మధ్యాహ్నం.. అధ్వానం
-
మెనూ మచ్చుకైనా పాటించరు
-
రోజూ నాణ్యత లేని భోజనమే
-
తినలేకపోతున్న విద్యార్థులు
-
కానరాని సౌకర్యాలు
-
పట్టించుకోని అధికారులు
గోదావరిఖనిటౌన్/రామగుండం : నియోజకవర్గంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటోంది. ప్రభుత్వ మెనూ పత్తాలేకుండా పోయింది. వేసవి సెలవుత తర్వాత పాఠశాలలు ప్రారంభించినప్పటి నుంచి మధ్యాహ్న బోజన నిర్వాహకులు ఒకే రకమైన కూర వండుతున్నారు. అది కూడా సరిగా ఉండడంలేదు. రోజూ ఒకే కూర తినలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తురన్నారు. ప్రాథమిక స్థాయి ఒక్కో విద్యార్థికి రూ.4.25పైసలు, హైస్కూల్ విద్యార్థికి రూ.6.65పై భోజనం కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం పప్పులు, కూరగాయలు, కోడిగుడ్ల ధరలు పెరుగడం, నిర్వాహకులకు నెలనెలా బిల్లులు సక్రమంగా రాకపోవడంతో మధ్యాహ్నం భోజనం నాణ్యత లోపిస్తోందని పలువురు అంటున్నారు. ప్రభుత్వ మెను ప్రకారం కిచిడి, లెమన్ రైస్, గ్రుడ్డు ఇతర ఏదైన అందించాలి. అది మచ్చుకైన కానరావడం లేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం గుడ్డును అందిస్తునారు. గోదావరిఖని విఠల్‌నగర్, కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామం, అశోక్‌గనర్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాల, గాంధీ పార్క్, గాంధీనగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, రామగుండం పట్టణంలోని పాఠశాలల్లో నిత్యం సుమారు 1500 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. రోజు ఒకే విధంగా పులుసును వడ్డిస్తుండడంతో ముద్ద దిగడం లేదని విద్యార్థులు అంటున్నారు.
జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల, అన్నపూర్ణకాలనీలోని దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం బాగుందని విద్యార్థులు వెల్లడించారు. గతంలో కన్నా ప్రస్తుతం సన్నబియ్యం అన్నం చాలాబాగుందని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారని అంటున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు
బసంత్‌నగర్ : క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బసంత్‌నగర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడంలేదు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వాహకులు భోజనం వండడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలు సగం కడుపుకే భోజనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వంటలు రుచికరంగా ఉండకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం ఇళ్లకు వెళ్తున్నారు. ధరలు పెరిగాయని విద్యార్థులకు ప్రస్తుతం వారిని ఒకరోజు మాత్రమే గుడ్డు ఇస్తున్నారు.
రుచిగా ఉండడం లేదు
– అనిల్, ఏడో తరగతి, బసంత్‌నగర్
మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగానే సరిపోతోంది. ఎక్కువ రోజులు సాంబారు, ఆలుగడ్డ కూరనే పెడుతున్నరు. అవి కూడా అంతగా రుచిగా ఉండటం లేదు. రుచికరమైన భోజనం అందించాలి.