Bezawada city
-
BR Ambedkar: తెలుగు నేలపై చైతన్య యాత్ర
నవభారత నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు తెలుగు నేలతో ఎంతో అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో తెలుగు ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడి ప్రజ లను చైతన్యపరిచారు. భారతదేశంలో అంబేడ్కర్ ఇష్టపడి, ఎన్నోసార్లు విడిది చేసిన అతికొద్ది నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు. దేశానికి స్వాతంత్య్రంతో పాటు బహుజనులకు కూడా స్వాతంత్య్రం కావాలని కాంక్షిస్తూ పలు చైతన్యయాత్రలు ఆంధ్రలో చేశారు. అటువంటి పర్యటనల్లో 1944 సెప్టెంబరు 27వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకూ జరిపిన పర్యటన చారి త్రాత్మకమైనది. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. అందుకే యుద్ధమనేది బ్రిటిష్ వారి సొంత వ్యవహారమనీ, యుద్ధం మన లక్ష్యం కాదనీ, సామాజిక స్వాతంత్య్రం మన గమ్యమంటూ తన ప్రసంగాల ద్వారా ఇక్కడి ప్రజలను చైతన్యపరిచారు. విజయవాడ మొదలు కొని విశాఖపట్నం వరకూ పర్యటించారు. తొలుత బెజవాడ రైల్వేస్టేషన్ లోనూ, గుడివాడ మొయిన్ రోడ్‌లోనూ ప్రజలనుద్దేశించి ఉపన్యసించారు. బాలికల వసతి గృహానికి గుడివాడలో శంకు స్థాపన చేశారు. అనంతరం ఏలూరు సందర్శించారు. అక్కడ మున్సిపల్ కార్యాలయంలో అంబేడ్కర్‌ను అభిమానులు, పురపాలక సభ్యులు ఘన సన్మానం చేశారు. కొవ్వూరులో ఎస్సీ కాలనీని సందర్శించి. షెడ్యూలు కాస్ట్ ఫెడరేషన్ ఫ్లాగ్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అందుకే ‘జెండా పేట’గా ఆ కాలనీకి నామకరణం చేసుకున్నారు ప్రజలు. అనంతరం, తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, పాలకొల్లు, రామచంద్రాపురం వెళ్లారు. రాజమండ్రి వచ్చిన సందర్భంగా అక్కడి టౌన్ హాల్లో ఘనంగా పౌర సన్మానం జరి గింది. కాకినాడ పర్యటన అనంతరం పిఠాపురం వచ్చి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శిం చారు. అక్కడి రాజా కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. తుని రైల్వేస్టేషన్ వద్ద ప్రసంగించిన అనం తరం అనకాపల్లి చేరుకోగా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు అంబేడ్కర్‌కు అక్కడి రైల్వేస్టేషన్ వద్ద స్వాగతం పలికారు. అక్కడి మున్సిపల్ స్కూల్లో జరిగిన సభలో ప్రసంగించిన అనంతరం, పట్టణ ప్రజలు, వైశ్య సంఘం అంబేడ్కర్‌కు ఘన సత్కారం చేశాయి. ఆనాటి అంబేడ్కర్ పర్యటనకు గుర్తుగా ఈ ప్రాంతం ‘భీముని గుమ్మం’ అని ప్రాచుర్యం పొందింది. అక్కడి ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును పెట్టి ఈ ప్రాంతీయులు నివాళి అర్పించారు. పర్యటన చివరలో విశాఖ సిటీకి వచ్చి పోర్టులో కార్మికులను కలిశారు. తర్వాత కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో మాట్లాడారు. అంబేడ్కర్ ఆంధ్రలో పర్యటించినపుడు ఆయన ప్రసంగాలను నందనారు హరి, రావురి ఏకాంబరం, కుసుమ వెంకటరామయ్య, పాము రామమూర్తి, జొన్నల మోహనరావు తదితరులు పలుచోట్ల తెలుగులోకి అనువదించేవారు. మొత్తం మీద అంబేడ్కర్ పర్యటన తెలుగు నేలను చైతన్యపరచింది. (క్లిక్ చేయండి: సామాజిక బందీల విముక్తి ప్రదాత!) - డాక్టర్ జి. లీలావరప్రసాదరావు అసిస్టెంట్ ఫ్రొఫెసర్, బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం -
బెజవాడ మెట్రో రైలుకు మంగళం
-
అటకెక్కిన బెజవాడ మెట్రో!?
సాక్షి, అమరావతి: విజయవాడలో మెట్రో రైలును పరుగులు పెట్టిస్తామని కొద్దికాలం వరకూ హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాన్నే మరచిపోయింది. పనులు ప్రారంభమయ్యే దశలో మీడియం మెట్రో ప్రాజెక్టును రద్దు చేసుకుని లైట్ మెట్రో వైపు వెళ్లిన ప్రభుత్వం ఇప్పుడు దాన్నీ పట్టించుకోడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కేంద్రం కూడా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఈసారి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అసలు ఇప్పటివరకూ లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్) రూపకల్పనకే ముందడుగు పడలేదు. దీంతో మెట్రో ప్రాజెక్టు ఉంటుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం మూడేళ్ల క్రితం శ్రీధరన్ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)తో డీపీఆర్ (సవివర నివేదిక) తయారుచేయించి ఆమోదించింది. రూ.7,200 కోట్లతో బందరు, ఏలూరు రోడ్లలో రెండు కారిడార్లుగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించి దాని నిర్మాణ బాధ్యతను కూడా డీఎంఆర్‌సీకే ప్రభుత్వం అప్పగించింది. డిజైన్లు, ఎలైన్మెంట్ సహా అన్ని పనులను డీఎంఆర్సీ పూర్తిచేసి ప్రాజెక్టు నిర్మాణానికి రెండుసార్లు టెండర్లు కూడా పిలిచింది. అయితే, టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సిన సమయంలో ప్రభుత్వం హఠాత్తుగా అసలు ఈ ప్రాజెక్టే వద్దని యూ టర్న్ తీసుకుంది. ఎల్ అండ్ టీకి శ్రీధరన్ నిరాకరణ ఎల్ అండ్ టీ సంస్థకు ప్రాజెక్టు పనులు అప్పగించాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం, 30 శాతం అదనంతో ఆ సంస్థ దాఖలు చేసిన టెండర్లపై శ్రీధరన్ అసంతృప్తి వ్యక్తంచేసి టెండర్లనే రద్దు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎల్ అండ్ టీకి పనులు అప్పగించేందుకు ఆయన నిరాకరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్టునే రద్దుచేసింది. మరోవైపు.. ఈ ప్రాజెక్టువల్ల బందరు, ఏలూరు రోడ్లకిరువైపులా ఉన్న తమ సంస్థల వ్యాపారం దెబ్బతింటుందని బడా వ్యాపారులంతా గగ్గోలు పెట్టారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఒకవైపు వ్యాపారుల ఒత్తిడి, మరోవైపు అదనపు రేటుకు తాను చెప్పిన కంపెనీకి పనులిచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును అటకెక్కించినట్లు తెలుస్తోంది. తెర మీదకు లైట్‌మెట్రో ఇదిలా ఉంటే.. తక్కువ వ్యయంతో లైట్ మెట్రో ప్రాజెక్టును చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దాని డీపీఆర్ బాధ్యతను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్లు్య సంస్థకు అప్పగించింది. వాస్తవానికి మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు కేఎఫ్‌డబ్లు్య ఇక్కడకు వచ్చింది. దానికి డీపీఆర్ బాధ్యత అప్పగించడంతో ఇప్పటివరకూ ఆ పని పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. ఆ సంస్థ ఉత్సాహంగా ఉన్నా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం మానేసింది. ఈ నేపథ్యంలో అసలు లైట్ మెట్రో అయినా పట్టాలెక్కుతుందా లేదో అనుమానంగానే మారింది. ఒకవేళ కేఎఫ్‌డబ్లు్య సంస్థ డీపీఆర్ రూపకల్పన పనిని వెంటనే ప్రారంభించినా అది పూర్తయ్యేసరికి ఆరు నెలలు పడుతుంది. ఆ తర్వాత భూసేకరణ, ఇతర పనులకు సమయం కావాలి. అంటే ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి ఏమాత్రం కనిపించడంలేదు. మరోవైపు, ప్రభుత్వ పెద్దలే కావాలని మెట్రోను పక్కన పెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బెజవాడ మెట్రో రైలు ప్రస్థానం ఇలా.. జులై 2014: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారుగా శ్రీధరన్ నియామకం సెప్టెంబర్ 2014 : డీఎంఆర్సీకి మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ (సవివర నివేదిక) రూపకల్పన బాధ్యత అప్పగింత ఏప్రిల్ 2015 : ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించిన డీఎంఆర్సీ. ప్రాజెక్టు వ్యయం రూ.6769 కోట్లు. బస్టాండ్–పెనమలూరు, బస్టాండ్–నిడమానూరు కారిడార్లను 26 కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రతిపాదన. 70 ఎకరాల భూసేకరణ.. ఇందుకు అదనంగా రూ.431 కోట్లు ఖర్చు అంచనా మే 2015 : డీఎంఆర్సీ ఇచ్చిన డీపీఆర్‌ను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2015 : మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు. దానికి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ)గా నామకరణం. ఫిబ్రవరి 2016: మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం జపాన్‌కు చెందిన జైకాతో చర్చలు జూన్ 2016: ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచిన డీఎంఆర్సీ ఆగస్టు 2016: టెండర్లను రద్దు చేసిన డీఎంఆర్సీ డిసెంబర్ 2016: జైకాతో రుణం మంజూరు చర్చలు విఫలం మార్చి 2017: నూతన మెట్రో విధానాన్ని రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విజయవాడ మెట్రో ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం ఆగస్టు 2017: ప్రాజెక్టు కోసం రెండోసారి టెండర్లు పిలిచిన ఏఎంఆర్‌సీ అక్టోబర్ 2017 : మళ్లీ టెండర్లు రద్దు చేసిన ఏంఎఆర్‌సీ నవంబర్ 2017 : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు స్థానంలో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన నవంబర్ 2017: డీఎంఆర్‌సీతో తెగతెంపులు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూతో లైట్ మెట్రో ప్రాజెక్టు గురించి చర్చలు నవంబర్ 2017: విజయవాడకు లైట్ మెట్రో ప్రాజెక్టు తీసుకొస్తామని ప్రకటించిన చంద్రబాబు, డీపీఆర్ ఇవ్వాలని కేఎఫ్డబ్లు్యకు బాధ్యత. -
100 గ్రామాలకు నగర శోభ!
ఏపీ రాజధాని చుట్టూ భూములిచ్చే రైతులకు అభివృద్ధిలో భాగస్వామ్యం విజయవాడ బ్యూరో: రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు రాజధానిగా మాత్రమే కాకుండా అన్ని రంగాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ‘గ్రోత్ సెంటర్’గా బెజవాడ నగరాన్ని అభివృద్ధి పర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఐటీ, పరిశోధన, కార్పొరేట్ సంస్థల ఏర్పాటుకు అవసరమైన కోట్లాది రూపాయల పెట్టుబడులు రావడానికి అనుగుణంగా.. రాజధాని నగర రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం నిపుణులతో చర్చించి నగర నిర్మాణం, అందులో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, నిర్మించాల్సిన భవన సముదాయాలు, సేకరించాల్సిన భూములపై కసరత్తు మొదలు పెట్టింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశమైన రాజధాని సలహా కమిటీ వివిధ అంశాలపై సమగ్రంగా సమీక్షించినట్లు సమాచారం. నాలుగు రోజుల కిందట ఛత్తీస్‌గఢ్ రాష్టంలోని నయా రాయ్‌పూర్ నగరాన్ని సందర్శించిన కమిటీ నగర రూపకల్పన, వివిధ నిర్మాణాలకు జరిగిన వ్యయంపై వివరాలను సేకరించారు. విజయవాడ చుట్టూ చేపట్టాల్సిన నిర్మాణాలు, సమీకరించాల్సిన భూములపై స్పష్టతకు వచ్చారు. దీన్నిబట్టి చూస్తే విజయవాడ, దాని పరిసరాల్లో నిర్మితమయ్యే రాజధాని చుట్టూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న సుమారు వందకు పైగా గ్రామ పంచాయతీలు నగర శోభను సంతరించుకోనున్నాయి. ఆయా గ్రామాల చుట్టూ ఉన్న భూములను సేకరించిన తర్వాత రైతుల భాగస్వామ్యంతో రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలను మెరుగుపర్చి నగరంతో అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అమల్లోకి వస్తే.. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ, అమరావతి మండలాల్లోని గ్రామాలు, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, కొండపల్లి, పరిటాల, గుంటుపల్లి, గొల్లపూడి, కొటికలపూడి, కొత్తపేట, దాములూరు, నున్న పరిసర గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలుస్తోంది. రెండు జిల్లాల్లోనూ (ప్రకాశం బ్యారేజీకి ఎగువన) నదికి ఇరువైపులా 12,500 ఎకరాల భూములను గుర్తించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 4 దశల్లో భూసేకరణ సాగుతుందని అధికారుల అంచనా.