Vijayawada metro rail project
-
తక్కువ ఖర్చు.. ఎక్కువ సౌకర్యాలు
మూడు కారిడార్లు ఇవే.. 1. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్, రామవరప్పాడు రింగు రోడ్డు మీదుగా గన్నవరం విమానాశ్రయం వరకూ 26 కి.మీ. 2. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకూ 12.5 కి.మీ. 3. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కేసీ కెనాల్ జంక్షన్ మీదుగా అమరావతి వరకూ 24 కి.మీ. సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును సాధ్యమైనంత తక్కువ వ్యయంలో ఎక్కువ సౌకర్యాలతో ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును భారీ వ్యయంతో చేపట్టాలని నిర్ణయించి ప్రణాళికలు రూపొందించినా అవి కార్యరూపం దాల్చలేదు. మీడియం మెట్రో రైలు వ్యవస్థను రూ.7,200 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు మెట్రో శ్రీధరన్ నేతృత్వంలోని డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) సవివర నివేదిక రూపొందించి ఇవ్వగా, దానిపై టెండర్లు కూడా పిలిచి నిర్మాణ సంస్థను ఖరారు చేసే దశలో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాము చెప్పిన సంస్థకే నిర్మాణ బాధ్యతను అప్పగించాలని అప్పటి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసినా శ్రీధరన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం మీడియం మెట్రో రైలు ప్రతిపాదనను ఉపసంహరించుకుని లైట్ మెట్రోను ముందుకు తెచ్చింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) ఆధ్వర్యంలో లైట్ మెట్రో రైలు వ్యవస్థపై సవివర నివేదిక తయారు చేసే బాధ్యతను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థకి అప్పగించగా విజయవాడలో రెండు, విజయవాడ నుంచి అమరావతికి మరో కారిడార్ నిర్మించేలా ప్రణాళిక రూపొందించింది. సీఎం సూచనలకు అనుగుణంగా మార్పులు.. ఈ ప్రణాళికపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏఎంఆర్‌సీ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. గతంలో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్, రామవరప్పాడు రింగు రోడ్డు మీదుగా గన్నవరం విమానాశ్రయం వరకూ 26 కి.మీ. మేర ఒక కారిడార్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకూ 12.5 కి.మీ. మేర మరో కారిడార్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కేసీ కెనాల్ జంక్షన్ మీదుగా అమరావతి వరకూ 24 కి.మీ. మేర మూడో కారిడార్ నిర్మించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశారు. మూడో కారిడార్‌ను భూగర్భంలో నిర్మించాలనే ప్రతిపాదనపై వెడల్పైన రోడ్లు ఉండగా భూగర్భ మార్గం అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. నేల మీద కి.మీ.కు రూ.120 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉండగా భూగర్భ మార్గంలో కి.మీ.కు రూ.450 కోట్లు అవుతుంది కాబట్టి నేల మీదే మెట్రో మార్గానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఎలివేటేడ్ రైలు మార్గంలో ఎక్కడా విద్యుత్ లైన్లు, వైర్లు బయటకు కనపడకుండా చూడాలని సూచించారు. దేశంలో మిగతా మెట్రో రైలు కారిడార్ల కంటే మరింత మెరుగ్గా, డిజైన్లు ఆకర్షణీయంగా, అత్యాధునికంగా ఉండేలా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ఎక్కువ వ్యయం కాకుండా చూడాలని ఆదేశించారు. రెండు మూడు దశల్లో మెట్రో రైలు రెండు, మూడు దశల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా డీపీఆర్‌ను సవరించే బాధ్యతను కేఎఫ్‌డబ్ల్యూ సంస్థకే అప్పగించాం. నెల రోజుల్లో ఈ సంస్థ డీపీఆర్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీపీపీ విధానంలో చేపట్టాలా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలా అనే దానిపై డీపీఆర్ వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. – రామకృష్ణారెడ్డి, ఎండీ, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ -
బెజవాడ మెట్రో రైలుకు మంగళం
-
అటకెక్కిన బెజవాడ మెట్రో!?
సాక్షి, అమరావతి: విజయవాడలో మెట్రో రైలును పరుగులు పెట్టిస్తామని కొద్దికాలం వరకూ హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాన్నే మరచిపోయింది. పనులు ప్రారంభమయ్యే దశలో మీడియం మెట్రో ప్రాజెక్టును రద్దు చేసుకుని లైట్ మెట్రో వైపు వెళ్లిన ప్రభుత్వం ఇప్పుడు దాన్నీ పట్టించుకోడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కేంద్రం కూడా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఈసారి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అసలు ఇప్పటివరకూ లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్) రూపకల్పనకే ముందడుగు పడలేదు. దీంతో మెట్రో ప్రాజెక్టు ఉంటుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం మూడేళ్ల క్రితం శ్రీధరన్ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)తో డీపీఆర్ (సవివర నివేదిక) తయారుచేయించి ఆమోదించింది. రూ.7,200 కోట్లతో బందరు, ఏలూరు రోడ్లలో రెండు కారిడార్లుగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించి దాని నిర్మాణ బాధ్యతను కూడా డీఎంఆర్‌సీకే ప్రభుత్వం అప్పగించింది. డిజైన్లు, ఎలైన్మెంట్ సహా అన్ని పనులను డీఎంఆర్సీ పూర్తిచేసి ప్రాజెక్టు నిర్మాణానికి రెండుసార్లు టెండర్లు కూడా పిలిచింది. అయితే, టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సిన సమయంలో ప్రభుత్వం హఠాత్తుగా అసలు ఈ ప్రాజెక్టే వద్దని యూ టర్న్ తీసుకుంది. ఎల్ అండ్ టీకి శ్రీధరన్ నిరాకరణ ఎల్ అండ్ టీ సంస్థకు ప్రాజెక్టు పనులు అప్పగించాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం, 30 శాతం అదనంతో ఆ సంస్థ దాఖలు చేసిన టెండర్లపై శ్రీధరన్ అసంతృప్తి వ్యక్తంచేసి టెండర్లనే రద్దు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎల్ అండ్ టీకి పనులు అప్పగించేందుకు ఆయన నిరాకరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్టునే రద్దుచేసింది. మరోవైపు.. ఈ ప్రాజెక్టువల్ల బందరు, ఏలూరు రోడ్లకిరువైపులా ఉన్న తమ సంస్థల వ్యాపారం దెబ్బతింటుందని బడా వ్యాపారులంతా గగ్గోలు పెట్టారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఒకవైపు వ్యాపారుల ఒత్తిడి, మరోవైపు అదనపు రేటుకు తాను చెప్పిన కంపెనీకి పనులిచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును అటకెక్కించినట్లు తెలుస్తోంది. తెర మీదకు లైట్‌మెట్రో ఇదిలా ఉంటే.. తక్కువ వ్యయంతో లైట్ మెట్రో ప్రాజెక్టును చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దాని డీపీఆర్ బాధ్యతను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్లు్య సంస్థకు అప్పగించింది. వాస్తవానికి మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు కేఎఫ్‌డబ్లు్య ఇక్కడకు వచ్చింది. దానికి డీపీఆర్ బాధ్యత అప్పగించడంతో ఇప్పటివరకూ ఆ పని పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. ఆ సంస్థ ఉత్సాహంగా ఉన్నా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం మానేసింది. ఈ నేపథ్యంలో అసలు లైట్ మెట్రో అయినా పట్టాలెక్కుతుందా లేదో అనుమానంగానే మారింది. ఒకవేళ కేఎఫ్‌డబ్లు్య సంస్థ డీపీఆర్ రూపకల్పన పనిని వెంటనే ప్రారంభించినా అది పూర్తయ్యేసరికి ఆరు నెలలు పడుతుంది. ఆ తర్వాత భూసేకరణ, ఇతర పనులకు సమయం కావాలి. అంటే ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి ఏమాత్రం కనిపించడంలేదు. మరోవైపు, ప్రభుత్వ పెద్దలే కావాలని మెట్రోను పక్కన పెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బెజవాడ మెట్రో రైలు ప్రస్థానం ఇలా.. జులై 2014: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారుగా శ్రీధరన్ నియామకం సెప్టెంబర్ 2014 : డీఎంఆర్సీకి మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ (సవివర నివేదిక) రూపకల్పన బాధ్యత అప్పగింత ఏప్రిల్ 2015 : ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించిన డీఎంఆర్సీ. ప్రాజెక్టు వ్యయం రూ.6769 కోట్లు. బస్టాండ్–పెనమలూరు, బస్టాండ్–నిడమానూరు కారిడార్లను 26 కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రతిపాదన. 70 ఎకరాల భూసేకరణ.. ఇందుకు అదనంగా రూ.431 కోట్లు ఖర్చు అంచనా మే 2015 : డీఎంఆర్సీ ఇచ్చిన డీపీఆర్‌ను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2015 : మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు. దానికి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ)గా నామకరణం. ఫిబ్రవరి 2016: మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం జపాన్‌కు చెందిన జైకాతో చర్చలు జూన్ 2016: ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచిన డీఎంఆర్సీ ఆగస్టు 2016: టెండర్లను రద్దు చేసిన డీఎంఆర్సీ డిసెంబర్ 2016: జైకాతో రుణం మంజూరు చర్చలు విఫలం మార్చి 2017: నూతన మెట్రో విధానాన్ని రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విజయవాడ మెట్రో ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం ఆగస్టు 2017: ప్రాజెక్టు కోసం రెండోసారి టెండర్లు పిలిచిన ఏఎంఆర్‌సీ అక్టోబర్ 2017 : మళ్లీ టెండర్లు రద్దు చేసిన ఏంఎఆర్‌సీ నవంబర్ 2017 : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు స్థానంలో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన నవంబర్ 2017: డీఎంఆర్‌సీతో తెగతెంపులు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూతో లైట్ మెట్రో ప్రాజెక్టు గురించి చర్చలు నవంబర్ 2017: విజయవాడకు లైట్ మెట్రో ప్రాజెక్టు తీసుకొస్తామని ప్రకటించిన చంద్రబాబు, డీపీఆర్ ఇవ్వాలని కేఎఫ్డబ్లు్యకు బాధ్యత. -
బాబూ మీకో నమస్కారం!
- సలహాదారు పదవికి మెట్రో శ్రీధరన్ రాజీనామా - చంద్రబాబు తీరుతో తీవ్ర మనస్తాపం - రూ.500 కోట్ల వ్యయం పెరిగినా ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్‌కే పనులివ్వాలని ఒత్తిడి - తిరస్కరించినందుకు 6 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వని బాబు సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు తీరుతో విసిగిపోయిన మెట్రో రైలు ప్రాజెక్టుల పితామహుడు శ్రీధరన్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఆరు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించడంతో పాటు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం ఆయన నేతృత్వం వహిస్తున్న డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్)పై లేనిపోని అభాండాలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 12వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన నేరుగా రాజీనామా లేఖ పంపారు. అయినా ఆయన స్పందించలేదు సరికదా వెంటనే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు స్థానంలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూకు ఇవ్వాలని నిర్ణయించారు. దీని వెనుక పెద్ద గూడు పుఠాణీ జరిగినట్లు సమాచారం. మెట్రో రైలు ప్రాజెక్టు పనులను అంచనాల కంటే చాలా ఎక్కువ రేటుకు ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్థలకు ఇవ్వాలని చంద్రబాబు చేసిన సూచనను శ్రీధరన్ తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వ పెద్దలు ఆయన్ను టార్గెట్ చేసుకుని ఒక వ్యూహం ప్రకారం ఆయనంతట ఆయనే రాజీనామా చేసే పరిస్థితి కల్పించారు. గత సంవత్సరం డిసెంబర్లో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులోని రూ.1700 కోట్ల విలువైన రెండు కారిడార్ల పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని డీఎంఆర్సీ ప్రతిపాదించింది. అయితే వీటన్నింటినీ ఒకే ప్యాకేజీగా టెండర్ పిలవాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. తమ నిబంధనల ప్రకారం రూ.500 కోట్లకు మించిన పనుల్ని రెండు ప్యాకేజీలుగా విభజించాల్సి వుందని, అంతకంటే ఎక్కువ మొత్తానికి ఒకే టెండర్ పిలవడం వల్ల ఆర్థిక స్థోమత లేక ఎక్కువ సంస్థలు పోటీ పడే అవకాశం ఉండదని.. దీనివల్ల ఒకటి, రెండు కంపెనీలే ఎక్కువ మొత్తానికి కోట్ చేసే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వానికి డీఎంఆర్సీ నివేదించింది. అయినా ప్రభుత్వం వినకుండా రెండు ప్యాకేజీలుగానైనా విభజించి టెండర్లు పిలవాలని సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూ.800 కోట్లతో కారిడార్–1కు, రూ.900 కోట్లతో కారిడార్–2కు టెండర్లు పిలిచింది. ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్, సింప్లెక్స్ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ కుమ్మక్కు సింప్లెక్స్ సంస్థ టెండరు దాఖలు చేశాక, తనకు ఆర్థిక స్థోమత సరిపోనందున డిస్క్వాలిఫై అవుతానని లేఖ రాసి పక్కకు తప్పుకుంది. ఈ నేపథ్యంలో కారిడార్–1కి ఎల్ అండ్ టీ 45 శాతం, ఆఫ్కాన్స్ 55 శాతం ఎక్సెస్‌కు, కారిడార్–2కు ఎల్ అండ్ టీ 45 శాతం, ఆఫ్కాన్స్ 35 శాతం ఎక్సెస్‌కు టెండర్ కోట్ చేశాయి. దీనిప్రకారం కారిడార్–1 పనులు ఎల్ అండ్ టీకి, కారిడార్–2 పనులు ఆఫ్కాన్స్‌కు దక్కుతాయి. కారిడార్–2లో 35 శాతం ఎక్సెస్‌కు కోట్ చేసిన ఆఫ్కాన్స్.. కారిడార్–1కి 55 శాతం కోట్ చేయడం వెనుక లాలూచీ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. రెండు సంస్థలు రింగైనట్లు గమనించిన డీఎంఆర్సీ, దీనివల్ల ప్రాజెక్టుపై రూ.500 కోట్ల అదనపు భారం పడుతుందని సర్కారుకు నివేదించి టెండర్లు రద్దు చేసింది. మళ్లీ ఇలా జరక్కుండా నాలుగు ప్యాకేజీలుగా పనుల్ని విభజించి మళ్లీ టెండర్లు పిలుస్తామని ప్రతిపాదించగా ప్రభుత్వ పెద్దలు స్పందించకుండా తాము చెప్పిన వారికి పనులు ఇవ్వలేదనే ఆగ్రహంతో సంప్రదింపులను సైతం నిలిపివేసింది. పరిస్థితిని వివరించడానికి శ్రీధరన్ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదు. పైగా విజయవాడకు మెట్రో అనవసరమని, అంత ఖర్చుతో మెట్రో లైన్లు వేయడం కంటే ఫ్లైఓవర్లు కడితే సరిపోతుందని స్వయంగా చంద్రబాబు నెల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏఎంఆర్‌సీ (అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్).. మెట్రో స్థానంలో ఎలివేటెడ్ కారిడార్ తీసుకొస్తామని ప్రకటించింది. కొద్దిరోజులకు అది సరిపోదని లైట్ మెట్రో రైలు కావాలని జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థతో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయించింది. ఈ దశలో చివరిగా గత నెల 5వ తేదీన శ్రీధరన్ ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ లైట్ మెట్రో రైలు (ఎల్‌ఆర్‌టీ) విజయవాడకు సరిపోదని, ఇప్పుడున్న స్థితిలో మెట్రోయే సరైనదని పేర్కొన్నారు. అయినా పట్టించుకోని ముఖ్యమంత్రి ఎల్‌ఆర్‌టీ కోసం కేఎఫ్డబ్ల్యూతో సర్వే చేయిస్తుండడంతో మనస్తాపం చెందిన శ్రీధరన్ గత నెల 12వ తేదీన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకుంటానని లేఖ రాస్తే.. అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ ఒప్పుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం తనకు కమీషన్లు ఇచ్చే కంపెనీల కోసం శ్రీధరన్‌ను తీవ్రంగా అవమానించి రాష్ట్రం నుంచి సాగనంపారు. -
బెజవాడ మెడకు గుదిబండ
విజయవాడలో మెట్రో రైలు పనులను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా నగర స్వరూపాన్ని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిష్పాక్షికంగా కొన్ని ముఖ్య విషయాలను చర్చించాలి. నిర్ణయాలు జరిగిపోయాయి కాబట్టి ఇక చర్చించడానికి ఏమీ లేదని అధికారిక వర్గం నుంచి సమాధానం వస్తుంది. ఆ వాదనను ప్రశ్నించడానికైనా చర్చ అవసరం. 2008 నాటి ఒక కేంద్ర ప్రభుత్వ అధ్యయనం ప్రకారం 10 నుంచి 20 లక్షల జనాభా ఉన్న నగరాలలో (విజయవాడ ఈశ్రేణిలోనిదే) 24% కాలి నడకన, 19% సైకిళ్ల మీద, 24% మోటారు సైకిళ్లు/స్కూటర్ల మీద, 13% ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా, 12% కార్లలో, 8% ఆటో/టాక్సీలలో రోజూ నగరంలో సంచరిస్తుంటారు. అంటే కాలి నడకన, సైకిళ్లపైన పయనించే వారు దాదాపు నగర జనాభాలో 43%. మోటారు, రైలు వంటి రవాణా మాధ్యమాలకు భిన్నంగా వారు ఎలాంటి కాలుష్యాన్ని కలుగజేయరు. నేడు అభివృద్ధి చెందిన దేశాలు ఈ రెండు మాధ్యమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. మన దేశంలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. నగర జనాభా పెరిగే కొద్దీ పాదచారులు, సైకిల్ ప్రయాణికుల శాతం తగ్గిపో తోంది. కాలుష్య కారకాలైన ఇతర మాధ్యమాల ప్రాధాన్యం పెరుగుతోంది. ‘మెట్రో’పై ఎందుకీ మోజు? నగర రవాణా మాధ్యమాలన్నిటిలోకీ మెట్రో రైళ్లు అత్యంత భారీ వ్యయంతో కూడిన, ఖరీదైన మాధ్యమం. అంతకన్నా తక్కువ ఖర్చుతో వీలైన ఇతర రవాణా వ్యవస్థలకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతనే వాటి గురించి ఆలోచిం చాలి. అభివృద్ధిచెందిన దేశాలలో పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు లేని పట్టణమే ఉండదు. అడ్డంకులులేని, సురక్షితమైన ఫుట్పాత్లుంటే పాద చారులు వేగంగా నడవగలుగుతారు. అలాంటి సదుపాయం ఉంటే విజయ వాడ బందరు, ఏలూరు రోడ్లలో ఎన్ని వేలమంది నడుస్తూ వెళతారో ఊహిం చండి. మన అన్ని నగరాల్లోనూ పాదచారులు, సైకిళ్లపై వెళ్లేవారు, రోడ్డు దాటేవారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. మన నగరాలలో ప్రజా రవాణాకు వెన్నెముక రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థ. వివిధ దేశాల్లో రద్దీగా ఉండే కొన్ని గంటలు ప్రయాణీకుల బస్సులకు రోడ్లైపై ప్రాధాన్యం ఇస్తారు. ఆ సమయంలో ప్రైవేటు వాహనాలపై నియంత్రణ విధిస్తారు. కానీ మన ప్రభు త్వాలు కీలకమైన రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థల అభివృద్ధిని విస్మరిస్తూ మెట్రో రైళ్లపై మోజును చూపిస్తున్నారు. విజయవాడ మెట్రో ఈ కోవకే చెందుతుంది. పోనీ భవిష్యత్తులో విజయవాడ ఒక పెద్ద మెట్రోపాలిటన్ నగరంగా రూపాంతరం చెందే అవకాశం ఉంటే దూరదృష్ట్టితో నిర్మిస్తున్నారనుకోవచ్చు గానీ, అదీ లేదు. ఏపీ వునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు, హైదరా బాదులో మెట్రో నిర్మాణం జరుగుతున్నది వంటి కారణాల వల్ల మనం మెట్రో ైరైల్ నిర్మాణం చేపట్టాలా? లేక విజయవాడ నగర అవసరాల వల్లనా? 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ కార్పొరేషన్ జనాభా 10.34 లక్షలు. దాని చుట్టూ ఉన్న 23 చిన్న పట్టణాలు (మంగళగిరి, తాడేపల్లిల సహా), పంచా యతీలు, గ్రామాలు కలుపుకుని చూసినా 14.91 లక్షలు. 1991 తర్వాత రెండు దశాబ్దాలలో నగర పెరుగుదల దాదాపు 20%. ఇప్పుడు రాజధాని ప్రాంతం అయింది కాబట్టి జనాభా గణనీయంగా పెరుగుతుందనే వాదన నిరాధారమై నది. గత రెండు, మూడు దశాబ్దాలలో దేశంలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గిన రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు తర్వాతి స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌దే. నేడు 2.5 లక్షలుగా ఉన్న అమరావతి ప్రాంత జనాభా (తాడేపల్లి సహా) రెండు దశా బ్దాలలో 45 లక్షలకు పెరుగుతుందనీ, సీఆర్డీఏ పరిధి జనాభా 2035 నాటికి కోటీ 35 లక్షలకు పెరుగుతుందని వేసిన అంచనాలు ఊహాత్మకమైనవి. ఇవి 2015 సింగపూర్ మాస్టర్ ప్లాన్ రూపకర్తల మాయ లెక్కలు తప్ప వాస్తవాలతో ఎలాంటి పొంతనా లేనివి. ఆ ఊహాత్మక లెక్కలతోనే రాజధాని ప్రాంతానికి 147 కిలోమీటర్ల మైట్రో రైలును ప్రతిపాదించారు. అందులోని మొదటి అంకం విజయవాడ మెట్రో. విశాలమైన ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయించుకోడానికి అమరావతి మెట్రోగా పేరు మార్చి ‘మైండ్ గేమ్’ వ్యూహాన్ని ప్రయోగించారు. ఇక హైదరాబాద్‌లా అమరావతి ప్రాంత జనాభా పెరుగుతుందనడమూ భ్రమే. రాయలసీమకు ఆనుకుని చెన్నై, బెంగ ళూరు, హైదరాబాద్ మహా నగరాలున్నాయి. హైదరాబాద్‌లాగా అమరావతి విద్యార్థులు, సంఘటిత, అసంఘటిత కార్మికులను ఆకర్షించడం అసాధ్యం. ఉదాహరణకు ఐటీ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టదలుచుకుంటే ఎంచు కునేది విశాఖపట్టణాన్నే గానీ, అమరావతిని కాదు. గోప్యత ప్రమాదకర వ్యూహం ఖరీదైన ఒక భారీ ప్రాజెక్టును నగరంపై రుద్దేముందు సరైన అధ్యయ నాలను చేపట్టడం, వాటిని సమీక్షించడం చాలా అవసరం. ప్రస్తుత విజయవాడ నగర రవాణా సమస్యలపై ఒక విస్తృతమైన అధ్యయనం లేకుండానే కీలకమైన ఆ సమస్యకు మెట్రోనే పరిష్కారమనే నిర్ధారణకు ఎలా వచ్చారు? హైదరా బాద్‌లో ఉంది కాబట్టి ఇక్కడా నిర్మించాలనుకోవడం అవివేకం. మీడియా సమాచారం ప్రకారం ఈ మెట్రో నిర్మాణం రెండు కారిడార్లలో ఉంటుంది. కారిడార్-1 మెయిన్ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు 12.76 కి.మీ. కాగా, కారిడార్-2 మెయిన్ బస్టాండ్ నుంచి నిడమనూరు వరకు 13.27 కి.మీ. (మొత్తం 26.03 కి.మీ.. ఇది ఏలూరు, బందరు రోడ్ల మధ్య డివైడర్ల స్థానంలో నిర్మించే స్తంభాలపై పెద్ద ఫ్లైఓవర్లాంటి ఎలివేటెడ్ మెట్రో. దీని అంచనా వ్యయం రూ. 6,823 కోట్లు. అందులో రూ. 4,000 కోట్లు జపాన్‌కు చెందిన జైకా బ్యాంకు అప్పుగా ఇస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 20% సమకూరుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మెట్రో పితామహుడనే శ్రీధరన్ అధ్యయనాలను పూర్తిగా నమ్మలేము. మెట్రో నిర్మాణానికి అవసరమైన నివేదికను తయారుచేసే బాధ్యతను మాత్రమే ప్రభుత్వం ఆయనకు అప్పజెప్పింది. కాబట్టి మెట్రో నిర్మించడానికి అవసరమైన నివేదికనే ఆయన తయారు చేస్తారు. ఆయన పేరును వాడుకుంటూ ప్రభుత్వాలు మెట్రోను విమర్శించే వారిపై దాడికి దిగుతాయి. శ్రీధరన్ నిజంగా శాస్త్రీయమైన అధ్యయనం జరిపి ఉంటే ఆ నివేదికలను ఎందుకు బయట పెట్టడం లేదు? నగర ప్రజా ప్రతినిధులకు, రాజకీయ పార్టీలకు సైతం తెలియనీయకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం ఒక ప్రమాదకర వ్యూహాన్ని అమలు చేయడానికి పూనుకుంది. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులలో ఏముందో బయటికి తెలియకముందే టెండర్లను పిలవడం కూడా జరిగింది. ఈ వ్యూహానికి విజయ వాడ నగరం బలికాకుండా కాపాడుకోవలసిన అవసరం ఉంది. నగరానికి తల మానికమైన ఏలూరు, బందరురోడ్లలో రోజూ ఎంత మంది ప్రయాణిస్తున్నారు? భవిష్యత్తులో ఎంత మంది ప్రయాణిస్తారు? విజయవాడ నగర జనాభా కనీసం 20 లక్షలులేదనీ, 2019-20 నాటికి విజయవాడ మెట్రోలో 10 లక్షల మంది ప్రయాణిస్తారని డీపీఆర్ చెప్పడం నమ్మశక్యంగా లేదనీ (ఇది కీలకమైనది) పేర్కొంటూ కేంద్రం ఈ మెట్రో ప్రాజెక్టును నిరాకరించి, ఆ తర్వాత నిబంధన లను సడలించిందని విన్నాం. జపాన్ వాళ్ల సాంకేతికతను కొనడానికి ఇక్కడ మెట్రోను నిర్మించడమా లేక విజయవాడ నగరంలో మెట్రో అవసరం వుంది కాబట్టి అందుకు సైరైన సాంకేతిక పరిజ్ఞానం జపాన్‌లో వుంది కాబట్టి కొనుక్కో వడమా? అనేదే తేలాల్సింది. హైదరా‘బాధ’ కనబడదా? అది సరే, మరి 10 లక్షలమంది ప్రయాణీకులను ఎక్కడి నుంచి తెస్తారు? రూ. 6,823 కోట్లలో ప్రాజెక్టు పూర్తవుతుందా? ఈ రెండు విషయాల్లో దాదాపు 80 లక్షల జనాభా ఉన్న హైదరాబాదుతో పోలుద్దాం. అక్కడ మూడు కారి డార్లలో 71.16 కి.మీ మేర మెట్రో నిర్మాణం జరుగుతున్నది. 2014లో 15 లక్షల మంది ప్రయాణీకులు మెట్రోలో వెళతారనే అంచనా ఇచ్చారు. పౌర సంస్థలు వివిధ ఉదాహరణలను పేర్కొంటూ 6-7 లక్షల మందికి మించి ప్రయాణిం చరనీ, అంతమాత్రానికి ఇన్ని వేల కోట్ల ఖర్చుతో ఇంతటి నగర విధ్వంసం అవసరమా? అని ప్రశ్నించాయి. మెట్రో నిర్మాణం అనేకచోట్ల వివాదాల్లో చిక్కు కున్నది. ఈ పబ్లిక్-ప్రయివేటు భాగస్వామ్యం ప్రాజెక్టు కోసం వేల కోట్ల విలువ చేసే 269 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ కంపెనీకి ఇచ్చింది. ప్రయాణీకుల కంటే షాపింగ్‌మాల్స్ నిర్మాణం, మార్కెటింగ్ ప్రచారాలకే ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 2010లో రూ. 12,132 కోట్లకు ఎల్అండ్టీకి ఆ ప్రాజెక్టును అప్పజెప్పారు. ఏడాది తర్వాత రియల్ ఎస్టేట్ ధర అంటూ రూ. 2,243 కోట్లు కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 16,375 కోట్లకు చేర్చారు. అయినా మెట్రో రైల్ జూైలై 2017కు కాదుగదా, డిసెంబరు 2018కిగానీ కూత వేయదని తాజాగా ఆ కంపెనీ చెప్పింది. కానీ కనీసం మరొక రెండేళ్లు కలపాలి. ప్రాజెక్టు అంచనా వ్యయం ఇప్పటికే రూ.20,000 కోట్లు దాటింది. పూర్తయ్యే నాటికి రూ.25,000 కోట్లవుతుందని పౌర సంస్థలు ముందే చెప్పాయి. హైదరాబాద్ మెట్రో చేదు అనుభవాన్ని చూస్తే విజయవాడ మెట్రోకు సంబంధించి ప్రభుత్వం చెపుతున్నవి తప్పుడు లెక్కలని తేలిగ్గా గ్రహించవచ్చు. ప్రాజెక్టు వ్యయం రూ. 10,000 కోట్లు దాటుతుంది. ప్రయాణీకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మెట్రో స్టేషన్ల కోసం కొన్ని వందల దుకాణాలను కూలగొట్టాలి. ఎన్నో ఏళ్లు కష్టనష్టాలు పడితేగానీ వ్యాపారాలు ఒక స్థాయికి రావు. అలాంటి వాటిని ఒక్కసారిగా కూల్చేయడానికి మెరుగైన నష్టపరిహారం ఇచ్చినా తిరిగి కుదురుకోడానికి చాలాకాలం పడుతుంది. పోనీ సమాజానికి జరిగే మేలు ఉందా? అదీ లేదు. ఎలివేటెడ్ కారిడార్లు, స్టేషన్ల నిర్మాణం తర్వాత బందరు, ఏలూరు రోడ్లు చూడటానికే దరిద్రంగా తయారవుతాయి. అనుమాన ముంటే హైదరాబాద్ చూసి రండి. ఈ భారీ ఖర్చును చివరకు అదనపు పన్నుల రూపేణా విజయవాడ నగర, రాష్ట్ర ప్రజలపైనే మోపుతారు. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌పై మెట్రో సెస్సు విధిస్తామని ప్రకటించారు. నగరానికేమైనా ఒరుగు తుందా అంటే వున్న రోడ్లు కూడా నాశనమైపోతాయి. అక్కడుంది కాబట్టి ఇక్కడా కట్టాలనుకోవడం అవివేకమే అవుతుంది. అలాంటి పొరపాట్లకు భావితరాలు కూడా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. విజయవాడలో వెంటనే మెట్రో నిర్మాణం జరగకపోతే కొంపలు మునిగిపోయేదే మీలేదు. కాబట్టి మెట్రోప్రాజెక్టు డీపీఆర్‌లు బయటపెట్టాలని, వాటిపై విస్తృ తంగా చర్చ జరపాలని, అంతవరకు టెండర్లను నిలిపివేయాలని నగర ప్రజా నీకం డిమాండు చేయాలి. విజయవాడ నగరానికి ఇదొక పరీక్షా సమయం. - ప్రొఫెసర్ సి. రామచంద్రయ్య రచయిత సెస్ పరిశోధనా సంస్థలో ఆచార్యులు, నగరీకరణ విశ్లేషకులు ఈమెయిల్ : Dcrchandraiah@gmail.com -
‘అమరావతి’కి మెట్రో వేస్ట్
♦ తగినంత జనం లేకుండా రాజధానికి మెట్రో’ను విస్తరించడం అనవసరం ♦ సాధ్యాసాధ్యాల నివేదికలో తేల్చిచెప్పిన ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించడం అనవసరమని శ్రీధరన్ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్(డీఎంఆర్సీ) తేల్చేసింది. జనం లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తే పెట్టుబడులు తిరిగి రావని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సలహాదారుగా ఉన్న ఢిల్లీ మెట్రో రూపకర్త శ్రీధరన్ రాజధానికి మెట్రో విస్తరణకు సంబంధించి రూపొందించిన సాధ్యాసాధ్యాల నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నట్టు సమాచారం. రూ.పదివేల కోట్ల ఖర్చవుతుందని అంచనా.. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కొనసాగింపుగా రెండో దశలో రాజధానికి మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాజధానికి మెట్రో రైలును విస్తరించాలంటే సుమారు రూ.పది వేల కోట్లు ఖర్చవుతుందని డీఎంఆర్సీ అంచనా వేసింది. ప్రయాణికులేరి? కారిడార్ నిర్మించే ప్రాంతంలో కనీసం 20 లక్షల జనాభా అయినా ఉండాలి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు మొదట్లో జనాభా సమస్య వస్తే శివారు ప్రాంతాలన్నింటినీ కలపి 20 లక్షల జనాభాను చూపించారు. ఇప్పుడు రాజధానిలో అంత జనాభాను ఎక్కడినుంచి తీసుకొస్తారనేది డీఎంఆర్సీ మొదటి ప్రశ్న. మెట్రో ప్రాజెక్టుపై ఖర్చుపెట్టిన డబ్బు తిరిగి రావాలంటే ప్రతిరోజూ 2.5 లక్షలనుంచి 3 లక్షల మంది ప్రయాణికులు అందులో ఎక్కాలి. ప్రస్తుతం రాజధాని గ్రామాల జనాభా 98 వేలు. అన్నీ అనుకున్నట్లు జూన్‌లో తాత్కాలిక సచివాలయం ప్రారంభమైతే నాలుగు వేలమంది ఉద్యోగులు, ఇతరులు ఒక వెయ్యిమంది అక్కడికొచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో మెట్రో ఎక్కేవారి సంఖ్య వందల్లోనే ఉంటుందని డీఎంఆర్సీ వాదన. గుంటూరుకు మెట్రో విస్తరణా అసాధ్యం! సీడ్ రాజధాని నుంచి గుంటూరుకు మెట్రో విస్తరణ కూడా సాధ్యమయ్యే పనికాదని డీఎంఆర్సీ తేల్చింది. గుంటూరు జనాభా ఆరు లక్షలు దాటలేదని, ఈ నేపథ్యంలో అక్కడికి ప్రాజెక్టును విస్తరించడం ఏ కోణంలోనూ సరికాదని స్పష్టం చేసింది. -
మెట్రో ఎలైన్‌మెంట్‌లో మరో మార్పు
మారనున్న బందరు రోడ్డు కారిడార్ కాలువ వైపు జరగనున్న ఎలైన్మెంట్ బస్టాండ్ - రైల్వే పార్శిల్ కార్యాలయం రూట్ సౌత్ గేటు వరకు మార్పు పోలీస్ కంట్రోల్ రూమ్, ‘ఫైర్’ కార్యాలయం సేఫ్ విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌లో మరో మార్పు చోటు చేసుకోనుంది. బందరు రోడ్డు కారిడార్‌లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి రాఘవయ్య పార్కు వరకు ఎలైన్‌మెంట్‌ను మార్చనున్నారు. ఇప్పటికే ఏలూరు రోడ్డు కారిడార్ ప్రారంభంలో మార్పులు చేశారు. తాజాగా కృష్ణలంక జాతీయ రహదారి విస్తరణ బందరు రోడ్డు కారిడార్‌కు అడ్డంకిగా మారడంతో అక్కడా మార్పులు ప్రతిపాదించనున్నారు. గతంలో కారిడార్‌ను బస్టాండ్ నుంచి రాఘవయ్య పార్కు వరకు కృష్ణలంక వైపు నిర్మించేందుకు ఎలైన్మెంట్ రూపొందించారు. కానీ ప్రస్తుతం ఈ రహదారిని విస్తరిస్తుండడంతో పాత ఎలైన్మెంట్ ప్రకారం కారిడార్ సరిగ్గా రోడ్డు మధ్యలో వస్తుంది. దీనివల్ల ఇబ్బంది వస్తుందనే కారణంతో రోడ్డుతో సంబంధం లేకుండా కారిడార్‌ను కాలువ వైపునకు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) సర్వే నిర్వహిస్తోంది. సర్వే అనంతరం ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేయనుంది. గతంలో బస్టాండ్ నుంచి రైల్వే పార్శిల్ కార్యాలయం వరకు బందరు రోడ్డు కారిడార్‌లో ఒక భాగాన్ని నిర్మించాల్సి ఉండగా దాన్ని పక్కకు జరిపి రైవస్ కాలువ, తుమ్మలపల్లి కళాక్షేత్రం మీదుగా రైల్వే స్టేషన్ సౌత్ గేటు వరకు మార్చారు. దీనివల్ల పోలీస్ కంట్రోల్‌రూమ్, అగ్నిమాపక శాఖ రాష్ట్ర కార్యాలయాలను తొలగించాల్సిన అవసరం లేకుండా పోయింది. మెట్రో భూసేకరణకు కసరత్తు మరోవైపు మెట్రో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూమిని తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఏలూరు, బందరు రోడ్డులలో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన చోట భూమిని సేకరించాల్సి ఉంది. ఎక్కడెక్కడ భూమి అవసరమవుతుందనే దానిపై డీఎంఆర్సీ రూపొందించిన నివేదిక ప్రకారం రెవెన్యూ అధికారులు గతంలో సర్వే చేశారు. దాని ప్రకారం ఆ రోడ్ల పక్కనున్న భూములకు సంబంధించిన యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిడమానూరు వద్ద కోచ్ డిపో కోసం 60 ఎకరాలు సేకరించాల్సి ఉండడంతో దానిపైనా రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ అక్కడి రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో కొంత వెనక్కు తగ్గినా వారిని ఒప్పించి ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. -
మెట్రోకుపచ్చజెండా
అమరావతికి హైస్పీడ్ రైళ్లు ► శ్రీధరన్ డీపీఆర్‌ను ఆమోదించిన సర్కారు ► త్వరలో డీఎంఆర్సీ ఆధ్వర్యంలో నిర్మాణం ► వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేది 40 శాతం ► జపాన్ కంపెనీ నుంచి 60 శాతం రుణం! సాక్షి, విజయవాడ బ్యూరో : ఇక నవ్యాంధ్ర రాజధానిలో హైస్పీడ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకోసం రాష్ట్రంలోని మెట్రోప్రాజెక్టుల సలహాదా రు శ్రీధరన్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదించడంతో ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రూ.5,705 కోట్ల అంచనా వ్యయమున్న ఈ ప్రాజెక్టును శ్రీధరన్ నేతృత్వంలోని డీఎంఆర్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) చేపట్టనుంది. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన 60 శాతం మొత్తాన్ని జపాన్‌కు చెందిన జైకా వంటి విదేశీ కంపెనీల నుంచి రుణం ద్వారా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూసమీకరణకయ్యే రూ.769 కోట్ల ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో కొనుగోళ్లకయ్యే ఖర్చులో ఆరు శాతం మొత్తాన్ని సర్వీసు చార్జిగా తీసుకుని డీఎంఆర్సీ నిర్మాణాన్ని చేపడుతుంది. తొలినుంచి అనుకున్నట్లుగానే ఏలూరురోడ్డు, బందరు రోడ్డు కారిడార్లను 25.76 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మెట్రో మెయిన్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి కంట్రోల్ రూమ్, బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకూ 12.76 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లతో పెనమలూరు వరకూ ఒకటో కారిడార్ నిర్మితమవుతుంది. రెండో కారిడార్‌ను బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్, అలంకార్ మీదుగా ఏలూరురోడ్డు అక్కడి నుంచి నిడమానూరు వరకూ 13 కి.మీ. మేర 13 స్టేషన్లతో నిర్మిస్తారు. భవి ష్యత్తులో చేపట్టే రెండో దశ ప్రాజెక్టులో ఒక టో కారిడార్‌ను రాజధాని వరకూ పొడిగిస్తారు. ఇందుకోసం బస్టాండ్ సమీపంలో కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించి అక్కడి నుంచి కారిడార్‌ను తుళ్లూరు వరకూ పొడిగిస్తారు. రెండో దశలోనే రెండవ కారిడార్‌ను ఒకవైపు గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ, మరోవైపు గొల్లపూడి సెంటర్ వరకూ విస్తరిస్తారు. రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరలో రూపొందించనున్నారు. 25.76 కి.మీ. తొలి దశ మెట్రో ప్రాజెక్టును 2019 కల్లా పూర్తి చేస్తామని ప్రారంభంలో గంటకు 40 నుంచి 50 వేల మంది ప్రయాణిస్తారని డీఎం ఆర్సీ అంచనా వేసింది. 2019 నాటికి గంటకు 2.91 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉందని ట్రాఫిక్ సర్వే ద్వారా తేల్చారు. మెట్రో రైళ్లలో 5 కి.మీ. వరకూ టికెట్ ధర రూ.10, 5 నుంచి పది కి.మీ. అయితే రూ.20, పది కి.మీ. దాటితే రూ.30 వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ధరల ద్వారా ఏడు సంవత్సరాల్లో మెట్రో ప్రాజెక్టు ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చని అంచనా. మరోవైపు రాజధాని అమరావతిని హైస్పీడ్ రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అనుసంధానించే విషయంపై ప్రభుత్వం డీఎంఆర్సీ సలహాను కోరింది. బెంగళూరు-అమరావతి, విశాఖ నుంచి అమరావతి మీదుగా తిరుపతి వరకూ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని శ్రీధరన్‌ను సీఎం కోరారు. విజయవాడ-మంగళగిరి-గుంటూరు-తెనాలి సర్క్యూట్‌ను మెట్రో నుంచి మినహాయించి ర్యాపిడ్ రైల్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించాలని శ్రీధరన్ డీపీఆర్‌లో ప్రతిపాదించారు. -
ఏపీ రాజధానికి మెట్రో రైలు మార్గం
*విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేసిన శ్రీధరన్ సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతానికి మెట్రో రైలు సౌకర్యం కల్పించేలా డిజైన్‌ను రూపొందించాలని ఏపీ మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ నిర్ణయించారు. విజయవాడలో మెట్రో ప్రతిపాదిత ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. విజయవాడలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు మెట్రో రైలు మార్గంతో పాటు కృష్ణానదిపై వంతెన నిర్మించేలా డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లో మార్పులు చేయాలని అధికారులను అదేశించారు. మార్చి నాటికి విజయవాడ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేలా కసరత్తు చేయాలన్నారు.