
జమ్మికుంట రోడ్లకు మహర్దశ
- పట్టణంలో ఫోర్‌లేన్, డబుల్ రోడ్ల నిర్మాణం
- రూ.55 కోట్లు విడుదల, త్వరలో టెండర్లు
జమ్మికుంట : జమ్మికుంట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి ఈటల రాజేందర్ రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారు. రహదారుల నిర్మాణాలకు సంబంధించి రెండు రోజుల క్రితం మంత్రి ఈటల రాష్ట్ర ప్రణాళిక నిధుల నుంచి రూ.55 కోట్లు మంజూరు చేశారు. జమ్మికుంట గాంధీచౌక్ నుంచి కొండపాక రహదారి వరకు, గాంధీచౌక్ నుంచి వీణవంక రోడ్డు వరకు ఫోర్‌లైన్ పనులకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గాంధీ చౌక్ నుంచి కోరపల్లి వైపు రహదారి 30 నుంచి 35 అడుగుల వరకు ఉండగా... ఎఫ్‌సీఐ వరకు ఫోర్‌లైన్‌గా విస్తరించనున్నారు. కోరపల్లి - కొండపాక జంక్షన్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. అక్కడి నుంచి బిజిగిరిషరీఫ్ దర్గా వరకు డబుల్ రోడ్డు పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. గాంధీచౌక్ నుంచి వీణవంక రహదారిలోని డిగ్రీ కళాశాల వరకు...గాంధీ చౌక్ నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు వ్యాపార దుకాణాలు, ఇళ్లు రోడ్డు పక్కనే ఉండడంతో వ్యాపారులు 60 అడుగుల నుంచి 70 అడుగుల వరకు సెట్‌బ్యాక్ అవుతారా అనే సందేహాలు మొదలయ్యాయి. వ్యాపారులు సహకరిస్తేనే పట్టణంలో ఫోర్‌లైన్ పనులు జరిగే అవకాశం ఉంది.
తొలగనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
జమ్మికుంట గాంధీ చౌక్ నుంచి నగర పంచాయతీ వరకు రోజూ ఎఫ్‌సీఐకి బియ్యం లారీలు, పత్తి వాహనాలు వస్తుంటారుు. ఆర్టీసీ బస్సులు వచ్చిన సమయంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. వీణవంక రహదారిలో స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, లారీల రాకపోకలతో పాటు ప్రతి మంగళవారం జరిగే వారసంత వల్ల ట్రాఫిక్ గందరగోళంగా తయారవుతుంది.ఈ రోడ్లను వెడల్పు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నారుు.
త్వరలో పనులు ప్రారంభం
రూ.55 కోట్లతో చేపట్టే రోడ్ల పనులను రెండు నెలల్లో ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు. ఇందుకు సంబంధించి టెక్నికల్ ప్రణాళికలు సిద్ధం చేసి డీపీఆర్ తయూరు చేయనున్నట్లు వారు తెలిపారు. నెల రోజుల్లో పనులకు ఆన్‌లైన్ టెండర్లను పిలుస్తామని రోడ్లు భవనాల శాఖ ఈఈ రాఘవాచార్యులు పేర్కొన్నారు.