
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిపై ఇక నుంచి ప్రతి సోమవారం సమీక్ష ఉంటుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమాత్యులు హరీశ్‌రావు వెల్లడించారు.
- సీఎం ‘ఇలాకా’లో పనుల ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ
- ఇకపై ప్రతి సోమవారం సమీక్షలు
- రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామాత్యులు హరీష్‌రావు
గజ్వేల్: సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిపై ఇక నుంచి ప్రతి సోమవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడ’ ఓఎస్‌డీ హన్మంతరావు నేతృత్వంలో సమీక్ష ఉంటుందని, అవసరాన్ని బట్టి తానుకూడా సమీక్షలకు హాజరవుతానని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమాత్యులు హరీశ్‌రావు వెల్లడించారు.
సోమవారం గజ్వేల్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడ’ ఓఎస్‌డీతో కలిసి నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదన్నారు.
తమ శాఖలకు సంబంధించి సమగ్ర సమాచారం అధికారుల వద్ద ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా గజ్వేల్‌ను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా ‘మిషన్ భగీరథ’ పనుల ప్రగతిపై ఈఈ రాజయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో పనులు పూర్తి చేశామని, మరో 14 వరకు గ్రామాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని కూడా తొందరలోనే పూర్తి చేస్తామని మంత్రికి వివరించారు. ఆర్‌అండ్‌బీ శాఖ పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. గజ్వేల్‌తో పాటు ఆయా మండల కేంద్రాల్లో రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు.
ఈ సందర్భంగా తలెత్తే సమస్యలను ఎంపీ, ‘గడ’ ఓఎస్‌డీలు పరిష్కరిస్తారని చెప్పారు. గజ్వేల్‌లోని వంద పడకల ఆసుపత్రి, తూప్రాన్‌లోని 50 పడకల ఆసుపత్రిని డిసెంబర్ 31 నాటికి పూర్తిచేసి అప్పగించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. నగర పంచాయతీలో విద్యుదీకరణ కోసం చేపట్టిన దీన్‌దయాళ్ పథకాన్ని ప్రజలు విరివిగా వినియోగించుకునేలా చూడాలన్నారు.
ఈ పథకం ద్వారా రూ. 125 లకే విద్యుత్ కనెక‌్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. చెరువుల్లో జేసీబీ గుంతలను ఇష్టానుసారంగా తీయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం చర్చకు రావడంతో మంత్రి సీరియస్‌గా స్పందించారు. ఇకనుంచి చెరువుల్లో లోతుగా గుంతలు తీస్తే సహించేదిలేదన్నారు.
అలాంటి చర్యలకు పాల్పడింది ఎంతటి వారైనా సరే కేసులు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇకపై గుంతలు సమాంతరంగా తీయాలని సూచించారు. ఈ సమావేశంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.