50 కేజీల బియ్యంలో రెండు కేజీలు తూకం తక్కువగా చూపిస్తున్న వైనం
పిల్లల బియ్యం..పెద్దల భోజ్యం
Published Sat, Jul 23 2016 5:41 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
– పక్కదారి పడుతున్న ‘మధ్యాహ్న’ బియ్యం
– అంగన్‌వాడీల్లోనూ అదే తంతు
– ప్యాకెట్‌పై 2 నుంచి 3 కేజీల తరుగు
– ఎంఎల్‌ఎస్‌లో అధికారుల చేతివాటం
– బోగస్ హాజరుతో సరిచేస్తున్న హెచ్‌ఎంలు
– చిన్నారుల కడుపుమాడుస్తున్న వైనం
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు/అర్బన్):
మధ్యాహ్నం భోజనం..మంచి లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న పథకం. పేదరికం కారణంగా చిన్నారులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో దీనిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అయితే పిల్లల బియ్యాన్ని పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. విద్యార్థుల కడుపు మాడుస్తూ..తమ స్వలాభం చూసుకుంటున్నారు. మండల లెవల్ స్టాక్ పాయింట్(ఎంఎల్‌ఎస్)లలో ఏటా 300 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమవుతుందంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవచ్చు.
జిల్లాలో 2,929 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే 3,93,866 మంది పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ప్రాథమిక పాఠశాలలో చదివే ఒక్కో విద్యార్థికి 100 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 150 గ్రాముల చొప్పున బియ్యం సరఫరా అవుతోంది. అయితే ఆయా పాఠశాలలకు సరఫరా అయ్యే బియ్యం బస్తాలో రెండు నుంచి మూడు కేజీల వరకు తరుగు ఉంటోంది. ఇది కొన్ని బస్తాల్లో ఐదారు కేజీల వరకు ఉంటుందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. కొన్ని సమయాల్లో దాదాపు సగం బస్తా వచ్చిన సందర్భాలు ఉన్నాయని, అయినా ఎవరినీ అడగలేని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు.
నెలకు 32 నుంచి 35 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం..
జిల్లాలోని అన్ని పాఠశాలలకు కలిపి నెలకు దాదాపుగా 819.187 మెట్రిక్ టన్నుల బియాన్ని పౌర సరఫరాల ద్వారా అందజేస్తారు. ఇందులో బియ్యం బస్తాపై వచ్చే తరుగును రెండు కేజీలు సరాసరిగా తీసుకున్నా దాదాపుగా దాదాపుగా 32 మెట్రిక్ టన్నుల బియ్యం మండల లెవల్ స్టాక్ పాయింట్(ఎంఎల్‌ఎస్)లలో మాయ మవుతోంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సరాసరిగా నెలకు 32 మెట్రిక్ టన్నుల ప్రకారం 256 ఎంఎల్‌ఎస్ పాయింట్లలో తరుగుదల అయి పాఠశాలలకు వస్తోంది. జూన్, ఆక్టోబర్, ఏప్రిల్ మాసాల్లో 16 మెటిక్ టన్నుల ప్రకారం 48 మెట్రిక్ టన్నుల బియ్యం తరుగుదల వస్తోంది. మొత్తం మీద ఒక్క మే నెల తప్ప.. ఏడాదిలో 300 మెట్రిక్ టన్నుల బియ్యం తరుగుదలగా మిగులుతోంది.
బోగస్ హాజరు
బియ్యం తరుగుదలను పూడ్చుకునేందుకు ప్రధానోపాధ్యాయులు తంటాలు పడుతున్నారు. కొందరు బోగస్ హాజరు వేసి నష్టాన్ని పూడ్చుకుంటుండగా..కొన్ని పాఠశాలల్లో పిల్లలకు అన్నం తక్కువగా వడ్డించి కడుపు మాడుస్తున్నారు. ఇది ఏమని అడిగితే తామేమి చేయాలని ప్రధానోపాధ్యాయులు బదులు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లినా∙పట్టించుకోవడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు.
బోగస్ హాజరు వేయక తప్పదు : రమేష్, హెచ్‌ఎం, ఎంపీపీ(న్యూ) స్కూల్, చెరుకుచెర్ల
బస్తాపై మూడు, నాలుగు కేజీల బియ్యం తక్కువగా వస్తోంది. ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా విద్యాశాఖాధికారుల దష్టికి తీసుకెళ్లాం. అయినా వారు ఏమీ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నష్టాన్ని పూడ్చుకునేందుకు బోగస్ హాజరు వేయక తప్పడంలేదు. ఇంతకన్నా మాకు మరో దారి లేదు. పిల్లలను ఆకలితో కడపు మాడ్చలేము కదా?
జగమెరిగిన సత్యం: అతూల్ రహమాన్‌ఖాన్, ఐజీఎం ఉన్నత పాఠశాల, కర్నూలు
బస్తాపై ఐదారు కేజీల బియ్యం తక్కువగా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోరు. బియ్యం తక్కువగా వచ్చినా పిల్లలకు మాత్రం కడుపునిండా భోజనం పెట్టాలంటారు. దీన్ని మాత్రం పట్టించుకోరు. ఇటీవల బియ్యం సరఫరా చేసే డీలర్లు ఆర్‌ఓలు ఇవ్వడం లేదు.
అంగన్‌వాడీల్లో ఇలా...
చిన్నారుల నోటికాడి కూడును కూడా బియ్యం దొంగలు వదిలిపెట్టడం లేదు. తరుగు పేరుతో ప్రతి 50 కేజీల బస్తా నుంచి నెలకు నాలుగు నుంచి 5 కేజీలను దోచుకుంటూనే ఉన్నారు. చూసేందుకు నాలుగైదు కేజీలే అయినా నెలకు లెక్క కడితే వామ్మో... అనాల్సిందే. జిల్లాలోని 16 అంగన్‌వాడీ ప్రాజెక్టుల పరిధిలో 3486 అంగన్‌వాడీ కేంద్రాలు, 63 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 0 నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 3,58, 234 మంది ఉన్నారు. అలాగే ఆయా కేంద్రాల పరిధిలో 42,084 మంది గర్భవతులు, 39,738 మంది బాలింతలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరికి నెలకు మూడు కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ప్రతీ కేంద్రం పరిధిలో ఉన్న చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు లెక్క గట్టి సమీపంలోని చౌకధరల దుకాణం నుంచి బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే సరఫరా అయ్యే బియ్యంలో 50 కేజీల బస్తాకు నాలుగు నుంచి ఐదు కేజీల వరకు తరుగు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. బాలింతలు, గర్భవతులు, చిన్నారులకు కలిపి ప్రతి నెలా 13,20,168 కేజీల బియ్యం సరఫరా అవుతుండగా తరుగు రూపంలో 13,201 కేజీలు పక్కదారి పడుతోంది. ఇంత మేర బియ్యం పక్కదారి పడుతున్నా ఆయా కేంద్రాల పరిధిలోని లబ్ధిదారులకు ఎలా ఇస్తున్నారంటే తూకాల బదులు డబ్బాలను ఉపయోగిస్తున్నారు.
Advertisement