ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తి
-
తప్పిన ఘోర ప్రమాదం
సంగం : ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులకు ప్రమాదం తప్పిన సంఘటన గురువారం రాత్రి మండలంలోని వెంగారెడ్డిపాళెం వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. ఉదయగిరి డిపోకు చెందిన ఏపీ 26జెడ్ 0075 నంబరు ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి ప్రయాణికులతో ఉదయగిరికి వెళ్తోంది. మార్గమధ్యంలో మండలంలోని వెంగారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు వద్ద బస్సు డ్రైవర్ రజాక్ కడుపునొప్పి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ సమయంలో రోడ్డు పక్కనే దువ్వూరు డ్రైన్ ఉండటాన్ని గుర్తించి అనారోగ్యాన్ని లెక్క చేయకుండా బస్సును కాలువ పక్కనే అతి కష్టం మీద నిలిపివేశాడు. ఈ సమయంలో వాంతులై స్టీరింగ్‌పై ఒరిగాడు. ప్రయాణికులు, కండెక్టర్ వెంకటేశ్వర్లు అతని పరిస్థితి గమనించి 108 ద్వారా బుచ్చిరెడ్డిపాళెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ రజాక్ సమయస్ఫూర్తితో వ్యవహరించకుంటే బస్సు దువ్వూరు డ్రైన్‌లో పడి ఘోర ప్రమాదం జరిగి ఉండేది.