- నేడు తేలనున్న విజేతలు
- సాయంత్రం బహుమతుల పంపిణీ
ఉత్కంఠగా పాల పోటీలు
Published Fri, Dec 16 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
మండపేట :
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలపోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. మూడురోజులకు గాను శనివారం ఉదయం తీసిన పాలతో విజేతలను నిర్ణయిస్తారు. అనంతరం పశుప్రదర్శన పోటీలు జరుగనున్నాయి. సాయంత్రం ఆయా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తారు. పోటీల ప్రారంభం సందర్భంగా గురువారం సాయంత్రం తీసిన పాలను ప్రామాణికంగా తీసుకున్న నిర్వాహకులు శుక్రవారం ఉదయం నుంచి లెక్కింపు చేపట్టారు. పాలపోటీలకు సంబంధించి గేదెలకు సంబంధించి ముర్రా విభాగంలో 17, జాఫర్‌బాదిలో నాలుగు, ఆవులకు సంబంధించి ఒంగోలు విభాగంలో 17, గిర్‌లో ఆరు, పుంగనూరులో ఒక ఆవు పోటీలో నిలిచాయి. ఆయా పాడిపశువుల నుంచి శుక్రవారం ఉదయం తీసిన పాలను ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్లపై ఉంచి లెక్కింపు ప్రారంభించారు. సాయంత్రం తీసిన పాల తూకాన్ని వాటికి జత చేశారు. ముర్రాలో 25 నుంచి 26 కేజీల వరకు దిగుబడి వస్తుండగా, జాఫర్‌బాదిలో సుమారు 19 కేజీలు, గిర్ ఆవుల్లో 16 కేజీలు దిగుబడి వస్తోంది. శనివారం ఉదయం ఆయా పాడిపశువుల నుంచి తీసిన పాల తూకాన్ని కలిపి సరాసరి అధికపాల దిగుబడి ఇచ్చిన పాడిపశువులను విజేతలుగా నిర్ణయించనున్నారు. రెండు విభాగాల్లోను మొదటి మూడు స్థానాలతో పాటు ప్రోత్సాహక విజేతలను ఎంపిక చేయనున్నారు. పశు ప్రదర్శన పోటీలకు సంబంధించి పోతుల విభాగంలో ముర్రా దున్నలు నాలుగు, ఒంగోలు గిత్తలు 22, గిర్ ఐదు, పుంగనూరు తొమ్మిది, పెయ్యిల విభాగంలో ముర్రా గేదెలు 25, ఒంగోలు ఆవులు 63, గిర్ 11, పుంగనూరు 25 ఆవులు పాల్గొంటున్నాయి. పాలపళ్లు, రెండు నుంచి నాలుగు పళ్లు వరకు, ఆరు పళ్లు, ఆపైన విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఆయా పశువుల్లో జాతి లక్షణాలు ఏ మేరకు ఉన్నాయి, వాటి ప్రత్యేకతల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు.
బహుమతులు ఇలా..
పాలపోటీలకు సంబంధించి ఒంగోలు ఆవులు, ముర్రా, జాఫర్ జాతుల గేదెల విభాగాల్లో ప్రథమ బహుమతి రూ.50,000 చొప్పున కాగా, ద్వితీయ రూ.40,000, తృతీయ బహుమతిగా రూ.30,000లు చొప్పున అందించనున్నారు. గిర్, పుంగనూరు జాతుల ఆవుల విభాగాల్లో ప్రథమ రూ.40,000, ద్వితీయ రూ.30,000, తృతీయ రూ.20,000 చొప్పున పాడిరైతులకు బహుమతులుగా అందజేయనున్నారు. పశుప్రదర్శనకు సంబంధించి మూడు విభాగాల్లో మొదటి బహుమతిగా రూ.10,000, ద్వితీయ రూ.7,500, తృతీయ రూ.5,000 చొప్పున అందజేయనున్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమానికి హాజరుకానున్నట్టు అధికారులు తెలిపారు.
తరలివస్తున్న సందర్శకులు
పోటీలను తిలకించేందుకు మండపేట పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి ఔత్సాహిక పాడిరైతులు పోటీలు జరుగుతున్న పశుసంవర్ధక శిక్షణ కేంద్రానికి తరలివస్తున్నారు. పోటీలకు తీసుకువచ్చిన పశువులను తిలకించి వాటి ప్రత్యేకతలను సంబంధిత పాడిరైతులను అడిగి తెలుసుకుంటున్నారు.
Advertisement