బాబూ మీకో నమస్కారం! | Metro Sridharan resigned to the post of adviser | Sakshi
Sakshi News home page

బాబూ మీకో నమస్కారం!

Published Sun, Aug 6 2017 1:08 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

బాబూ మీకో నమస్కారం! - Sakshi

బాబూ మీకో నమస్కారం!

- సలహాదారు పదవికి మెట్రో శ్రీధరన్‌ రాజీనామా 
చంద్రబాబు తీరుతో తీవ్ర మనస్తాపం
రూ.500 కోట్ల వ్యయం పెరిగినా ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్కాన్స్‌కే 
పనులివ్వాలని ఒత్తిడి
తిరస్కరించినందుకు 6 నెలలుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వని బాబు
 
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు తీరుతో విసిగిపోయిన మెట్రో రైలు ప్రాజెక్టుల పితామహుడు శ్రీధరన్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఆరు నెలలుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానించడంతో పాటు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం ఆయన నేతృత్వం వహిస్తున్న డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌)పై లేనిపోని అభాండాలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 12వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన నేరుగా రాజీనామా లేఖ పంపారు.

అయినా ఆయన స్పందించలేదు సరికదా వెంటనే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు స్థానంలో లైట్‌ మెట్రో రైలు ప్రాజెక్టును జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూకు ఇవ్వాలని నిర్ణయించారు. దీని వెనుక పెద్ద గూడు పుఠాణీ జరిగినట్లు సమాచారం. మెట్రో రైలు ప్రాజెక్టు పనులను అంచనాల కంటే చాలా ఎక్కువ రేటుకు ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్కాన్స్‌ సంస్థలకు ఇవ్వాలని చంద్రబాబు చేసిన సూచనను శ్రీధరన్‌ తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వ పెద్దలు ఆయన్ను టార్గెట్‌ చేసుకుని ఒక వ్యూహం ప్రకారం ఆయనంతట ఆయనే రాజీనామా చేసే పరిస్థితి కల్పించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులోని రూ.1700 కోట్ల విలువైన రెండు కారిడార్ల పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని డీఎంఆర్‌సీ ప్రతిపాదించింది.

అయితే వీటన్నింటినీ ఒకే ప్యాకేజీగా టెండర్‌ పిలవాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. తమ నిబంధనల ప్రకారం రూ.500 కోట్లకు మించిన పనుల్ని రెండు ప్యాకేజీలుగా విభజించాల్సి వుందని, అంతకంటే ఎక్కువ మొత్తానికి ఒకే టెండర్‌ పిలవడం వల్ల ఆర్థిక స్థోమత లేక ఎక్కువ సంస్థలు పోటీ పడే అవకాశం ఉండదని.. దీనివల్ల ఒకటి, రెండు కంపెనీలే ఎక్కువ మొత్తానికి కోట్‌ చేసే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వానికి డీఎంఆర్‌సీ నివేదించింది. అయినా ప్రభుత్వం వినకుండా రెండు ప్యాకేజీలుగానైనా విభజించి టెండర్లు పిలవాలని సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూ.800 కోట్లతో కారిడార్‌–1కు, రూ.900 కోట్లతో కారిడార్‌–2కు టెండర్లు పిలిచింది. ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్కాన్స్, సింప్లెక్స్‌ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి.
 
ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్కాన్స్‌ కుమ్మక్కు
 సింప్లెక్స్‌ సంస్థ టెండరు దాఖలు చేశాక, తనకు ఆర్థిక స్థోమత సరిపోనందున డిస్‌క్వాలిఫై అవుతానని లేఖ రాసి పక్కకు తప్పుకుంది. ఈ నేపథ్యంలో కారిడార్‌–1కి ఎల్‌ అండ్‌ టీ 45 శాతం, ఆఫ్కాన్స్‌ 55 శాతం ఎక్సెస్‌కు, కారిడార్‌–2కు ఎల్‌ అండ్‌ టీ 45 శాతం, ఆఫ్కాన్స్‌ 35 శాతం ఎక్సెస్‌కు టెండర్‌ కోట్‌ చేశాయి. దీనిప్రకారం కారిడార్‌–1 పనులు ఎల్‌ అండ్‌ టీకి, కారిడార్‌–2 పనులు ఆఫ్కాన్స్‌కు దక్కుతాయి. కారిడార్‌–2లో 35 శాతం ఎక్సెస్‌కు కోట్‌ చేసిన ఆఫ్కాన్స్‌.. కారిడార్‌–1కి 55 శాతం కోట్‌ చేయడం వెనుక లాలూచీ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. రెండు సంస్థలు రింగైనట్లు గమనించిన డీఎంఆర్‌సీ, దీనివల్ల ప్రాజెక్టుపై రూ.500 కోట్ల అదనపు భారం పడుతుందని సర్కారుకు నివేదించి టెండర్లు రద్దు చేసింది.

మళ్లీ ఇలా జరక్కుండా నాలుగు ప్యాకేజీలుగా పనుల్ని విభజించి మళ్లీ టెండర్లు పిలుస్తామని ప్రతిపాదించగా ప్రభుత్వ పెద్దలు స్పందించకుండా తాము చెప్పిన వారికి పనులు ఇవ్వలేదనే ఆగ్రహంతో సంప్రదింపులను సైతం నిలిపివేసింది. పరిస్థితిని వివరించడానికి శ్రీధరన్‌ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోరినా ఇవ్వలేదు. పైగా విజయవాడకు మెట్రో అనవసరమని, అంత ఖర్చుతో మెట్రో లైన్లు వేయడం కంటే ఫ్లైఓవర్లు కడితే సరిపోతుందని స్వయంగా చంద్రబాబు నెల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏఎంఆర్‌సీ (అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌).. మెట్రో స్థానంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ తీసుకొస్తామని ప్రకటించింది. కొద్దిరోజులకు అది సరిపోదని లైట్‌ మెట్రో రైలు కావాలని జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థతో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయించింది.

ఈ దశలో చివరిగా గత నెల 5వ తేదీన శ్రీధరన్‌ ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ లైట్‌ మెట్రో రైలు (ఎల్‌ఆర్‌టీ) విజయవాడకు సరిపోదని, ఇప్పుడున్న స్థితిలో మెట్రోయే సరైనదని పేర్కొన్నారు. అయినా పట్టించుకోని ముఖ్యమంత్రి ఎల్‌ఆర్‌టీ కోసం కేఎఫ్‌డబ్ల్యూతో సర్వే చేయిస్తుండడంతో మనస్తాపం చెందిన శ్రీధరన్‌ గత నెల 12వ తేదీన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకుంటానని లేఖ రాస్తే.. అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఒప్పుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం తనకు కమీషన్లు ఇచ్చే కంపెనీల కోసం శ్రీధరన్‌ను తీవ్రంగా అవమానించి రాష్ట్రం నుంచి సాగనంపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement