నియోజకవర్గాన్ని మంత్రి కాలవ భ్రష్టు పట్టించారు | Mettu Govinda Reddy Shock to TDP And Kalava Srinivasulu | Sakshi
Sakshi News home page

కాలవకు షాక్‌

Published Wed, Mar 13 2019 1:12 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Mettu Govinda Reddy Shock to TDP And Kalava Srinivasulu - Sakshi

మెట్టు గోవిందరెడ్డి, కాపు రామచంద్రారెడ్డిని సన్మానిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలు

ఎన్నికలకు ముందు మంత్రి కాలవ     శ్రీనివాసులుకు మాజీ ఎమ్మెల్యే మెట్టు     గోవిందరెడ్డి షాక్‌ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన.. త్వరలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు     ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కాపు     రామచంద్రారెడ్డి కూడా మెట్టు రాకను     స్వాగతించారు. ఇప్పటికే మంత్రి కాలవపై ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరేశారు. కాలవకు ఎమ్మెల్యే టిక్కెట్‌     ఇవ్వకూడదని, ఇస్తే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిస్తానని టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఓవైపు మెట్టు, మరోవైపు దీపక్‌రెడ్డి దూరం కావడంతో టీడీపీ పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇంకోవైపు మెట్టు చేరికతో వైఎస్సార్‌సీపీకి అదనపు బలం చేకూరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల్లో కాలవకు ఇక్కట్లు తప్పేలా లేవని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో బాగా వెనుకబడిన ప్రాంతం. బొమ్మనహాల్‌ ప్రాంతం పూర్తి ఎడారిగా మారే భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాస్తవంలోకి వెళితే నియోజకవర్గానికి ఈయన స్థానికేతరుడు. శింగనమల నియోజకవర్గ వాసి. గత ఎన్నికల్లో మెట్టు గోవిందరెడ్డి, దీపక్‌రెడ్డి టిక్కెట్‌ ఆశించారు. చివరి నిమిషంలో జేసీ బ్రదర్స్‌ టీడీపీలోకి రావడంతో జేసీ దివాకర్‌రెడ్డికి ఎంపీ టిక్కెట్‌ ఖరారు చేసి, కాలవను రాయదుర్గం అసెంబ్లీకి పంపారు. 1999లో ఎంపీగా పోటీ చేసినా, పార్టీ గాలిలో గెలవడం మినహా ఆయనకు రాయదుర్గంలో ప్రత్యేకంగా వర్గమంటూ లేదు. ఈక్రమంలో మెట్టు గోవిందరెడ్డి, దీపక్‌రెడ్డి సహకారంతో ఎన్నికల్లో తలపడ్డారు. మెట్టు గోవిందరెడ్డికి నియోజకవర్గంలో సౌమ్యుడిగా మంచి పేరుంది. అవినీతికి దూరంగా ఉంటారని, కష్టపడి సంపాదించిన సొమ్ము మినహా రాజకీయాలలో అవినీతికి పాల్పడలేదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. 2004–09 వరకూ ఎమ్మెల్యేగా సేవలందించారు. 2014 ఎన్నికల సమయానికి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్‌ కూడా అప్పటి వరకు మెట్టు చేతుల్లోనే ఉంది. దీంతో గత ఎన్నికల్లో కాలవకు తలలో నాలుకలా మెట్టు పనిచేశారు. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు.

 

ఎన్నికల తర్వాత మెట్టును పూర్తిగా దూరం పెట్టిన కాలవ
ఎన్నికల్లో విజయం తర్వాత చీఫ్‌ విప్‌గా కాలవ ఎంపికయ్యారు. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని యోచించారు. దీంతో అప్పటి వరకూ తనకు సహకరించిన మెట్టు గోవిందరెడ్డిని పూర్తిగా దూరం పెట్టారు. టీడీపీ శ్రేణులు ఎవ్వరూ మెట్టు వద్దకు వెళ్లకూడదని, వెళితే తాను సహకరించననే సంకేతం పంపారు. ఈ పరిణామాలతో మెట్టు కలత చెందారు. చివరకు ఎమ్మెల్సీగా 2017లో గడువు ముగిసిన తర్వాత చంద్రబాబు తిరిగి మెట్టును కొనసాగించాలనే యోచన చేసినా, కాలవనే అడ్డుపడ్డారనే చర్చ కొనసాగింది. దీంతో అప్పటి నుంచి కాలవకు వ్యతిరేకంగా మెట్టు పావులు కదుపుతూ వచ్చారు. మరోవైపు దీపక్‌రెడ్డి కూడా కాలవపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కాలవ చేసిన అవినీతిపై కూడా ప్రకటనలు చేశారు. కాలవ కూడా ఐదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన అవినీతి చిట్టాను చంద్రబాబు ముందుంచి, నియోజకవర్గంలో తనతో పాటు మొదటి నుంచి టీడీపీ కోసం శ్రమించిన వారిని కాలవ నిర్లక్ష్యం చేసిన తీరును మెట్టు వివరించారు. దీపక్‌రెడ్డి కూడా కాలవకు వ్యతిరేకంగానే గళం విప్పారు. నియోజకవర్గాన్ని విస్మరించిన తీరును కూడా బయటపెట్టారు. పైగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో విశేష స్పందన ఉందని, ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గాలి వీస్తోందని, ఈక్రమంలో అతనికి టిక్కెట్‌ ఇస్తే సహకరించేది లేదని, అవసరమైతే పార్టీ వీడుతానని మెట్టు తేల్చి చెప్పారు. టీడీపీ కీలక నేతలైన మెట్టు, దీపక్‌రెడ్డి మాటలతో పాటు మెజార్టీ టీడీపీ శ్రేణుల అభిప్రాయం కాదని, కాలవకే టిక్కెట్‌ ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

మెట్టు రాజీనామాతో టీడీపీకి ఇక్కట్లే
చంద్రబాబుకు చెప్పినా తన మాటను పట్టించుకోలేదని మెట్టుగోవిందరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. మంగళవారం రాజీనామా ప్రకటన చేసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మెట్టు నివాసానికి వెళ్లి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే వైఎస్సార్‌సీపీలో మెట్టు చేరనున్నారు. ఇప్పటికీ ‘దుర్గం’లో కాలవకు బలమైన వర్గం లేదు. గత ఎన్నికల్లో పార్టీ గాలిలో స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. మెట్టు రాజీనామాతో టీడీపీలో బలమైన వర్గం దూరమైనట్లే. వీరంతా వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. మంత్రిగా ఉన్న కాలవ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారు. ఇంకోవైపు దీపక్‌రెడ్డి కాలవపై ఉరుముతున్నారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే ఎన్నికలకు ముందు టీడీపీ కోలుకోలేని దెబ్బ తగిలినట్లే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement