ravula chandrashekar reddy
-
కరువు పట్టించుకోని టీఆర్ఎస్: రావుల
సాక్షి, హైదరాబాద్: ప్రాజ్టెక్టులన్నీ ఎండిపోయి కరువుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడమే టీఆర్ఎస్ పనిగా ఉందన్నారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కోటి ఎకరాలకు నీరిందించడమంటే ఇంతకు ముందు న్న ప్రాజెక్టుల కింద సాగువుతున్న 70లక్షల ఎకరాలను కూడా కలుపుకుంటారా.. లేదంటే మీ ప్రభుత్వ హయాంలో చేపట్టినప్రాజెక్ట్ల ద్వారానే ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ ప్రాజెక్ట్ హోదాను తెస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న టీఆర్ఎస్ నేతలు ఇప్పడు ప్రాణహిత బోగస్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. మహారాష్ట్ర ఒత్తిళ్లకు సీఎం కేసీఆర్ త లొగ్గి తమ్మడిహెట్టి ఎత్తును 148 మీటర్లకు తగ్గించారని రావుల పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతున్నా రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు ప్రారంభించలేకపోయిందని ప్రశ్నించారు. -
ఆయన హిట్లర్‌ను మరిపిస్తున్నారు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హిట్లర్‌ను మరిపించేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసును ఏసీబీ విచారిస్తోందా, లేదా టీఆర్ఎస్ విచారిస్తోందా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎమ్మెల్యే రేవంత్‌పై కేసును ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ఏసీబీ కాకుండా ఈ కేసును మరో ప్రైవేటు సంస్థ విచారిస్తోందని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసులో ముద్దాయి కాదని, సాక్షి మాత్రమేనన్నారు. -
టీడీపీ నేతల కోసం జూపల్లి ఎదురుచూపు
హైదరాబాద్ : భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద టీడీపీ నేతల కోసం ఎదురు చూస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి ఈ మేరకు టీడీపీ నేతల కోసం వేచి ఉన్నారు. జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నేతల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు నాయుడు నిధులు వెచ్చించినట్లు చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జూపల్లి ఆదివారం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ కమిటీ హాలులోఈనెల 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సిద్ధంగా ఉంటానని, ఈ తేదీలు, సమయం అసౌకర్యంగా ఉంటే మీరు నిర్ణయించే సమయానికి సిద్ధంగా ఉంటామని జూపల్లి పేర్కొన్నారు. కాగా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
ఎర్రబెల్లి, రావులపై కేసు నమోదుకు ఆదేశం
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, రాష్ట్ర పక్షి, వృక్షం, జంతువులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేయాలన్న ప్రైవేటు ఫిర్యాదును నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, నివేదికను జనవరి 12లోగా సమర్పించాలని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం పోలీసులను ఆదేశించారు. కేసీఆర్ పిచ్చివాడని, ఆయన మాటలు ఎవరూ నమ్మడం లేదని...రాష్ట్ర పక్షి, జంతువులను అవమానపర్చేలా వీరిద్దరు ఈ నెల 6న సమావేశంలో వ్యాఖ్యలు చేశారని న్యాయవాది కొంతం గోవర్ధన్ రెడ్డి ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 295 (ఎ), 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. దీనిపై కోర్టు పైవిధంగా స్పందించింది.