మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు
- వారానికి మూడు సార్లు గుడ్లు
- కేజీబీవీలకు అదనంగా రెండు సార్లు చికెన్
- 2,831 పాఠశాలలు.. 2.75 లక్షల విద్యార్థులకు ప్రయోజనం
- రూ.11.04 కోట్లు మంజూరు.. ఈ నెల నుంచే అమలు
పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారాన్ని అందించి నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన బోధన అందించేందుకు సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం క్రింద వారానికి మూడు సార్లు గుడ్లు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ యేడాదికి సరిపడా రూ. 11,04,35,000 నిధులు మంజూరు చేశారు. అలాగే కేజీబీవీల్లో ఇక నుంచి నెలకు రెండుసార్లు అదనంగా చికెన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 2.75 లక్షల మందికి, కేజీబీవీల్లో 8,600 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
మెదక్ జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత కలసి మొత్తం 2,831 పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించి, పోషకాహార విలువలు గల ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2002 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.
ప్రతిరోజు ఆకుకూరలు, పప్పు, పప్పుచారు వారానికి రెండు సార్లు గుడ్లతో 700 కాలరీలు, 20 గ్రాముల ప్రోటీన్లు గల సమతుల ఆహారాన్ని అందించేవారు. ఈ మేరకు రోజుకు ప్రాథమిక పాఠశాల విద్యార్థికి 100 గ్రాముల బియ్యం, రూ. 4.86 కూరగాయలకు ఖర్చు చేసేవారు. అలాగే 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రోజు 150 గ్రాముల బియ్యం, కూరగాయల కోసం రూ.6.78 చెల్లించేవారు.
వారానికి మూడుసార్లు గుడ్లు
సెస్టెంబర్ నుంచి వారానికి మూడు గుడ్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ మేరకు మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కుకింగ్ కాస్ట్‌ను కూడా పెంచారు.1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు రూ.5.86పైసలు, 6 నుంచి10 వ తరగతుల విద్యార్థులకు రూ.7.78 పైసలు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరానికి రూ.11,04,35000 నిధులు మంజూరు అయ్యాయి.
కస్తూర్బాలో అదనంగా రెండు సార్లు చికెన్
కస్తూర్బా పాఠశాలల్లో చదివే విద్యార్థినుల మెనూను కూడా మార్చారు. వారికి గతంలో వారానికి ఒకసారి చికెన్, 5 సార్లు గుడ్లు ఉండేవి. ఇపుడు వారానికి ఒక సారి చికెన్‌తో పాటు ప్రతినెలా రెండు , నాలుగో బుధవారాల్లో రెండు సార్లు అదనంగా చికెన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో మొత్తం 43 కేజీబీవీలు ఉండగా సుమారు 8,600 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.