- ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్
గైర్హాజరైన ఎంఈఓలను సస్పెండ్ చేయాలి
Published Thu, Aug 4 2016 12:11 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
కేయూ క్యాంపస్ : జిల్లాలో టీచర్ల వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియపై బుధవారం జరిగిన సమావేశానికి గైర్హాజరైన 11 మంది ఎంఈఓలను సస్పెండ్ చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ డీఈఓ రాజీవ్‌ను ఆదేశించారు.
టీచర్ల వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం డీఈఓ కార్యాలయంలో సమావేశం ఉంటుందని సమాచారం ఇవ్వగా.. జిల్లాలోని 51 మంది ఎంఈఓలలో 40 మంది మాత్రమే హాజరయ్యారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ.. ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. అనంతరం అందరు కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అయితే కలెక్టర్‌తో జరిగిన సమావేశం కొంత ఆలస్యం కావడంతో 20 మంది ఎంఈఓలు తమ తమ మండలాలకు వెళ్లిపోయారు. తర్వాత రాత్రి 7 గంటలకు కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఎంఈఓలతో సమా వేశం నిర్వహించారు. అయితే సమావేశానికి 20 మందే ఎంఈఓలు మాత్రమే హాజరుకావడంపై డీఈఓను కలెక్టర్ ప్రశ్నించారు. డీఈఓ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎంతమంది వచ్చారని.. ఇక్కడికి తక్కువ మంది ఎలా వచ్చారని అడిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి గైర్హాజరైన వారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్.. డీఈఓను ఆదేశించారు. అనంతరం హాజరైన ఎంఈఓలతో పాఠశాలలో టీచర్ల వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేయాలని సూచించారు.
Advertisement