మిరప రైతులకు తుఫాన్ టెన్షన్
తాడికొండ రూరల్: ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో మిరప కోతలు డిసెంబర్ తొలి వారంలోనే ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు కాయలను కోసి కల్లాల్లో ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. తుఫాన్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో కల్లాల్లో ఆరబోసిన కాయలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తాడికొండ మండలంలోని బండారుపల్లి, గరికపాడు, దామరపల్లి, ఫణిదరం, రావెల, పాములపాడు, పొన్నెకల్లు, బేజాత్పురం, ముక్కామల, ఎల్‌జీ పూడి పరిసర ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో రైతులు మిరప సాగు చేశారు. నిన్న మొన్నటి వరకు సాగునీరు విడుదల లేక ఇబ్బందులు పడిన రైతులకు నేడు తుఫాన్ టెన్షన్ ఇబ్బంది పెడుతుంది. కల్లాల్లో ఆరబోసిన కాయలను కాపాడుకొనేందుకు టార్ఫాలిన్ పట్టాలతో రాత్రివేళ కాపలా ఉంటున్నారు.