మాట్లాడుతున్న మంత్రి పీతల సుజాత
మైనింగ్ ఆదాయమే కీలకం
Published Sun, Nov 13 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
కొలిమిగుండ్ల: ఏపీకి వచ్చే ఆదాయ వనరుల్లో మైనింగ్ శాఖ కీలకంగా మారిందని భూగర్భ గనుల శాఖా మంత్రి పీతల సుజాత అన్నారు. నాపరాతిపై ఆన్‌లైన్ రాయల్టీ ధరను ప్రభుత్వం 8 నుంచి 5శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆదివారం అంకిరెడ్డిపల్లె హైస్కూల్ ఆవరణలో ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ఆధ్వర్యంలో అభినందనసభ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పీతల సుజాత హాజరయ్యారు. చరిత్రలో మొదటి సారిగా డిస్టిక్ మినరల్ ఫండ్(డీఎంఎఫ్)ను ప్రభుత్వం 30 నుంచి 10 శాతానికి తగ్గించినట్లు గుర్తు చేశారు. డీఎంఎఫ్ ద్వారా ఏటా కర్నూలు జిల్లా నుంచి రూ.50 కోట్ల ఆదాయం సమకూరుతోందని.. వాటిని జిల్లా అభివృద్ధికే వెచ్చించేలా సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. కొలిమిగుండ్ల మండలంలో అపార ఖనిజ సంపద విస్తరించినందునా పరిశ్రమల హబ్‌గా మార్చే దిశగా సీఎం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిమెంట్ కంపెనీలు సకాలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే లీజు రద్దు చేస్తామన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామి ఇచ్చారు. కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ రాష్ట్ర డైరక్టర్ శ్రీధర్, శిశు సంక్షేమ శాఖ ఆర్‌జెడీ శారద, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Advertisement