
వరద ప్రవాహాలను పరశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు
మూడు రోజులగా నియోజకవర్గంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలను శనివారం రాష్ర్ట నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు నియోజకర్గంలో క్షేత్రస్థాయిలో తిరుగుతూ పరిశీలించారు.
వాగులు, వంకల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటన
సిద్దిపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల పరిశీలన
సిద్దిపేట జోన్: మూడు రోజులగా నియోజకవర్గంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలను శనివారం రాష్ర్ట నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు నియోజకర్గంలో క్షేత్రస్థాయిలో తిరుగుతూ పరిశీలించారు. ఉదయం 8 గంటల నుంచి మొదలుకోని మధ్యాహ్నం 2 గంటల వరకు సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు మండలాల పరిధిలోని 30 చెరువులను మంత్రి పరిశీలించి వరద నీటి ప్రవాహం, స్థితిగతులపై నీటిపారుదల శాఖ, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా పట్టణంలోని కోమటి చెరువును, వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ మార్గంలోని ప్రధాన బ్రిడ్జి ( బావిస్‌ఖానాపూల్ ) ను సందర్శించి నీటి ప్రవాహం, బ్రిడ్జి స్థితిగతులు అధికారులను అడిగారు. శుక్రవారం అర్థరాత్రి పోటెత్తిన వరదనీటితో హైదరాబాద్ బ్రిడ్జి మార్గంలో నీరు పెద్ద ఎత్తున చేరిన విషయాన్ని గుర్తించారు. ఫీడర్ చానల్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన గేట్లను వెంటనే ఎత్తివేయాలని అర్‌అండ్‌బీఈఈ బాల్‌నర్సయ్యను., ఏఈ రవికుమార్‌కు సూచించారు. అలాగే నర్సాపూర్ చెరువులోకి ఫీడర్ చానల్ ద్వారా వస్తున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
ఫీడర్ లేకుంటే ఫికరే..
నాడు కోమటి చెరువు మత్తడి నీటి ప్రవాహాన్ని తరలించేందుకు సిమెంట్ లైనింగ్‌తో పట్టణ శివారులోని కెనాల్ మార్గంలో ఫీడర్ చానల్‌ను నిర్మించేందుకు ముందుకోస్తే స్థానికులు అభ్యంతరం చెప్పారని, నేడు సిమెంట్ లైనింగ్ ఫీడర్ చానల్ లేకుంటే కోమటి చెరువు లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా ఉండేదని మంత్రి స్థానికులతో అన్నారు. అనంతరం బృందావన్ కాలనీలోని నర్సాపూర్ ఫీడర్ చానల్‌ను పరిశీలించారు.
పేట చెరువు నిండడమే నా కల
రాజగోపాల్‌పేట పెద్ద చెరువును నింపడమే తన లక్ష్యమని, ఇలాంటి వర్షాలు మరింతగా కురిస్తే తన కల తీరుతుందని దానికి నీటి పారుదల శాఖ అధికారుల సహకారం కూడా ఎంతో ఆవసరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బృందావన్ కాలనీలోని నర్సాపూర్ ఫీడర్ చానల్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కోమటి చెరువు వరద నీరు ప్రవాహం ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం పట్ల అక్కడే ఉన్న నీటిపారుదల శాఖ ఈఈ రవీందర్‌రెడ్డిని పిలిచి వివరాలు సేకరించారు.
ఫీడర్ చానల్‌లో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించాలన్నారు. అదే విధంగా నర్సాపూర్ ఫిడర్ చానల్‌ను సిమెంట్ లైనింగ్ ద్వారా మార్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు. మంత్రి అదేశాలతో నీటిపారుదల శాఖ అధికారులు అప్పటికప్పుడే యంత్రాలను తెప్పించి ఫిడర్ చానల్‌లోని చెట్ల పొదలు తొలగించారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ డీఈ నాగరాజు, ఏఈ విష్ణు, తహశీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.