
సాక్షి, అమరావతి : ఏపీలో అధికార టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను శుక్రవారం స్పీకర్‌కు, టీడీపీ పార్టీ కార్యాలయానికి పంపారు. రావెల రాజీనామా పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇదిలావుండగా ఆయన రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిసింది.
గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ నుంచి తన అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి జనసేనలో చేరనున్నారు. రైల్వే ఉద్యోగి అయిన కిషోర్ బాబు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా సీటు దక్కించుకుని తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎవరూ ఊహించనట్టుగా ఏపీ తొలి క్యాబినెట్‌లోనే సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా మాజీ మంత్రి పార్టీని వీడడంతో టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది.