mettu govindareddy
-
జీతం లేకుండా పనిచేయాలని ఏపీఐఐసీ ఛైర్మన్ నిర్ణయం
సాక్షి, అనంతపురం: ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో జీతం తీసుకోకుండా పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ నుంచి తన వేతనం రూ.65వేలు, ఇతర అలవెన్సులు ఇవ్వొద్దంటూ ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యంకు ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. చదవండి: (ఎప్పటికీ వైఎస్ జగన్‌కు విధేయుడినే: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి) -
ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి నియామకంపై ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డిని నియమించారు. కాగా జూలై 17న ఏపీ నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే మెట్టు
హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మెట్టు గోవింద రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో ఆయనకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్న 30 మంది ఎమ్మెల్యేల్లో తానూ ఒకడినని, ఆ తర్వాత కూడా పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్సీగా గెలిచి పార్టీ కోసం పనిచేశానని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో లేకున్నా టీడీపీని కాపాడుకున్నామని, కానీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఒక్కసారి కూడా సీఎం చంద్రబాబును కలిసే అవకాశం దక్కలేదని వాపోయారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంచార్జిగా ఉండి రాయదుర్గం నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ తీరుతో విసిగి వేసారి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.. జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ బాధ్యత ఇచ్చినా కష్టపడతానని చెప్పారు. జగన్ మీద నమ్మకంతోనే: కాపు ఎలాంటి షరతులు లేకుండా గోవింద రెడ్డి పార్టీలో చేరడం శుభాపరిణామమని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలనే ఉద్దేశ్యంతోనే గోవిందరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారని రాయదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. ఈసారి వైఎస్ జగన్ కచ్చితంగా సీఎం అయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలు, మతాలకు అతీతంగా వైఎస్ జగన్ మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్నారని అన్నారు. -
నియోజకవర్గాన్ని మంత్రి కాలవ భ్రష్టు పట్టించారు
ఎన్నికలకు ముందు మంత్రి కాలవ శ్రీనివాసులుకు మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన.. త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా మెట్టు రాకను స్వాగతించారు. ఇప్పటికే మంత్రి కాలవపై ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కాలవకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకూడదని, ఇస్తే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిస్తానని టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఓవైపు మెట్టు, మరోవైపు దీపక్‌రెడ్డి దూరం కావడంతో టీడీపీ పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇంకోవైపు మెట్టు చేరికతో వైఎస్సార్సీపీకి అదనపు బలం చేకూరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల్లో కాలవకు ఇక్కట్లు తప్పేలా లేవని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో బాగా వెనుకబడిన ప్రాంతం. బొమ్మనహాల్ ప్రాంతం పూర్తి ఎడారిగా మారే భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాస్తవంలోకి వెళితే నియోజకవర్గానికి ఈయన స్థానికేతరుడు. శింగనమల నియోజకవర్గ వాసి. గత ఎన్నికల్లో మెట్టు గోవిందరెడ్డి, దీపక్‌రెడ్డి టిక్కెట్ ఆశించారు. చివరి నిమిషంలో జేసీ బ్రదర్స్ టీడీపీలోకి రావడంతో జేసీ దివాకర్‌రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఖరారు చేసి, కాలవను రాయదుర్గం అసెంబ్లీకి పంపారు. 1999లో ఎంపీగా పోటీ చేసినా, పార్టీ గాలిలో గెలవడం మినహా ఆయనకు రాయదుర్గంలో ప్రత్యేకంగా వర్గమంటూ లేదు. ఈక్రమంలో మెట్టు గోవిందరెడ్డి, దీపక్‌రెడ్డి సహకారంతో ఎన్నికల్లో తలపడ్డారు. మెట్టు గోవిందరెడ్డికి నియోజకవర్గంలో సౌమ్యుడిగా మంచి పేరుంది. అవినీతికి దూరంగా ఉంటారని, కష్టపడి సంపాదించిన సొమ్ము మినహా రాజకీయాలలో అవినీతికి పాల్పడలేదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. 2004–09 వరకూ ఎమ్మెల్యేగా సేవలందించారు. 2014 ఎన్నికల సమయానికి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్ కూడా అప్పటి వరకు మెట్టు చేతుల్లోనే ఉంది. దీంతో గత ఎన్నికల్లో కాలవకు తలలో నాలుకలా మెట్టు పనిచేశారు. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తర్వాత మెట్టును పూర్తిగా దూరం పెట్టిన కాలవ ఎన్నికల్లో విజయం తర్వాత చీఫ్ విప్‌గా కాలవ ఎంపికయ్యారు. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని యోచించారు. దీంతో అప్పటి వరకూ తనకు సహకరించిన మెట్టు గోవిందరెడ్డిని పూర్తిగా దూరం పెట్టారు. టీడీపీ శ్రేణులు ఎవ్వరూ మెట్టు వద్దకు వెళ్లకూడదని, వెళితే తాను సహకరించననే సంకేతం పంపారు. ఈ పరిణామాలతో మెట్టు కలత చెందారు. చివరకు ఎమ్మెల్సీగా 2017లో గడువు ముగిసిన తర్వాత చంద్రబాబు తిరిగి మెట్టును కొనసాగించాలనే యోచన చేసినా, కాలవనే అడ్డుపడ్డారనే చర్చ కొనసాగింది. దీంతో అప్పటి నుంచి కాలవకు వ్యతిరేకంగా మెట్టు పావులు కదుపుతూ వచ్చారు. మరోవైపు దీపక్‌రెడ్డి కూడా కాలవపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కాలవ చేసిన అవినీతిపై కూడా ప్రకటనలు చేశారు. కాలవ కూడా ఐదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన అవినీతి చిట్టాను చంద్రబాబు ముందుంచి, నియోజకవర్గంలో తనతో పాటు మొదటి నుంచి టీడీపీ కోసం శ్రమించిన వారిని కాలవ నిర్లక్ష్యం చేసిన తీరును మెట్టు వివరించారు. దీపక్‌రెడ్డి కూడా కాలవకు వ్యతిరేకంగానే గళం విప్పారు. నియోజకవర్గాన్ని విస్మరించిన తీరును కూడా బయటపెట్టారు. పైగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో విశేష స్పందన ఉందని, ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గాలి వీస్తోందని, ఈక్రమంలో అతనికి టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని, అవసరమైతే పార్టీ వీడుతానని మెట్టు తేల్చి చెప్పారు. టీడీపీ కీలక నేతలైన మెట్టు, దీపక్‌రెడ్డి మాటలతో పాటు మెజార్టీ టీడీపీ శ్రేణుల అభిప్రాయం కాదని, కాలవకే టిక్కెట్ ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మెట్టు రాజీనామాతో టీడీపీకి ఇక్కట్లే చంద్రబాబుకు చెప్పినా తన మాటను పట్టించుకోలేదని మెట్టుగోవిందరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. మంగళవారం రాజీనామా ప్రకటన చేసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మెట్టు నివాసానికి వెళ్లి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే వైఎస్సార్సీపీలో మెట్టు చేరనున్నారు. ఇప్పటికీ ‘దుర్గం’లో కాలవకు బలమైన వర్గం లేదు. గత ఎన్నికల్లో పార్టీ గాలిలో స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. మెట్టు రాజీనామాతో టీడీపీలో బలమైన వర్గం దూరమైనట్లే. వీరంతా వైఎస్సార్సీపీలో చేరనున్నారు. ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. మంత్రిగా ఉన్న కాలవ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారు. ఇంకోవైపు దీపక్‌రెడ్డి కాలవపై ఉరుముతున్నారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే ఎన్నికలకు ముందు టీడీపీ కోలుకోలేని దెబ్బ తగిలినట్లే. -
టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. గోవిందరెడ్డి రాజీనామా
-
టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. గోవిందరెడ్డి రాజీనామా
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. చంద్రబాబు నాయుడు వైఖరిపై అసహనం, రాయదుర్గం టికెట్‌ను మరోసారి మంత్రి కాలవ శ్రీనివాస్‌కు కేటాయించడంపై అసంతృప్తితో టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా గోవింద రెడ్డిని బుజ్జగించేందుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మంత్రి కాలవ శ్రీనివాస్ రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని మనస్తాపంతో టీడీపీకి రాజీనామా చేశారు.మరోవైపు రాయదుర్గం టికెట్‌ను మంత్రి కాలువ శ్రీనివాస్‌కు కేటాయించడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. (ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతా) -
ఒకే ఒరలో మూడు కత్తులు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాయదుర్గం టీడీపీలో అసమ్మతిపోరు తారస్థాయికి చేరింది. మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి మధ్య నెలకొన్న వర్గపోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. ‘నున్వా–నేనా’ అంటూ పరస్పరం కత్తులు దూస్తున్నారు. ఓ వైపు మెట్టు.. మరోవైపు దీపక్ కాలవ కంట్లో నలుసులా మారారు. దీపక్‌రెడ్డి అసలు టీడీపీ వ్యక్తే కాదు అని మంత్రి కాలవ.. తాను లేకపోతే ఎమ్మెల్యేగా కాలవ గెలిచేవాడే కాదని దీపక్‌రెడ్డి దూషణలకు దిగుతున్నారు. వీరివద్దరి వైఖరితో ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి తిరిగి తెరపైకి వచ్చి కాలవకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో ‘దుర్గం’ టీడీపీలో పార్టీ కేడర్ మూడు ముక్కలైంది. అనూహ్యంగా దుర్గంపై కాలవ జెండా రాయదుర్గం నియోజకవర్గానికి మంత్రి కాలవ శ్రీనివాసులు స్థానికేతరుడు. శింగనమల నియోజకవర్గానికి చెందిన కాలవ 1999లో ఎంపీగా గెలుపొందారు. తర్వాత రెండుసార్లు ఓడిపోయారు. దీంతో గత ఎన్నికల్లో రాయదుర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. చీఫ్ విప్‌గా కొనసాగి ఆపై మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ‘దుర్గం’ టీడీపీకి మెట్టు గోవిందరెడ్డి నాయకుడిగా ఉండేవారు. 2009లో కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత టీడీపీ బలహీనపడింది. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. ఆపై జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపు రాజీనామాతో 2012లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో దీపక్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. అప్పటి నుండి ‘దుర్గం’ టీడీపీ మెట్టు, దీపక్‌రెడ్డి వర్గాలుగా చీలిపోయింది. 2014 ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఇద్దరికీ కాకుండా కాలవ శ్రీనివాసులకు టీడీపీ అధిష్టానం టిక్కెట్టు కేటాయించింది. కాలవ విజయం సాధించారు. మెట్టు, దీపక్ వర్గాలను పక్కనపెట్టి మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గానికి పూర్తి కొత్త కావడంతో మెట్టు, దీపక్‌రెడ్డితో సంబంధం లేకుండా తనకంటూ ఓ వర్గం ఏర్పరుచుకోవాలని భావించారు. టీడీపీలో ఇక వర్గాలు లేవని, కాలవ వర్గం ఒకటే ఉంటుందని, ఎవ్వరి వద్దకు వెళ్లొద్దనే మెసేజ్‌ను కేడర్‌లోకి పంపారు. అయితే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో దీపక్, మెట్టు సహకారంతో గెలిచిన వాళ్లు... వారిని వదులుకునేందుకు అయిష్టత చూపారు. కాలవకు వద్దకూ వెళుతూ పాత నేతలను కూడా కలుస్తూ వచ్చారు. ఇది కాలవకు నచ్చలేదు. దీపక్‌రెడ్డి వద్దకు వెళ్లే నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. కాంట్రాక్టులు, ఇతర విషయాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. డీ. హీరేహాల్ ఎంపీపీ పుష్పావతి, ఉస్మాన్, రంగప్పతో పాటు పలువురు నేతలు కాలవ వైఖరిని విభేదించి దీపక్ వెంటే నడుస్తూ వచ్చారు. దీపక్‌పై అవినీతి ఆరోపణలు ఎంతగా ప్రయత్నించినా దీపక్‌రెడ్డి అనుచరులు తనవైపు రాకపోవడంతో.. కాలవ శ్రీనివాసులు పథకం ప్రకారం ముందుకు సాగారు. దీపక్‌రెడ్డి అవినీతి పరుడని అంతర్గతంగా పార్టీ శ్రేణులకు చెబుతూ వచ్చినట్లు తెలుస్తోంది. దీపక్‌రెడ్డిపై బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, దాడి చేశారని సెక్షన్ 506, 447, 341 కింద మారణాయుధాలు ఉన్నాయని సెక్షన్ 148 కింద మాదాపూర్, హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కాలవ వాదనలకు బలం చేకూరింది. దీంతో దీపక్, కాలవను లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గంలో పర్యటిస్తూ నియోజకవర్గ అభివృద్ధి, కాలవ అవినీతిపై బహిరంగంగా మాట్లాడుతూ వచ్చారు. గుమ్మఘట్ట జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పూలనాగరాజు కాలవ వర్గంలో చేరారు. దీంతో దీపక్, మెట్టు ఏకమయ్యారు. పైకి దూరంగా ఉన్నప్పటికీ ఇద్దరి లక్ష్యం ‘కాలవ’ కావడంతో ఆయనకు వ్యతిరేకంగా తమ వర్గాన్ని బలపరుచుకున్నారు. ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేసినా వ్యతిరేకవర్గాన్ని కాలవ తనవైపు తిప్పుకోలేకపోయారు. పార్టీ నిర్వహించిన సర్వేలు కూడా టీడీపీ ఓటమి ఖాయమని వచ్చింది. ఈ పరిస్థితుల్లో దుర్గం నుండి బరిలోకి దిగితే దీపక్, మెట్టు పూర్తిగా సహకరించరని, ఓడిపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవల్సి వస్తుందనే ఆలోచనలో పడ్డారు. ఏకమైన దీపక్, మెట్టు కాలవ చర్యలను గమనించిన దీపక్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశం పెట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014కు ముందు స్థానికసంస్థల ఎన్నికల్లో ఎవరు పార్టీ కోసం పనిచేశారో..? ఎవరి అండతో గెలిచావో గుర్తుంచుకోవాలని మంత్రికి సూచించారు. వైఖరి మారకుంటే కాలవ చిట్టా విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. అసలు వచ్చే ఎన్నికల్లో కాలవకు టిక్కెట్టు దక్కకుండా చేయాలని దీపక్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాలవకు కాకుండా మెట్టు, దీపక్రెడ్డిలో ఎవరికి వచ్చినా పరస్పరం సహకరించుకోవాలని అంతర్గతంగా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇది కాలవకు పూర్తిగా మింగుడుపడటం లేదు. నాలుగేళ్లలో కాలవకు భారీగా లబ్ధి కాలవ శ్రీనివాసులు నాలుగేళ్లలో ఆర్థికంగా బాగా లబ్ధిపొందారు. నీరు–చెట్టు, హైవే పనులు, హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ, ఇతర అభివృద్ధి పనుల్లో బాగా లబ్ధిపొందారు. తాజాగా బీటీపీ పనులు కూడా దక్కాయి. ఈ ఒక్క పనిలోనే రూ. 50 కోట్ల దాకా కాలవకు అందుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రూ.దాదాపు వందకోట్లు కాలవ ఖాతాలో జమ అవుతుందని ఆయన వ్యతిరేక వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాలవ గుట్టు విప్పుతా అని దీపక్ చేసిన ఆరోపణల వెనుక ఈ అవినీతి తతంగమే ఉంటుందని తెలుస్తోంది. ఏదిఏమైనా పార్టీని మూడు వర్గాలతో అంతంత మాత్రంగానే ఉన్న టీడీపీ పరిస్థితి మరింత దిగజారిందనేది పరిశీలకు అభిప్రాయం. గుంతకల్లు వైపు చూసినా.. వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం టికెట్‌ను తన అల్లుడు దీపక్‌రెడ్డికి ఇప్పించుకోవాలనే యోచనలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు మెట్టు గోవిందరెడ్డి వర్గం కూడా సహకరించని పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో దుర్గం కాకుండా గుంతకల్లు టిక్కెట్టు దక్కించుకోవాలని పార్టీ పెద్దల ద్వారా మంత్రి కాలవ లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జితేంద్రగౌడ్ కాకుండా మాజీ ఎమ్మెల్యే మధూసూదన్గుప్తాకు టిక్కెట్టు ఇప్పించాలని జేసీ ప్రయత్నిస్తున్నారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించినట్లు తెలిసింది. దీంతో తిరిగి ఎంపీగా వెళ్లాలనే యోచన కూడా చేశారు. అదీ కుదరకపోవడంతో తిరిగి ‘దుర్గం’ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అందువల్లే అసమ్మతిని అణగదొక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలోనే సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలపై ఎక్కడా దీపక్‌రెడ్డి ఫొటో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. -
మెట్టు దిగిన ఎమ్మెల్సీ
హామీలన్నీ గోవిందా బేలోడు..సమస్యలు బోలెడు మెట్టు .. ఒక్కహామీ తీర్చింటే ఒట్టు..! కనిపించని డ్రైనేజీలు అధ్వాన్నంగా రోడ్లు ఇబ్బందుల్లో గ్రామీణులు గ్రామం: బేలోడు నియోజకవర్గం: రాయదుర్గం జనాభా: 2,100 ఓటర్లు: 1,20 దత్తత తీసుకున్నది: తాజా మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి గుమ్మఘట్ట: బేలోడు....గుమ్మఘట్ట మండంలోని ఓ గ్రామం. మౌలిక వసతులకు నోచుకోని ఓ పల్లె. కనీస సౌకర్యాలకు కూడా లేకపోవడంతో ఇక్కడి వారంతా సమస్యలతోనే సహజీవనం చేసేవారు. అయితే మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ఈ పల్లెను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో జనమంతా తమ గ్రామంలో మౌలిక సౌకర్యాలు మెరుగుపడుతాయని, ఊరు రూపరేఖలే మారిపోతాయని సంబరపడ్డారు. అయితే మూఽడేళ్లయినా గ్రామంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. ఈలోపు పదవీకాలం పూర్తవడంతో మెట్టు మాజీ కాగా...ఆయన ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి. దత్తత సమయంలో ఎమ్మెల్సీ ఇచ్చిన హామీలు - ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఏర్పాటుతో పాటు రెండు మొక్కలు పెంచి తీరుతాం. - గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి చూపుతాం - అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయిస్తా - గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తాం. ఇల్లు..పొలం కొన్నా..గ్రామ సమస్యలు తీర్చలేదు బోలోడు గ్రామం సమీపంలోనే బీటీ ప్రాజెక్టు ఉంది. ఎప్పటికైనా ఈ ప్రాంతంలోని భూములకు మంచి ధర లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో ఇల్లు కట్టి...పొలాలు కొనుగోలు చేసిన మెట్టు గోవిందరెడ్డి..గ్రామంలోని సమస్యలు మాత్రం పూర్తిగా విస్మరించారు. ప్రతి ఇంటికీ మొక్కలు పెంచి తీరుతామన్న ఆయన హామీ కార్యరూపం దాల్చలేదు. ఇక మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతను ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు. గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటు ఊసే లేకుండా పోయింది. ఇప్పటికీ గ్రామంలోని చాలా మంది పింఛన్లు అందడం లేదు. ఇక సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాకాలం జనం బురదగుంటగా మారిన రోడ్లపైనే నడవాల్సి వస్తోంది. డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. అభివృద్ధికి సహకరిస్తాం బేలోడును అభివృద్ధి చేయాలని మెట్టు గోవిందరెడ్డి ధృడ సంకల్పంతో ఉన్నారు. ఆయన కోరిక నేరవేర్చేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామం - బేలోడును మెట్టుగోవింద రెడ్డి దత్తత తీసుకున్న సమయంలో అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్, ప్రస్తుత గ్రామీణ గృహ నిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇచ్చిన హామీ ఇది. ఇందిరమ్మ కాలనీలో సౌకర్యాలు అధ్వాన్నం గ్రామం చివరలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మెట్టు గోవిందరెడ్డి పొలానికి వెళ్లాలంటే నిత్యం ఈ కాలనీ దాటుకునే వెళ్లాలి. అయితే కాలనీలో నెలకొన్న సమస్యలను ఆయన ఏనాడు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుక్కెడు తాగునీరు దొరక్క ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ కాలనీకి ఎక్కిళ్లు.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. గ్రామంలో రెండు తాగునీటి పథకాలు ఉన్నా... ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి శాశ్వత తాగునీటి సమస్య తీరుస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. చెవిలో పూలు పెట్టారు ప్రజల చెవిలో పువ్వులు పెట్టడం ఈ ప్రభుత్వానికి అలువాటే. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గ్రామాన్ని దత్తత తీసుకున్నా...ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు. దత్తత తీసుకున్న కొత్తలో మంత్రులు, జిల్లా అధికారులతో కొద్ది రోజులు హడావిడి చేయడం చూసి.. మా గ్రామ రూపు రేఖలు మారిపోతాయని భ్రమించాం. హామీల్లో ఒక్కంటంటే ఒక్కటీ ఆయన నెరవేర్చలేకపోయారు. - జయరామిరెడ్డి, స్థానికుడు ఎలాంటి అభివృద్ధి లేదు ఇందిరమ్మ కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పేరుకే దత్తత గ్రామం కానీ...మచ్చకైనా అభివృద్ధి కనిపించడం లేదు. గోవిందరెడ్డి చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు ఇపుడు మమ్మల్ని నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేక పోతున్నాం. మంత్రిగారైనా బేలోడు సమస్యలు తీర్చాలి. – బోయ రామాంజినేయులు, వార్డు సభ్యుడు, బేలోడు తాగునీటికీ తిప్పలే గుక్కెడు నీటి కోసం కూడా కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఎస్సీకాలనీలో ఎలాంటి మౌలిక వసతులు లేవు. పదవీకాలం పూర్తయిన తర్వాత గోవిందరెడ్డి కనిపించడం కూడా కష్టమైపోయింది. – రామాంజినేయులు, గ్రామస్తుడు