ఘాటు తగ్గిన మిర్చి | Mirchi prices not hot enough for Shadnagar farmers | Sakshi
Sakshi News home page

ఘాటు తగ్గిన మిర్చి

Published Tue, Apr 25 2017 5:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఘాటు తగ్గిన మిర్చి - Sakshi

ఘాటు తగ్గిన మిర్చి

► గణనీయంగా తగ్గిన పచ్చి మిర్చి దిగుబడులు
► పెరిగిన ఎండలతో వ్యాపిస్తున్న తెగుళ్లు
► వైరస్‌ కారణంగా పక్కపంటకూ సోకుతున్న వైనం
► కనీసం పెట్టుబడులు కూడా రాక దిగాలు


షాద్‌నగర్‌రూరల్‌: ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడం.. మరోవైపు చీడ పీడల ఉధృతి పెరగడంతో ఆశించిన దిగుబడులు లేక మిర్చి రైతు కుదేలవుతున్నారు. సాగుకోసం ఖర్చు చేసిన డబ్బులురాక అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 20నుండి 50బస్తాల మిర్చిని పండిస్తే ప్రస్తుతం 5 బస్తాలు కూడా దిగుబడి రాని పరిస్థితి నెలకొంది. షాద్‌నగర్‌ ప్రాంతంలో వాణిజ్య, ఆహార పంటలతోపాటు కూరగాయలను కూడా విస్తారంగా సాగుచేస్తారు. ఈ ప్రాంతంలో పండించే పచ్చి మిరప నాణ్యమైనదిగా ఉండటంతో ఇక్కడి నుండి బెంగళూరు, హైదరాబాద్, పూణె, బొంబాయి తదితర ప్రాంతాలకు వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. కేశంపేట, కొందుర్గు, దరిగూడ, కొత్తూరు, ఫరూఖ్‌నగర్‌ మండలాలకు సంబం ధించిన రైతులు రోజుకు దాదాపు 5వేల బస్తాల వరకు షాద్‌నగర్‌ మార్కెట్‌కు తీసుకొచ్చేవారు. ప్రస్తుతం బోరుబావులలో నీటి మట్టం తగ్గిపోవడం, మిర్చి పంటకు చీడ పీడల సమస్య పెరగడంతో మిర్చి సాగు సగానికిపైగా పడిపోయింది. దీంతో దిగుబడులు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం షాద్‌నగర్‌ మార్కెట్‌కు రోజుకు దాదాపు 200 బస్తాల మిర్చి కూ డా రావడంలేదని వ్యాపారులు వాపోతున్నారు.

ప్రధాన పంటగా మిరప సాగు
షాద్‌నగర్‌ నియోజకవర్గంలో రైతన్నలు కూరగాయల పంటలతోపాటు మిరప పంటను అధికంగా సాగు చేస్తారు. ఈ ఏడాది దాదాపు 1000 ఎకరాల్లో మిరప పంటను సాగుచేశారు. నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్‌ మండలంలో కిషన్‌నగర్, హాజిపల్లి, ఎల్లంపల్లి, కంసాన్‌పల్లి, రాయికల్, అయ్యవారిపల్లి, విఠ్యాల, సురారం, బుచ్చిగూడ, వెల్‌జర్ల గ్రామాల్లో కేశంపేట మండలంలో తొమ్మిదిరేకుల, కొత్తపేట, కాక్‌నూర్, సుందరాపూర్, ఇప్పలపల్లి, పోమాల్‌పల్లి, నిర్దవెళ్లి, కొత్తూర్‌ మండలం పెంజర్ల, సిద్దాపూర్, కొడిచర్ల, అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, మామిడిపల్లి, మొదళ్లగూడ, కొందుర్గు మండలం పద్మారం, లక్ష్మిదేవిపల్లి, గుర్రంపల్లి, పర్వతాపూర్, చిన్నఎల్కిచర్ల తదితర గ్రామాల్లో రైతులు అధికంగా మిరప పంటను సాగుచేస్తారు.

వేధిస్తున్న చీడపీడల సమస్య
ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండటం వల్ల మిరపపంటకు అధికంగా చీడపీడలు సోకాయని రైతన్నలు వాపోతున్నారు. ప్రస్తుతం మిరపపంటకు పైముడత అధికంగా సోకడం వల్ల మిరప కాయలు కాయడం లేదని ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.

పెట్టుబడులు రావడం కష్టమే..
మిరప విత్తనాల కొనుగోలుకే ఎకరానికి దాదాపు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు ఖర్చయ్యిందని, పంటల సాగు యాజమాన్యం కోసం ఎకరానికి మరో రూ. 10 వేలు ఖర్చు వచ్చిందని రైతన్నలు అంటున్నారు. ప్రస్తుతం చీడపీడల కోసం పిచికారీ చేయాల్సిన మందులు ఏజంట్‌ ప్లస్, ఎస్పేట్, డిఫోల్డర్, ట్రేసర్‌ తదితర మందులు పిచికారీ కోసం కూడా ఎకరానికి దాదాపు రూ. 10 వేల వరకు ఖర్చయ్యిందని, అయినప్పటికీ మిరపకు ముడత వదలడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది మిరపపంటకు విపరీతంగా తెగుళ్లు సోకాయి. నారువేసిన మొదటి నుంచి కూడా ఆకుముడత విడవడం లేదు.  ఎకరా మిరపపంట సాగుచేస్తే కోతకు 20 కిలోలు కూడా దిగుబడి రావడం లేదు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. – గున్నరాంచంద్రయ్య, రైతు, ఎల్లంపల్లి, ఫరూఖ్‌నగర్‌ మండలం

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి మిరప పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. గతంలో రోజూ మార్కెట్‌కు దాదాపు 5వేల బస్తాలకు వరకు వచ్చేవి. ఇప్పుడు 200 బస్తాలు కూడా రావడం లేదు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. – జలీల్, కమీషన్‌ ఏజెంట్, షాద్‌నగర్‌

ఎండల తీవ్రత ఎక్కువ కావడం వల్లనే మిరప పంట కు ఈ ఏడాది అధికంగా ఆకుముడత తెగులు వచ్చిం ది. వైరస్‌ వల్ల ఈ తెగులు ఒకరి పొలం నుంచి మరొ కరి పొలంలోకి సోకుతోంది. రైతులు పంట మార్పిడి చేస్తే బాగుంటుంది. అలాగే  రైతులు రోజూ సాయంత్రం వేళల్లో నీటిని పిచి కారీ చేస్తే ఫలితం ఉంటుంది.– రుక్మిణి, ఉద్యానవన విస్తరణాధికారి, షాద్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement