
చెప్పినట్టు చేయండంతే..
►అధికారులకు మంత్రి అమరనాథరెడ్డి ఆదేశం
►అధికారపార్టీ సమావేశాన్ని తలపించిన అభివృద్ధి సమీక్ష
►ముందు వరుసలోనే టీడీపీ నాయకులు
►విపక్షాలకు ఆహ్వానం లేదు మీడియాకు మాత్రం నో ఎంట్రీ
చిత్తూరు (కలెక్టరేట్): జిల్లాలో అధికార పార్టీ నాయకుల పెత్తనం ఎక్కువైపోయింది. ఇప్పటికే జన్మభూమి కమిటీలు పథకాల అమలులో జోక్యం చేసుకుంటున్నాయి. తాము సూచించిన వారికే లబ్ధి చేకూర్చాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వీరి వైఖరితో అధికారులు తల పట్టుకుంటున్నారు. జిల్లా మంత్రి అమరనాథరెడ్డి ఆందోళనకు గురిచేసింది. జన్మభూమి కమిటీల తరహాలోనే.... ప్రజాప్రతినిదుల కనుసన్నల్లోనే ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని అమర్‌నా«థ్‌రెడ్డి అ«ధికారులకు సూచించారు. ఈయన నిర్వహించిన అధికారుల సమీక్ష టీడీపీ పార్టీ సమావేశాన్ని తలపించింది. అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు ఒకడుగు ముందుకేసి ఏకంగా అధికారులకు ముందు వరుసలో కూర్చున్నారు.
వీరి వెనుకే కూర్చుని అధికారులు మంత్రి చెప్పిన మాటలు వినాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుగుణమ్మలతో పాటు పూతలపట్టు, పుంగనూరు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌ఛార్జిలు లలితకుమారి, వెంకటరమణరాజు, టీడీపీ నాయకురాలు వైవీ రాజేశ్వరిలు ముందువరుసలో కూర్చున్నారు. మరికొందరు టీడీపీ నాయకులు కూడా అధికారులతో సమానంగా సమావేశం ముగిసేంత వరకు కూర్చున్నారు. సమావేశానికి మీడియాను హజరుకానీయకుండా బయటకు పంపివేశారు. అనంతరం గది తలుపులు మూసివేసి దాదాపు మూడు గంటల పాటు సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ఎంపిక, అమల్లో అధికారులు తప్పని సరిగా స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని మంత్రి ఆదేశించినట్లు భోగట్టా.
ప్రజాప్రతినిధులు సూచించిన మేరకు సమన్వయం చేసుకుని అధికారులు మెలగాలన్నారు. ఈ విషయాలను విన్న అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికే జన్మభూమి కమిటీల ప్రమేయం వలన ప్రజలకు పథకాల అమల్లో న్యాయం చేయలేక పోతున్నామని, దీనికితోడు ప్రజాప్రతినిదులు కనుసన్నల్లోనే అన్నీ జరగాలంటే ఇక తామెందుకని అధికారులు బాధపడినట్లు తెలిసింది.
రహస్య రివ్యూ సమావేశమా..?
ఇటీవల అన్ని ప్రభుత్వ విభాగాల హెచ్‌వోడీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష ఉందని రాష్ట్ర మంత్రి ప్రకటించారు. కారణం చూపకుండానే సమావేశం రద్దు చేశారు. మంత్రి దొంగచాటుగా మంగళవారం అధికారులను పిలిపించుకుని రివ్యూ చేయడం సిగ్గుచేటు. ప్రజాప్రతినిధులు లేకుండా రివ్యూ చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులు వస్తే ప్రభుత్వ అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయని భయపడుతున్నారు. జిల్లా అభివృద్ధిపై మంత్రికి చిత్తశుద్ది ఉంటే ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో రివ్యూ సమావేశం నిర్వహించాలి.
– డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే, చంద్రగిరి