మిలీషియా కమాండర్‌ అరెస్టు | milishiya commander arrest | Sakshi
Sakshi News home page

మిలీషియా కమాండర్‌ అరెస్టు

Published Mon, Jul 24 2017 11:57 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

మిలీషియా కమాండర్‌ అరెస్టు - Sakshi

మిలీషియా కమాండర్‌ అరెస్టు

కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): మావోయిస్ట్‌లకు కొరియర్‌గా  పనిచేస్తూ.. కార్యకలాపాలకు ఆకర్షితుడిగా మారి 37 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతికి కారణమైన మిలీషియా కమాండర్‌ని చింతూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిలీషియా కమాండర్‌ అరెస్ట్‌ వివరాలను సోమవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా చీపూరుగూడెంకి చెందిన ఇరవై ఏళ్ల మిలీషియా కమాండర్‌ మదివి మాస అలియాస్‌ (పండమాస, సుభాష్‌ మహేష్, పద,సురేష్‌) అయిదేళ్లుగా మావోయిస్ట్‌ కార్యాకలాపాల్లో పాల్గొంటున్నాడు. చీపురుగూడెంలో హిడుమల్‌ ఎస్‌జడ్‌సీఎం, డీకేఎస్‌జడ్‌సీఎం బెటాలియన్‌ కమాండర్‌ ద్వారా మావోయిస్ట్‌ పార్టీలో చేరి, మరో 30 మందితో 15 రోజులు ఎలమగొండలో మావోయిస్ట్‌ దళంతో రన్నింగ్, 303, 12 బోర్‌ రైఫిల్‌ ఫైరింగ్‌ వంటి వాటిలో ప్రత్యేక తర్ఫీదు పొందాడు. మావోయిస్ట్‌ హిడుమల్‌ ఆధ్వర్యంలో సప్లయ్‌ టీం సభ్యుడిగా చేరి సుమారు రూ.10.50 లక్షలతో మావోయిస్ట్‌లకు అవసరమైన మోటార్‌ బైక్, మందులు, మొబైల్స్, టాబ్స్,12 వాట్స్‌ బేటరీస్, వైర్‌ బండిల్స్,క్లాత్స్,కిట్‌ బేగ్స్, రేషన్, పెట్రోలు, డీజిల్, తుపాకులు  కొనుగోలు చేసి సరఫరా చేసేవాడు. అనంతరం మిలీషియా కమాండర్‌గా మారి అనేక సంఘటనల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మార్చి 11, ఏప్రిల్‌ 24వ తేదీల్లో చత్తీస్‌గఢ్‌ జిల్లా భుర్కంపాల్‌ సంఘటనల్లో 37 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి చేసి హతమార్చిన సంఘటనలో నిందితుడిగా ఉన్నాడు. ఇతడిపై ఒడిశా ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డును ప్రకటించింది. శుక్రవారం చింతూరు డివిజన్‌ ఏటపాక మండలం పిచుకులపాడు టి.జంక‌్షన్‌ వద్ద ఉన్నతాధికారుల ఆదేశాలపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం వైపు నుంచి వస్తున్న ఆటోను తనిఖీ చేస్తుండగా ఆటోలో నుంచి నుంచి దూకి పారిపోతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ చేయగా మిలిషీయా కమాండర్‌గా గుర్తించి అరెస్ట్‌ చేసినట్టు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు. మావోయిస్ట్‌ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ సత్ఫలితాలు సాధిస్తున్న ఐపీఎస్‌ ఓఎస్డీ అంబురాజన్‌ను అభినందించారు. నక్సల్స్‌ కార్యకలాపాలపై మరింత నిఘా పెంచాలని కోరారు. చింతూరు ఓఎస్డీ అంబురాజన్, ఓఎస్డీ వై.రవిశంకర్‌రెడ్డి, డీఎస్పీ దిలిప్‌ కిరణ్,సీఐ ఆర్‌. రవికుమార్‌ పాల్గొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement