
పోలీసులపై దాడి ఘటనలో మంత్రి అనుచరుడు..
కృష్ణా జిల్లా: ఆగిరిపల్లిలో పోలీసులపై దాడులకు పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు పాలేటి ఉమామహేశ్వరరావు అలియాస్ పింకీ మంత్రి రావెల కిషోర్ బాబుకు ముఖ్య అనుచరుడని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఈ ఘటనపై నార్త్‌జోన్ ఐజీ కుమార్ విశ్వజిత్ గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా పింకీ అరాచకాలపై గ్రామస్తులు ఐజీ దృష్టికి తీసుకువచ్చారు. పింకీ మంత్రి రావెల పేరుతో గ్రామంలో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నాడని వాపోయారు. పింకీ మంత్రితో పాటు సీఎం చంద్రబాబునాయుడితో దిగిన ఫోటోలను ఐజీకు అందించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ యువతిని వెంటాడిన సమయంలో మంత్రి రావెల తనయుడితోపాటు పింకీ కూడా పక్కనే ఉన్నట్లు ఆయనకు చెప్పారు.
స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టమన్నందుకు రౌడీషీటర్‌గా ఉన్న పింకీ మరికొందరు తెలుగు తమ్ముళ్లు సోమవారం పోలీసులపై మారణాయుధాలతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో టీడీపీ ఫ్లోర్ లీడర్ హరిబాబు కనకదుర్గ గుడి వద్ద హోంగార్డ్పై చేయిచేసుకున్నాడు. సోమవారం ఒక్క రోజే జిల్లాలో రెండు చోట్ల పోలీసులపై టీడీపీ నేతలు దాడులు చేయడంపై ఉన్నతాధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.