
పిలుపు.. రాదాయె!
► మినీ మహానాడుకు అందని ఆహ్వానం
► అధినేతకు వలస ఎమ్మెల్యేల ఫిర్యాదు
► ప్రత్యేక సమావేశాల నిర్వహణకు బ్రేకులు
► పార్టీని ధిక్కరించి కార్యకర్తలతో భేటీ
► ఇన్‌చార్జీలకు, ఎమ్మెల్యేలకు మధ్య పెరుగుతున్న దూరం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మినీ మహానాడు పేరుతో నిర్వహిస్తున్న కార్యకర్తల సర్వసభ్య సమావేశానికి తమకు కనీసం పిలుపు కూడా అందలేదని గోడదూకిన ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేతను కలిసి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిసింది. తమ వెంట ఉన్న కార్యకర్తల ముందు తమ పరువు పోతోందని వాపోతున్నారు. మరోవైపు తమ కార్యకర్తలతో ప్రత్యేకంగా మినీ మహానాడులను నిర్వహించుకోవాలని మొదట్లో భావించిన ఈ గోడ దూకిన ఎమ్మెల్యేలు.. చివర్లో వెనక్కి తగ్గారు. ఈ విధంగా ప్రత్యేక భేటీలను నిర్వహిస్తే తమపై ఎక్కడ ఇన్‌చార్జీలు ఫిర్యాదు చేసి తమను కార్నర్ చేస్తారోననే ఆందోళనతో వీరు ప్రత్యేక మినీ మహానాడుల నిర్వహణ ప్రయత్నాలను విరమించుకున్నట్టు సమాచారం. మొత్తం మీద జిల్లాలో గోడదూకిన ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ ఇన్‌చార్జీలకు మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది.
అధినేతకు ఫిర్యాదు..
మినీ మహానాడులకు ఆహ్వానం అందని గోడదూకిన ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి నియోజకవర్గ ఇన్‌చార్జీల మీద ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తమను అవమానాల పాలు చేస్తున్నారని ఈ సందర్భంగా వాపోయారని తెలిసింది. తమ వెంట ఉన్న కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పుకోవాలని అధినేత వద్ద రాగాలు తీశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యకలాపాల్లో పూర్తిగా ఇన్‌చార్జీల హవా కొనసాగుతోందని.. ఇక పార్టీలో కూడా వారిదే పెత్తనం అయితే తమకు ఏమి గౌరవం ఉంటుందని వాపోతున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే తమ వెంట ఉన్న కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని అధినేత ముందు తేటతెల్లం చేశారని సమాచారం.
ప్రత్యేక మినీ మహానాడులపై వెనక్కి..
వాస్తవానికి గోడదూకిన ఎమ్మెల్యేలు ఎవరికి వారే ప్రత్యేకంగా మినీ మహానాడులను నిర్వహించుకోవాలని మొదట్లో భావించారు. అయితే, జిల్లా కమిటీ నిర్ణయానికి భిన్నంగా ప్రత్యేక భేటీలను ఏర్పాటు చేస్తే ఎక్కడ తమ మీద ఫిర్యాదు చేస్తారోననే ఆందోళనతో వీరు ప్రత్యేక భేటీ యత్నాలకు బ్రేకులు వేసుకున్నట్టు తెలిసింది. అయినప్పటికీ ప్రత్యేక మినీ మహానాడుల తరహాలో కాకుండా కార్యకర్తలతో సమావేశాల పేరిట కొద్ది మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అది కూడా పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. జిల్లా అధ్యక్షుడికి చెప్పకుండా సమావేశం కావడం పార్టీని ధిక్కరించడమేననే వాదన తెరమీదకు వచ్చింది. ఇదే విషయాన్ని పార్టీ అధినేత వద్ద నియోజకవర్గాల ఇన్‌చార్జీలు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద అధికార పార్టీలో అటు గోడ దూకిన ఎమ్మెల్యేలు... ఇటు ఇన్‌చార్జీలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
కొసమెరుపు
ఎమ్మెల్యే, ఇన్‌చార్జి మధ్య నెలకొన్న తీవ్ర వివాదాల నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గ మినీ మహానాడు ఏకంగా రద్దు కావడం గమనార్హం.