర్వాత కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండేలా 1998 నుంచి 2005 వరకూ పదోన్నతులను కల్పించారు. దీంతో ఎంఈఓ పోస్టులు కంబైన్డ్ సీనియారిటీ జాబితా ప్రకారం భర్తీ చేశారు. అయితే కంబైన్డ్ సర్వీస్ రూల్స్‌కు లోబడి పదోన్నతులు చేపట్టరాదంటూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులు 2005లో సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు. దీంతో పదోన్నతులు, బదిలీలు, నియామకాలు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ స్తంభించింది. ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన అభ్యర్థనను పరిగణలోనికి తీసుకుని 2009లో సుప్రీంకోర్టు అనుమతితో అడహక్ సర్వీస్ రూల్స్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూపొందించింది. 1998లో వచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఉమ్మడి సర్వీస్‌ల ప్రకారం 2005లో ఎంఈఓలకు పదోన్నతులు కల్పించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఇప్పటివరకూ ఉన్నత పాఠశాలల హెచ్.ఎంలను సీనియారిటీ ప్రాతిపదికన ఎంఈఓ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగిస్తూ వచ్చారు.
ఈ పరిస్థితుల్లో గ్రేడ్–2 గెజిటెడ్ హెచ్‌ఎంలతో ఎంఈవో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత ఇచ్చిన జీవోలు 10, 11లను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడంతో వాటికి సవరణ చేసి తిరిగి జీవో నంబరు 16, 17 విడుదల చేసింది. దీని ప్రకారం గ్రేడ్–2 హెచ్‌ఎంలను ఎంఈవో పోస్టుల్లో బదిలీ ద్వారా నియమించేందుకు మార్గం సుగమమైంది.
60 ఎంఈఓ పోస్టులకు..
జిల్లాలో 57 ఎంఈఓ పోస్టులకు, రాజమండ్రి, కాకినాడ అర్బన్ డీఐ పోస్టులకు బుధవారం కాకినాడ ఎస్‌ఎస్‌ఏ సమావేశమందిరంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్‌కు సీనియార్టీ జాబితాలో ఉన్న 470 మంది హాజరయ్యారు. అయితే మైదాన ప్రాంతంలో ఉన్న 46, ఏజెన్సీలో నాలుగు ఎంఈఓ పోస్టులు, కాకినాడ, రాజమండ్రి డీఐ పోస్టులు భర్తీ అయ్యాయి. ఏజెన్సీలోని మారేడుమిల్లి, రంపచోడవరం, దేవిపట్నం, అడ్డతీగల, వై.రామవరం, చింతూరు, కూనవరం మండలాలకు వెళ్లేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపలేదు.
నేడు విధుల్లో చేరిక..
కౌన్సెలింగ్‌లో మండలాలకు కేటాయించిన ఎంఈఓలు గురువారం విధుల్లో చేరాల్సి ఉంది. ఏజెన్సీ మండలాలను కోరుకున్న ఎంఈఓలు మాత్రం న్యాయ వివాదం అనంతరం విధుల్లో చేరాల్సిఉంటుంది.
Advertisement
Advertisement