తాము అధికారంలో ఉంటే మెట్రో రైలు ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మెదక్ జిల్లా పటాన్‌చెరులో గురువారం ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేశానని, సబ్సిడీలిచ్చినా జనం ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు. తెలంగాణ రైతుల కోసం తామంతా మహారాష్ట్ర జైలుకెళ్లామని గుర్తు చేశారు. తానెక్కడికీ వెళ్లలేదని, మీ కోసం ఇక్కడే ఉంటానని.. ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా తెలంగాణ ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ధైర్యానికి మారు పేరు టీడీపీ అని, తాము ఇందిరాగాంధీ, సోనియాలకు కూడా భయపడలేదని అన్నారు.
హైదరాబాదుకు ఐటీ కంపెనీలు తేవడానికి అమెరికాలో 15 రోజులు తిరిగి, సాధించినట్లు చంద్రబాబు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రోరైలు అన్నీ టీడీపీ ఘనతేనని ఆయన అన్నారు. హైదరాబాదు అందరిదీ అని, దీన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఇక్కడుండే వారందరికీ భద్రత ఉండాలని స్పష్టం చేశారు. బీసీల నుంచి 26 కులాలను తీసేశారని, ఇది అన్యాయమని అన్నారు. విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలంటే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెప్పారు.
అభివృద్ధి చేసినవారిని గెలిపించి ప్రోత్సాహించాలని ఓటర్లను కోరారు. హైదరాబాదు అభివృద్ధి కావాలంటే, కేంద్ర నిధులు రావాలంటే టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అలాగే పొత్తులను గౌరవించి ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన సూచించారు.