మెట్టు దిగిన ఎమ్మెల్సీ
హామీలన్నీ గోవిందా
బేలోడు..సమస్యలు బోలెడు
మెట్టు .. ఒక్కహామీ తీర్చింటే ఒట్టు..!
కనిపించని డ్రైనేజీలు
అధ్వాన్నంగా రోడ్లు
ఇబ్బందుల్లో గ్రామీణులు
గ్రామం: బేలోడు
నియోజకవర్గం: రాయదుర్గం
జనాభా: 2,100
ఓటర్లు: 1,20
దత్తత తీసుకున్నది: తాజా మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి
గుమ్మఘట్ట: బేలోడు....గుమ్మఘట్ట మండంలోని ఓ గ్రామం. మౌలిక వసతులకు నోచుకోని ఓ పల్లె. కనీస సౌకర్యాలకు కూడా లేకపోవడంతో ఇక్కడి వారంతా సమస్యలతోనే సహజీవనం చేసేవారు. అయితే మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ఈ పల్లెను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో జనమంతా తమ గ్రామంలో మౌలిక సౌకర్యాలు మెరుగుపడుతాయని, ఊరు రూపరేఖలే మారిపోతాయని సంబరపడ్డారు. అయితే మూఽడేళ్లయినా గ్రామంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. ఈలోపు పదవీకాలం పూర్తవడంతో మెట్టు మాజీ కాగా...ఆయన ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి.
దత్తత సమయంలో ఎమ్మెల్సీ ఇచ్చిన హామీలు
- ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఏర్పాటుతో పాటు రెండు మొక్కలు పెంచి తీరుతాం.
- గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి చూపుతాం
- అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయిస్తా
- గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తాం.
ఇల్లు..పొలం కొన్నా..గ్రామ సమస్యలు తీర్చలేదు
బోలోడు గ్రామం సమీపంలోనే బీటీ ప్రాజెక్టు ఉంది. ఎప్పటికైనా ఈ ప్రాంతంలోని భూములకు మంచి ధర లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో ఇల్లు కట్టి...పొలాలు కొనుగోలు చేసిన మెట్టు గోవిందరెడ్డి..గ్రామంలోని సమస్యలు మాత్రం పూర్తిగా విస్మరించారు. ప్రతి ఇంటికీ మొక్కలు పెంచి తీరుతామన్న ఆయన హామీ కార్యరూపం దాల్చలేదు. ఇక మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతను ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు. గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటు ఊసే లేకుండా పోయింది. ఇప్పటికీ గ్రామంలోని చాలా మంది పింఛన్లు అందడం లేదు. ఇక సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాకాలం జనం బురదగుంటగా మారిన రోడ్లపైనే నడవాల్సి వస్తోంది. డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది.
అభివృద్ధికి సహకరిస్తాం
బేలోడును అభివృద్ధి చేయాలని మెట్టు గోవిందరెడ్డి ధృడ సంకల్పంతో ఉన్నారు. ఆయన కోరిక నేరవేర్చేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామం
- బేలోడును మెట్టుగోవింద రెడ్డి దత్తత తీసుకున్న సమయంలో అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్, ప్రస్తుత
గ్రామీణ గృహ నిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇచ్చిన హామీ ఇది.
ఇందిరమ్మ కాలనీలో సౌకర్యాలు అధ్వాన్నం
గ్రామం చివరలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మెట్టు గోవిందరెడ్డి పొలానికి వెళ్లాలంటే నిత్యం ఈ కాలనీ దాటుకునే వెళ్లాలి. అయితే కాలనీలో నెలకొన్న సమస్యలను ఆయన ఏనాడు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుక్కెడు తాగునీరు దొరక్క ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీ కాలనీకి ఎక్కిళ్లు..
గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. గ్రామంలో రెండు తాగునీటి పథకాలు ఉన్నా... ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి శాశ్వత తాగునీటి సమస్య తీరుస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి.
చెవిలో పూలు పెట్టారు
ప్రజల చెవిలో పువ్వులు పెట్టడం ఈ ప్రభుత్వానికి అలువాటే. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గ్రామాన్ని దత్తత తీసుకున్నా...ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు. దత్తత తీసుకున్న కొత్తలో మంత్రులు, జిల్లా అధికారులతో కొద్ది రోజులు హడావిడి చేయడం చూసి.. మా గ్రామ రూపు రేఖలు మారిపోతాయని భ్రమించాం. హామీల్లో ఒక్కంటంటే ఒక్కటీ ఆయన నెరవేర్చలేకపోయారు.
- జయరామిరెడ్డి, స్థానికుడు
ఎలాంటి అభివృద్ధి లేదు
ఇందిరమ్మ కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పేరుకే దత్తత గ్రామం కానీ...మచ్చకైనా అభివృద్ధి కనిపించడం లేదు. గోవిందరెడ్డి చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు ఇపుడు మమ్మల్ని నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేక పోతున్నాం. మంత్రిగారైనా బేలోడు సమస్యలు తీర్చాలి.
– బోయ రామాంజినేయులు, వార్డు సభ్యుడు, బేలోడు
తాగునీటికీ తిప్పలే
గుక్కెడు నీటి కోసం కూడా కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఎస్సీకాలనీలో ఎలాంటి మౌలిక వసతులు లేవు. పదవీకాలం పూర్తయిన తర్వాత గోవిందరెడ్డి కనిపించడం కూడా కష్టమైపోయింది.
– రామాంజినేయులు, గ్రామస్తుడు