‘అమరావతి’కి మెట్రో వేస్ట్ | Metro is waste to Amaravathi | Sakshi
Sakshi News home page

‘అమరావతి’కి మెట్రో వేస్ట్

Published Mon, Apr 25 2016 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

‘అమరావతి’కి మెట్రో వేస్ట్

‘అమరావతి’కి మెట్రో వేస్ట్

♦ తగినంత జనం లేకుండా రాజధానికి మెట్రో’ను విస్తరించడం అనవసరం
♦ సాధ్యాసాధ్యాల నివేదికలో తేల్చిచెప్పిన ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించడం అనవసరమని శ్రీధరన్ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) తేల్చేసింది. జనం లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తే పెట్టుబడులు తిరిగి రావని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సలహాదారుగా ఉన్న ఢిల్లీ మెట్రో రూపకర్త శ్రీధరన్ రాజధానికి మెట్రో విస్తరణకు సంబంధించి రూపొందించిన సాధ్యాసాధ్యాల నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నట్టు సమాచారం.

 రూ.పదివేల కోట్ల ఖర్చవుతుందని అంచనా..
 విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కొనసాగింపుగా రెండో దశలో రాజధానికి మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాజధానికి మెట్రో రైలును విస్తరించాలంటే సుమారు రూ.పది వేల కోట్లు ఖర్చవుతుందని డీఎంఆర్‌సీ అంచనా వేసింది.

 ప్రయాణికులేరి?
 కారిడార్ నిర్మించే ప్రాంతంలో కనీసం 20 లక్షల జనాభా అయినా ఉండాలి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు మొదట్లో జనాభా సమస్య వస్తే శివారు ప్రాంతాలన్నింటినీ కలపి 20 లక్షల జనాభాను చూపించారు. ఇప్పుడు రాజధానిలో అంత జనాభాను ఎక్కడినుంచి తీసుకొస్తారనేది డీఎంఆర్‌సీ మొదటి ప్రశ్న. మెట్రో ప్రాజెక్టుపై ఖర్చుపెట్టిన డబ్బు తిరిగి రావాలంటే ప్రతిరోజూ 2.5 లక్షలనుంచి 3 లక్షల మంది ప్రయాణికులు అందులో ఎక్కాలి.  ప్రస్తుతం రాజధాని గ్రామాల జనాభా 98 వేలు. అన్నీ అనుకున్నట్లు జూన్‌లో తాత్కాలిక సచివాలయం ప్రారంభమైతే నాలుగు వేలమంది ఉద్యోగులు, ఇతరులు ఒక వెయ్యిమంది అక్కడికొచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో మెట్రో ఎక్కేవారి సంఖ్య వందల్లోనే ఉంటుందని డీఎంఆర్‌సీ వాదన.

 గుంటూరుకు మెట్రో విస్తరణా అసాధ్యం!
 సీడ్ రాజధాని నుంచి గుంటూరుకు మెట్రో విస్తరణ కూడా సాధ్యమయ్యే పనికాదని డీఎంఆర్‌సీ తేల్చింది. గుంటూరు జనాభా ఆరు లక్షలు దాటలేదని, ఈ నేపథ్యంలో అక్కడికి ప్రాజెక్టును విస్తరించడం ఏ కోణంలోనూ సరికాదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement