టీడీపీ నేతల కోసం జూపల్లి ఎదురుచూపు
హైదరాబాద్ : భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద టీడీపీ నేతల కోసం ఎదురు చూస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి ఈ మేరకు టీడీపీ నేతల కోసం వేచి ఉన్నారు. జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నేతల కోసం ఎదురు చూస్తున్నారు.
కాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు నాయుడు నిధులు వెచ్చించినట్లు చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జూపల్లి ఆదివారం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ కమిటీ హాలులోఈనెల 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సిద్ధంగా ఉంటానని, ఈ తేదీలు, సమయం అసౌకర్యంగా ఉంటే మీరు నిర్ణయించే సమయానికి సిద్ధంగా ఉంటామని జూపల్లి పేర్కొన్నారు. కాగా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే.