కలవరం..
కలవరం..
Published Mon, Oct 24 2016 11:04 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
* కోల్డ్‌స్టోరేజి దగ్ధంతో ఆందోళన
* ఎవరికి ఎంత నష్టమో తెలియక రోజంతా పడిగాపులు
* 17 నుంచి 20 వేల టిక్కీలు దగ్ధమయ్యాయని ప్రా«థమిక అంచానా
* సమీక్షించిన కలెక్టర్..విచారణ జరుపుతామని వెల్లడి
గుంటూరు రూరల్: కోల్డ్‌స్టోరేజి దగ్ధమవుతోందన్న విషయం తెలిసిన లాలుపురం పంచాయతీ సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ మిర్చి నిల్వలు ఏమయ్యాయో అనుకుంటూ పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. తమ టిక్కీలు ఎక్కడున్నాయో...ఎలా ఉన్నాయో..ఎవరిని అడగాలో తెలియక ఉదయం నుంచీ అక్కడే దిగాలుగా ఉండిపోయారు. ధరకోసం మిర్చిని కోల్డ్‌స్టోరేజిలో నిల్వచేస్తే ప్రమాదం ముంచుకొచ్చిందని, తక్కువ ధరకు అమ్ముకున్నా కొంతైనా ఇబ్బందులు తొలగేవని, ఇప్పుడు ఏం జరుగుతుందోనని పలువురు రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీనంగా ఒకరికొకరు గోడు చెప్పుకుంటూ కనిపించారు. గుంటూరు రూరల్ మండలం లాలుపురం పంచాయతీలోగల లక్ష్మిలావణ్య కోల్డ్ స్టోరేజి సోమవారం ఉదయం అగ్నిప్రమాదానికి గురికావడంతో అక్కడ కనిపించిన పరిస్థితి ఇది.
ఏం జరిగింది...
సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కోల్డ్‌స్టోరేజిలో పనిచేసే సిబ్బంది యార్డులో అమ్మకాల కోసం మొదటగా బీ ఛాంబర్‌లో శాంపిల్స్‌ను తీశారని, అనంతరం ఏ ఛాంబర్‌లో శాంపిల్స్‌ను తీసేందుకు ప్రయత్నించగా విపరీతమైన కోరు వస్తుండటంతో గుమ్మస్తాలు బయటకు వచ్చి ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారని కోల్డ్‌స్టోరేజి యజమానులు ఆతుకూరి సాంబశివరావు, సత్యనారాయణ తెలిపారు. దీంతో విషయాన్ని పోలీసులు, ఫైర్ సిబ్బందికి తెలియపరచగా హుటాహుటీన అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఏ ఛాంబర్‌లోని 17 నుంచి 20వేల టిక్కీలకు పైగా దగ్ధమయ్యాయని, రూ 10 కోట్లకు పైగా నష్టం జరిగి ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా. పోలీసులు జోక్యం చేసుకుని బీ ఛాంబర్‌ను బద్దలు కొట్టించి అందులోని 90 శాతం పైగా టిక్కీలను బయటకు తీశారు. ఏ, బీ చాంబర్లలో మొత్తం మీద 40 వేల టిక్కీలవరకూ మిర్చి నిల్వలున్నాయని మరో 100 టిక్కీలు కారం న్విలున్నట్లు ఏసీ యజమానులు తెలిపారు.
9 ఫైరింజన్‌లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు
ఒక పక్క మిర్చి ఘాటు, దీనికి తోడు మంటలు దీంతో కోల్డ్ స్టోరేజ్ వద్ద ప్రజలు నిలబడేందుకు వీలు లేకుండా పోయింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మంటలు విపరీతంగా పెరిగి పోవటంతో ఫైర్ ఆఫీసర్ జిలాని ఆద్వర్యంలో 9 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి ఏడు గంటలవరకూ మంటలు అదుపులోకి రాకపోవటం, చీకటి పడటంతో చేసేదిలేక ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు నిలిపి వేశారు. మళ్లీ ఉదయం ఏ ఛాంబర్‌ను పగులగొట్టి పరిస్థితిని పరిశీలించనున్నారు.
విచారణ చేపడతాం: కలెక్టర్
కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పరిసరాల్లో ఫైర్ నిబంధనలు పాటించక పోవటంతో ఘటన జరిగి ఉంటుందని, దీనిపై సమగ్ర విచారణ చేయనున్నామని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న కలెక్టర్ హుటాహుటీన కోల్డ్‌స్టోరేజి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వీలైనంత త్వరగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలని ఫైర్ సిబ్బందిని ఆదేశించారు. ఫైర్ నిబంధనలు పాటించని కోల్డ్ స్టోరేజ్‌లను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోనున్నామన్నారు. అనంతరం సంఘటనా స్థలానికి మిర్చి యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు చేరుకుని పరిశీలించారు.
రికార్డుల స్వాధీనం..
స్టాక్ తాలూకు రికార్డులు, బిల్లులు తదితర పుస్తకాలను స్టోరేజ్ యజమానుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రాత్రి సమయంలో స్టోరేజ్‌లో విధుల్లో ఉన్న సిబ్బంది, గుమ్మస్తాలు, ముఠా సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. సంఘటన ఏలా జరిగింది.. విద్యుత్ ప్రమాదమేనా మరేదైనా కారణాలున్నాయా అనే కోణాల్లో సైతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
పోలీసుల జోక్యంతో కొంత సేఫ్..
కోల్డ్ స్టోరేజ్ దగ్ధమవుతుండటంతో అడిషనల్ ఎస్పీ సుబ్బారాయుడు, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కే. శ్రీనివాసరావు జోక్యం చేసుకుని బీ ఛాంబర్‌ను పోక్లెయిన్‌ల సహాయంతో అప్పటికప్పుడు పగుల గొట్టించారు. మంటలు బీ చాంబర్‌లోకి వ్యాపించక ముందే కొంతైనా నష్టాన్ని నివారించాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు చివరికి సఫలమయ్యాయి. బీ చాంబర్‌లోని 90 శాతంకు పైగా మిర్చి, కారం టిక్కీలను బయటకు తెచ్చి పక్కనే ఖాళీగా ఉన్న గోడౌన్‌లో నిల్వచేసి పటిష్ట బందోబస్తును చేశారు. పోలీసులు చొరవతో కొంత నష్టాన్ని కాపాడారని స్థానిక రైతులు, ప్రజలు అభినందించారు.
Advertisement
Advertisement