సాక్షి, అమరావతి: విజయవాడలో మెట్రో రైలును పరుగులు పెట్టిస్తామని కొద్దికాలం వరకూ హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాన్నే మరచిపోయింది. పనులు ప్రారంభమయ్యే దశలో మీడియం మెట్రో ప్రాజెక్టును రద్దు చేసుకుని లైట్ మెట్రో వైపు వెళ్లిన ప్రభుత్వం ఇప్పుడు దాన్నీ పట్టించుకోడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కేంద్రం కూడా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఈసారి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
అసలు ఇప్పటివరకూ లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్) రూపకల్పనకే ముందడుగు పడలేదు. దీంతో మెట్రో ప్రాజెక్టు ఉంటుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసిందనే ప్రచారం జరుగుతోంది.
విజయవాడ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం మూడేళ్ల క్రితం శ్రీధరన్ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)తో డీపీఆర్ (సవివర నివేదిక) తయారుచేయించి ఆమోదించింది. రూ.7,200 కోట్లతో బందరు, ఏలూరు రోడ్లలో రెండు కారిడార్లుగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించి దాని నిర్మాణ బాధ్యతను కూడా డీఎంఆర్‌సీకే ప్రభుత్వం అప్పగించింది. డిజైన్లు, ఎలైన్‌మెంట్ సహా అన్ని పనులను డీఎంఆర్‌సీ పూర్తిచేసి ప్రాజెక్టు నిర్మాణానికి రెండుసార్లు టెండర్లు కూడా పిలిచింది. అయితే, టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సిన సమయంలో ప్రభుత్వం హఠాత్తుగా అసలు ఈ ప్రాజెక్టే వద్దని యూ టర్న్ తీసుకుంది.
ఎల్ అండ్ టీకి శ్రీధరన్ నిరాకరణ
ఎల్ అండ్ టీ సంస్థకు ప్రాజెక్టు పనులు అప్పగించాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం, 30 శాతం అదనంతో ఆ సంస్థ దాఖలు చేసిన టెండర్లపై శ్రీధరన్ అసంతృప్తి వ్యక్తంచేసి టెండర్లనే రద్దు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎల్ అండ్ టీకి పనులు అప్పగించేందుకు ఆయన నిరాకరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్టునే రద్దుచేసింది. మరోవైపు.. ఈ ప్రాజెక్టువల్ల బందరు, ఏలూరు రోడ్లకిరువైపులా ఉన్న తమ సంస్థల వ్యాపారం దెబ్బతింటుందని బడా వ్యాపారులంతా గగ్గోలు పెట్టారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఒకవైపు వ్యాపారుల ఒత్తిడి, మరోవైపు అదనపు రేటుకు తాను చెప్పిన కంపెనీకి పనులిచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును అటకెక్కించినట్లు తెలుస్తోంది.
తెర మీదకు లైట్‌మెట్రో
ఇదిలా ఉంటే.. తక్కువ వ్యయంతో లైట్ మెట్రో ప్రాజెక్టును చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దాని డీపీఆర్ బాధ్యతను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్లు్య సంస్థకు అప్పగించింది. వాస్తవానికి మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు కేఎఫ్‌డబ్లు్య ఇక్కడకు వచ్చింది. దానికి డీపీఆర్ బాధ్యత అప్పగించడంతో ఇప్పటివరకూ ఆ పని పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. ఆ సంస్థ ఉత్సాహంగా ఉన్నా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం మానేసింది. ఈ నేపథ్యంలో అసలు లైట్ మెట్రో అయినా పట్టాలెక్కుతుందా లేదో అనుమానంగానే మారింది. ఒకవేళ కేఎఫ్‌డబ్లు్య సంస్థ డీపీఆర్ రూపకల్పన పనిని వెంటనే ప్రారంభించినా అది పూర్తయ్యేసరికి ఆరు నెలలు పడుతుంది. ఆ తర్వాత భూసేకరణ, ఇతర పనులకు సమయం కావాలి. అంటే ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి ఏమాత్రం కనిపించడంలేదు. మరోవైపు, ప్రభుత్వ పెద్దలే కావాలని మెట్రోను పక్కన పెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బెజవాడ మెట్రో రైలు ప్రస్థానం ఇలా..
జులై 2014: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు
సలహాదారుగా శ్రీధరన్ నియామకం
సెప్టెంబర్ 2014 : డీఎంఆర్‌సీకి మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ (సవివర నివేదిక) రూపకల్పన బాధ్యత అప్పగింత
ఏప్రిల్ 2015 : ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించిన డీఎంఆర్‌సీ. ప్రాజెక్టు వ్యయం రూ.6769 కోట్లు. బస్టాండ్–పెనమలూరు, బస్టాండ్–నిడమానూరు కారిడార్లను 26 కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రతిపాదన. 70 ఎకరాల భూసేకరణ.. ఇందుకు అదనంగా రూ.431 కోట్లు ఖర్చు అంచనా
మే 2015 : డీఎంఆర్‌సీ ఇచ్చిన డీపీఆర్‌ను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం
అక్టోబర్ 2015 : మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటు. దానికి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ)గా నామకరణం.
ఫిబ్రవరి 2016: మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం జపాన్‌కు చెందిన జైకాతో చర్చలు
జూన్ 2016: ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచిన డీఎంఆర్‌సీ
ఆగస్టు 2016: టెండర్లను రద్దు చేసిన డీఎంఆర్‌సీ
డిసెంబర్ 2016: జైకాతో రుణం మంజూరు
చర్చలు విఫలం
మార్చి 2017: నూతన మెట్రో విధానాన్ని రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విజయవాడ మెట్రో ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం
ఆగస్టు 2017: ప్రాజెక్టు కోసం రెండోసారి టెండర్లు పిలిచిన ఏఎంఆర్‌సీ
అక్టోబర్ 2017 : మళ్లీ టెండర్లు రద్దు చేసిన ఏంఎఆర్‌సీ
నవంబర్ 2017 : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు స్థానంలో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన
నవంబర్ 2017: డీఎంఆర్‌సీతో తెగతెంపులు,
జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూతో లైట్ మెట్రో
ప్రాజెక్టు గురించి చర్చలు
నవంబర్ 2017: విజయవాడకు లైట్ మెట్రో ప్రాజెక్టు తీసుకొస్తామని ప్రకటించిన చంద్రబాబు, డీపీఆర్ ఇవ్వాలని కేఎఫ్‌డబ్లు్యకు బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment