అన్నదాత భిక్షాటన! | AP farmers as beggers at Kerala | Sakshi
Sakshi News home page

అన్నదాత భిక్షాటన!

Published Mon, Feb 6 2017 2:39 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

అన్నదాత భిక్షాటన! - Sakshi

అన్నదాత భిక్షాటన!

కేరళ వీధుల్లో ‘అనంత’ రైతన్నల దుస్థితి.. కరువు దెబ్బకు చితికిన బతుకులు
♦ కేరళలో భిక్షాటన చేస్తూ బతుకీడుస్తున్న అన్నదాతలు
♦ ఎండిన పంటలు.. పెరిగిపోతున్న అప్పుల భారం
♦ జాడలేని చినుకు..పాతాళంలో భూగర్భ జలాలు
♦ ఉపాధి కరువై కేరళ, కర్ణాటక, తమిళనాడుకు రైతుల వలస
♦ ఫుట్‌పాత్‌లు, మురికివాడల్లో కూలీలుగా దుర్భర జీవనం
♦ ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన రైతన్నల వెతలు

 ఈ ఫొటోలో దీనంగా కనిపిస్తున్న రైతు పేరు భాస్కర్‌రెడ్డి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం గూనిపల్లి ఆయన స్వగ్రామం. తనకున్న 8 ఎకరాల్లో కంది సాగు చేశాడు. సిండికేట్‌ బ్యాంకులో రూ.లక్ష పంట రుణం తీసుకున్నాడు. గత ఆగస్టులో వర్షాభావంతో పంట  తుడిచిపెట్టుకుపోయింది. దీంతో సెప్టెంబర్‌లో కేరళకు వలస వచ్చాడు. కూలి పని చేసే సత్తువ లేక భిక్షాటన చేస్తున్నాడు. ‘‘పది మందికి అన్నం పెట్టే రైతుకు ఏమిటీ దుర్భర పరిస్థితి పెద్దాయనా?’’ అని ప్రశ్నిస్తే.. కంట తడి పెట్టి  విలపించాడు.     

ఒకప్పుడు రతనాల సీమగా ఖ్యాతిగాంచిన రాయలసీమలో నేడు వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చినుక జాడలేక పాతాళానికి చేరిన భూగర్భం జలం, బీడువారిన పొలాలు, అంతరించిన పచ్చదనం, ఎండిపోయిన డొక్కలు, వలసలతో కళ తప్పిన పల్లెలు, కబేళాలకు తరలుతున్న పశుసంపద... సీమలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. అన్నింటికీ మించి ప్రభుత్వ నిరాదరణ, నిర్లక్ష్యం రైతులను మరింత కుంగదీస్తున్నాయి. కరువు బారినపడి చితికిపోయిన రైతన్నను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కరువును తరిమికొట్టామని పాలకులు నమ్మబలుకుతున్నారు. రైతులు, రైతు కూలీలు కడుపు నింపుకునేందుకు యాచకులుగా మారాల్సిన దుస్థితి దాపురించింది. పొలం ఉండి, పంటలు సాగు చేసి, వర్షాభావంతో నష్టపోయి, అప్పుల పాలై, ఉపాధి కరువై, ఉన్న ఊరిలో బతికే మార్గంలేక అన్నమో రామచంద్రా అంటూ పొట్ట చేతపట్టుకొని పరాయి రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. పని దొరక్క కొందరు భిక్షాటన చేస్తుంటే, పనిచేసే శక్తి సన్నగిల్లి ఇంకొందరు దుర్భర జీవితం గడుపుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు 3 లక్షల మందికిపైగా వలసబాట పట్టారు. కేరళకు వలస వెళ్లిన ‘అనంత’ రైతులు, రైతు కూలీల బతుకులపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌...     
    – కేరళ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి మొగలి రవివర్మ

ఈ ఫొటోలోని రైతుపేరు గంగిరెడ్డి. స్వగ్రామం పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ. రెండెకరాల పొలం ఉంది. వేరుశనగ సాగు చేశాడు. రూ.40 వేలు పెట్టుబడి పెట్టాడు. రూ.30 వేలు బ్యాంకు రుణం తీసుకున్నాడు. కరువు వల్ల పంట చేతికి రాలేదు. పొట్ట చేతపట్టుకొని కేరళకు వలస వచ్చాడు. కాలుకు దెబ్బతగిలింది. దీంతో భిక్షాటన సాగిస్తున్నాడు. రోజంతా భిక్షం ఎత్తితే రెండొందలు వస్తాయి. కొందరు డబ్బుతోపాటు అన్నం కూడా వేస్తారు. అన్నం తిని వచ్చిన డబ్బును దాచుకుని, ఇంటివద్ద ఉన్న భార్య అంజనమ్మకు పంపిస్తాడు. రాత్రి పుట్‌పాత్‌పై తలదాచుకుంటాడు.

ఈ ఫొటోలోని యువకుడి పేరు బాలాజీ నాయక్‌. రామసముద్రం వాసి. తల్లిదండ్రులు రామూ నాయక్, కృష్ణవేణి కష్టపడి బాలాజీని అనంతపురంలో బీటెక్‌ చదివించారు. ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. దీంతో తల్లిదండ్రులతో కలిసి కేరళకు వలస వచ్చాడు. తలోదారిలో కూలీపనికి పోతున్నారు. వీరు నివాసం ఉంటున్న చిన్నగది అద్దె రూ.3 వేలు. అడ్వాన్స్‌ రూ.10 వేలు ఇచ్చారు.




సగం మందికి పని దొరకదు
కేరళలోని ప్రధాన నగరమైన కొచ్చిన్‌లో కల్లూరు జంక్షన్, కడవంతర జంక్షన్, ఎర్నాకులం, బెనర్జీ రోడ్, పాలవారివట్టం తదితర ప్రాంతాల్లో రైతులు, కూలీలు జీవిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకే అన్నం క్యారియర్‌లు చేతబట్టి పలుగు, పారలు భుజాన వేసుకుని వస్తారు. కూలీల కోసం వచ్చేవారితో పనిని బట్టి కూలీ మాట్లాడుకుని వెళతారు. ఉదయం 10.30 గంటల వరకూ చూసి పని దొరక్కపోతే తిరిగి వారు నివాసం ఉన్న ప్రాంతాలకు వెళ్లిపోతారు. రోజూ జంక్షన్‌కు వెళ్లేవారిలో సగం మందికి పని దొరకదు. ఇలా వారంలో సగటున నాలుగు రోజులు పని ఉంటుంది. పనిని బట్టి రోజూ రూ.300 నుంచి రూ.500 వరకు కూలీ వస్తుంది.

కర్ణాటకకు రెండు లక్షల మంది వలస
‘అనంత’ నుంచి కేరళకు వలస వచ్చినవారు 30 వేల మంది దాకా ఉంటారని అక్కడి వలస కూలీలు, రైతులు చెబుతున్నారు. ఇక్కడ ఎక్కువగా బేల్దారి పనికి వెళుతుంటారు. ఇంకొందరు గడ్డికోసే పనులు, మరికొందరు మెట్రో రైలు పనులు చేస్తున్నారు. ఇంకొందరు ఇళ్లలో మట్టిపనులు, పొలాల్లో వ్యవసాయ పనులకూ వెళుతున్నారు. కేరళ కంటే కర్ణాటకకు వలసలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా నుంచి 2 లక్షల మందికి పైగా బెంగళూరుతోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వలస వెళ్లారు. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు, సేలం తదితర ప్రాంతాలకు 70 వేలమంది దాకా వెళ్లి ఉంటారని సమాచారం.  

రూ.3,500 కోట్లు నష్టం  
అనంతపురం జిల్లాలో 2016 ఖరీఫ్‌లో 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. ఇతర పంటలు మరో 4 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వేరుశనగకు సగటున రూ.18 వేలు పెట్టుబడి పెట్టారు. కంది, పత్తి, మిరప తదితర పంటలకు పెట్టుబడి భారీగా పెరిగింది. జిల్లాలో వేరుశనగకు మొత్తం రూ.2,727 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇతర పంటలూ కలిపి రూ.3,500 కోట్లకుపైగా పెట్టుబడి అయ్యింది. అంటే పంటలు చేతికి రాకపోవడం వల్ల రైతులు రూ.3,500 కోట్లకు పైగా నష్టపోయారన్నమాట.  

ఇన్‌పుట్‌ సబ్సిడీకి మంగళం
ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. 2015లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని మంత్రులు పలుమార్లు ప్రకటించారు. కానీ, నవంబర్‌ 10న జారీ చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు జీవోలో 63 కరువు మండలాలున్న అనంతపురం పేరును తొలగించారు. నాలుగేళ్లుగా వరుస కరువులతో అల్లాడుతున్న రైతులకు 2013లో మంజూరైన రూ.643 కోట్ల పరిహారం ఇవ్వలేదు. గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం చెబుతున్న రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడితోపాటు ప్రైవేట్‌ అప్పులు భారంగా మారాయి. ఈ ఏడాది ఇన్‌పుట్‌ సబ్సిడీపై ప్రకటన చేసిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసా లేక రైతులు వలసబాట పట్టారు.

ఆగని ఆత్మహత్యల పరంపర
జిల్లాలో 2014 జూన్‌ 8 నుంచి ఇప్పటివరకూ 231 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 2016 జూన్‌ నుంచి ఇప్పటిదాకా 62 మంది చనిపోయారు. రైతుల ఆత్మహత్యలను నివారించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా మొండిచేయి చూపుతోంది.

ఆదుకోని ఉపాధి హామీ పథకం
జిల్లాలో 40.57 లక్షల జనాభా ఉంది. 7.85 లక్షల మందికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలో వంద రోజులు పనులు చేసిన వారి కుటుంబాలు 41,650 ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబం నుంచి రోజూ ముగ్గురు పనికి వెళితే నెల రోజుల్లో వంద పనిదినాలు ముగుస్తాయి. కరువు జిల్లా అనంతపురంలో 150 పనిదినాలు కల్పించాలనే ఉత్తర్వులు ఉన్నాయి. అయితే, ఒక్కరికి కూడా 150 రోజుల పనిదినాలు కల్పించలేదు. కూలీ సగటున రూ.154 వస్తోందని అధికారులు చెబుతున్నారని, వాస్తవానికి రూ.60 నుంచి రూ.110 మాత్రమే పడుతోందని కూలీలు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో పని దినాలు కల్పించకపోవడం, కూలీ తక్కువగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వలసబాట పడుతున్నారు.  

పశుక్రాంతికి సర్కారు పాతర
పశు సంపదతో కరువు కొంతవరకు ఎదుర్కోవచ్చు. ఇంట్లో ఒకటో, రెండో గేదెలు ఉంటే పాలు విక్రయించుకొని కుటుంబాన్ని పోషించుకోవచ్చు. 2004–2009లో పశుక్రాంతి పథకం ద్వారా ప్రభుత్వం వేల సంఖ్యలో పాడి ఆవులు, గేదెలను సబ్సిడీ ద్వారా పంపిణీ చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క పశువును కూడా రైతులకు పంపిణీ చేయలేదు. ఇది కూడా వలసలకు ప్రధాన కారణం. జిల్లాలో గతంలో 15.42 లక్షల పశువులు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 9.75 లక్షలకు పడిపోయింది. కరువు వల్ల మేత దొరక్క రైతులు పశువులను కబేళాలకు అయినకాడికి అమ్మేసుకుంటున్నారు.  

అన్నదాత అంతులేని ఆవేదన
పంటలు పండించుకొని గర్వంగా తలెత్తుకొని బతకాల్సిన రైతన్నలు రోడ్డుపై చేతులు చాచి భిక్షమెత్తుకుంటున్నారు. కడుపు నింపుకునేందుకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన దుర్గతి ప్రాప్తించింది. అనంతపురం జిల్లా నుంచి కేరళకు వలస వచ్చినవారిలో ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. ‘సాక్షి’ వారిని పలుకరించగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. పంటలు నష్టపోయి, అప్పులు పెరిగిపోయి, బతుకు భారమై పరాయి రాష్ట్రంలో దీనంగా బతుకుతున్నామని తెలిపారు. సొంత ఊరిలో ప్రభుత్వం పనులు కల్పిస్తే వలస వెళ్లాల్సిన అవసరమే లేదని చెప్పారు.

చంద్రబాబు మాటలు.. నీటిమీద రాతలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 జూన్‌ 8 నుంచి ఇప్పటివరకూ అనంతపురం జిల్లాలో 15 సార్లు పర్యటించారు. వచ్చిన ప్రతీసారి ఈ జిల్లా నుంచి కరువును తరిమికొడతామని, ఉపాధి కోసం బెంగళూరు, కేరళకు వలస వెళ్లాల్సిన అవసరం లేదని, అక్కడి నుంచి ఇక్కడికి జనం వలస వచ్చేలా పరిశ్రమలు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తున్నారు. కానీ, రెండున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి శూన్యం. ముఖ్యమంత్రి ప్రకటనలు నీటి మీద రాతలుగానే మారాయి. వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. 2012 నుంచి హంద్రీ–నీవా ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు వస్తుంటే ఈ నీటిని ఆయకట్టుకు అందించేందుకు డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నించలేదు. పైగా కుప్పం వరకూ ప్రధాన కాలువ పూర్తయ్యేదాకా డిస్ట్రిబ్యూటరీ పనులు చేయవద్దని ఆదేశించారు. దీన్నిబట్టి అనంతపురం జిల్లాపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

కొరగాని కానుక
చంద్రన్న కానుక సంచితో కేరళలో కూలి కోసం ఎదురుచూస్తున్న రైతు



















మురికివాడల్లో  దుర్భర జీవితం
వీరిలో చాలామంది కల్లూరు జంక్షన్‌ ప్రైవేట్‌ బస్టాండ్‌ పుట్‌పాత్, రోడ్డు పక్కన పుట్‌పాత్‌లపైనే జీవిస్తున్నారు. చీకటి ఉండగానే కాలకృత్యాలు తీర్చుకుని ఉదయం 5 గంటలకే పనికి సిద్ధమవుతారు. దుస్తులన్నీ ఒకచోట ఉంచి ఆ రోజు పనికి వెళ్లని వారిని కాపలా ఉంచుతారు. కాపలా ఉన్నవారి భోజనం ఖర్చులను రోజూ ఒకరు భరిస్తారు. ఇంకొందరు జంక్షన్‌ పక్కన మురికివాడలో అద్దె గదుల్లో ఉంటున్నారు. కడవంతర జంక్షన్‌లో ఉండేవారు గాంధీనగర్‌ మురికివాడలో జీవిస్తున్నారు. ఇక్కడి గదుల్లో ఉండేందుకు ఒక్కొక్కరు రూ.30 ఇవ్వాలి. కొందరు గదులు అద్దెకు తీసుకున్నారు. యజమానులు చిన్నగదుల్లో అట్టలు, గోనెసంచులు అడ్డుగా పెట్టిన గదిని బ్లాక్‌లుగా విభజించారు.

ఒక్కో బ్లాక్‌కు నెలకు రూ.2 వేలు అద్దె ఇవ్వాలి. బ్లాక్‌లోని వాళ్లందరికీ ఒకే మరుగుదొడ్డి ఉంటుంది. ఒక్కో బ్లాక్‌ ఇద్దరు కూర్చునేందుకు సరిపోతుంది. నిద్రపోవాలంటే కాళ్లు ముడుచుకుని పడుకోవాల్సిందే. రోజుకు రూ.30 ఇచ్చి ఒకే గదిలో 20 మంది ఉండేవారూ ఉన్నారు. ఒక్కో బ్లాక్‌కు నెలకు రూ.2 వేలు చెల్లించే వారూ ఉన్నారు. çపని ముగించుకుని వచ్చిన తర్వాత ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కోసమంటూ సాయంత్రం చాలామంది మద్యం తాగుతున్నారు. దీనికి రూ.50 నుంచి రూ.100 ఖర్చవుతుంది. భోజనం వీళ్లే వండుకోవాలి. పనికి తీసుకెళ్లినవారు పెట్టరు. పార, పలుగులు అద్దెకు తీసుకోవాల్సిందే. ఈ ఖర్చులు అదనం. బీడీలు, గుట్కా అలవాటు ఉండేవారి ఖర్చు మరింత పెరుగుతుంది. వచ్చిన కూలీ డబ్బుల్లో సగం ఖర్చులకే పోతాయి.

పంట మొత్తం పోయింది
‘‘ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. సిండికేట్‌ బ్యాంకులో రూ.20 వేలు లోన్‌ ఇచ్చినారు. వడ్డీకి రూ.80 వేలు తెచ్చుకున్నా. పంట మొత్తం పోయింది. నాకు ఇల్లు లేదు. ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం మంజూరు చేయలేదు. మా ఊళ్లో తాగేందుకు నీళ్లు కూడా లేవు. తాగునీళ్లు కావాలంటే క్యాన్‌ రూ.20 పెట్టి కొనాలి. డబ్బులేక నా కుమారుడు భాస్కర్‌ ఇంటర్‌లో చదువు ఆపేశాడు. నాతోపాటే కేరళకు పనికి వచ్చినాడు’’  
– గణేనాయక్, గుడ్డంపల్లి తండా,ముదిగుబ్బ మండలం

పనులు ఇవ్వలేకపోతే ప్రభుత్వం ఎందుకు?
‘‘నేను ఇంటర్‌ పూర్తిచేశా. మా అమ్మ శశికళ చనిపోయింది. నాన్న బానేనాయక్‌ ఇంట్లోనే ఉన్నాడు. 6 ఎకరాలు పొలం ఉంది. శనగ వేస్తే మొత్తం పోయింది. రూ.50 వేల అప్పుంది. మా ఇల్లు శిథిలావస్థకు చేరింది. కొత్త ఇంటి కోసం ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు ఇచ్చాన ఫలితం లేదు. ఇల్లు బాగుచేసుకునేందుకు డబ్బుల కోసమే కేరళకు వలస వచ్చా. అక్కడే(అనంతపురం జిల్లాలో) ప్రభుత్వం పనులు కల్పిస్తే ఇక్కడి రావాల్సిన అవసరం ఉండదు. పని ఇవ్వండని అడుగుతున్నాం. అది కూడా ఇవ్వలేకపోతే  ప్రభుత్వం ఎందుకు సార్‌!’’
– వినోద్, పప్పనపల్లి, గోరంట్ల మండలం

రూ.1.60 లక్షల అప్పుందయ్యా!
‘‘నాకున్న 5 ఎకరాల్లో శనక్కాయ వేసినా. పెట్టుబడి కోసం రూ.60 వేలు అప్పు చేసినా. పాత అప్పు రూ.లక్ష ఉంది. నాకు ఇద్దరు కొడుకులు. ఒకడికి మతిస్థిమితం లేదు. ఇంట్లోనే ఉంటాడు. ఇంకొకడిని ఐటీఐ చదివించా. ఊళ్లో పనులు దొరక్క నేను, నా బిడ్డ ఇక్కడికి వచ్చాం. పిల్లోన్ని సూస్తే బాధనిపిస్తాది. కానీ, రూ.1.60 లక్షల అప్పుందయ్యా!’’
– గోబ్రే నాయక్, చంద్రానాయక్‌ తండా,తలుపుల మండలం

పిల్లలకు ఫోన్‌ కూడా సరిగా చేయడం లేదు  
‘‘మాకు పొలం లేదు. కూలీకి వెళ్తుంటా. పంటల్లేక పనుల్లేవు. నేను, నా ఇంటాయన రాజేశ్‌ నాయక్‌ పనికోసం ఇక్కడికి వచ్చాం. మాకు ఇద్దరు పిల్లలు. బాబు ఎస్సీ హాస్టల్‌లో చదువుతున్నాడు. పాప ఇంటివద్దే ఉంది. ఫోన్‌ చేస్తే ‘అమ్మా రా..!’ అంటూ ఇద్దరూ ఏడుస్తారు.  వాళ్లతో మాట్లాడితే బాధతో వెళ్లిపోదామనిపిస్తాది. కానీ అక్కడ(అనంతపురం జిల్లాలో) బతకలేం. అందుకే పిల్లోళ్లకు ఫోన్‌ కూడా సరిగా చేయడం లేదు. వాళ్లు కళ్లలో పెట్టినట్లుంటారు’’  
    – నీలాబాయి, కదిరి

కూతురికి పెళ్లి చేయాలప్పా..
‘‘నేను ఆరు ఎకరాల్లో కంది, శనక్కాయ వేశా. 80 వేలు పంటరుణం తీసున్నా. మరో రూ.65 వేలు అప్పుతెచ్చినా. పంట మొత్తం పోయింది. నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు శైలజకు పెళ్లిచేశా. చిన్న కూతురు వనజ పది వరకూ చదివి ఇంటి వద్దే ఉంది. ఇప్పుడు 21 ఏళ్లు. పెళ్లి చేయాల. ఊళ్లో పనుల్లేవు. నేను ఇక్కడికి వచ్చి 15 రోజులైంది’’
– పుష్పరాజ్, ఎనుములవారిపల్లి,ముదిగుబ్బ మండలం

భిక్షమెత్తి బతుకుతున్నామయ్యా
‘‘నాకు రెండెకరాల భూమి ఉంది. శనక్కాయ వేసినా. రూ.30 వేలు పెట్టుబడైంది. వర్షాల్లేక పంట మొత్తం నష్టపోయాను. ఒక కొడుకు ఉన్నాడు. కూలీ పనులకు వెళ్తున్నాడు. నేను ఇక్కడికి పని కోసం వచ్చినా. పనులు దొరక్క భిక్షమెత్తి బతుకుతావుండా. ఈ డబ్బుల్లో కొంత ఖర్చుకు వాడుకుని మిగతాదంతా ఇంటికే తీసుకెళ్తా. ఊళ్లో పనులుంటే ఈడికి రావాల్సిన అవసరం లేదయ్యా!’’
    – చల్లప్ప, బసవారిపల్లి, నల్లమాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement