చంద్రబాబుది రెండు భాగాల శరీరం
- తెలంగాణలో ప్రాజెక్టులకు ఆయన అనుమతి అవసరం లేదు: మంత్రి హరీశ్‌రావు
- వరంగల్ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ములుగు: ఏపీ సీఎం చంద్రబాబుది ఇన్ని రోజులు రెండు కళ్ల సిద్ధాంతమే అనుకున్నానని.. కానీ, ఆంధ్రా బాబుకు రెండు నాల్కలు, రెండు తలకాయలు, రెండు నోళ్లతో... శరీరమే రెండు భాగాలతో కూడుకున్నదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. చంద్రబాబు తెలంగాణకు సీఎమ్మా, లేక ఏపీకా అనేది అర్థం కావడం లేదని, మన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న ప్రాజెక్టు పనులను సైతం ఎవరిని అడిగి చేస్తున్నారనడం హాస్యాస్పదమన్నారు. హరీశ్‌రావు మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. నగరంలోని పండ్ల మార్కెట్, మోడల్ కూరగాయ ల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ములుగు నియోజకవర్గంలోని రామప్ప, లక్నవరం చెరువులను పరిశీలించారు. రాత్రి మంగపేటలో జరిగిన సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు అనుమతి అవసరం లేదన్నారు. సమైక్యాంధ్ర పాలనలోనే అనుమతి వచ్చిన కాళేశ్వరం, పాలమూరు, డిండి ప్రాజెక్ట్‌లకు అనుమతి రద్దు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశాడా లేదా సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు పెట్టడం ఆయన మనపై చేస్తున్న కుట్రలకు నిదర్శనమన్నారు. త్వరలో ప్రతి ఇంటికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పర్యాటక మంత్రి చందూలాల్, ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్ పాల్గొన్నారు.