కొత్త రేషన్ కార్డుల్లో పేర్లు, ఫొటోల గల్లంతు
తెల్లబోతున్న లబ్ధిదారులు
నాలుగు మండలాలకు అందని కొత్త కార్డులు
కొవ్వూరు :
కొవ్వూరు పట్టణంలోని 1వ వార్డుకు చెందిన ముప్పిడి పార్వతి పేరిట కొత్త రేషన్ కార్డు మంజూరైంది. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉండగా.. కుమార్తె పేరు నమోదు కాలేదు. అదే వార్డు చెందిన రాణి పేరుతో జారీ చేసిన కార్డులో ఇంటి యాజమాని అయిన ఆమె భర్త పేరు ముద్రించలేదు. ఇదే ప్రాంతానికి చెందిన ఎన్.ప్రభుకుమారికి ఇచ్చిన కార్డులోని ఫొటోలు భార్యభర్తలు, ఇద్దరు పిల్లల ఫొటో ఉంది. ఇద్దరు సంతానమైనా.. ఒకరి పేరు మాత్రమే నమోదైంది. 3వ వార్డుకు చెందిన మామిడి వెంకటేష్ పేరిట జారీ చేసిన కొత్త కార్డులో వెంకటేష్ దంపతులు, ఇద్దరు పిల్లల ఫొటో ముద్రించారు. అయితే, ఆయన భార్య పేరు మాత్రం నమోదు చేయలేదు. ఇదే పట్టణానికి చెందిన కె.రమ్యశ్రావణి పేరుతో జారీ అయిన కార్డులో ఏ ఒక్కరి ఫొటోను ముద్రించలేదు. ఈ పరిస్థితి ఒక్క కొవ్వూరు పట్టణానికే పరిమితం కాలేదు. జిల్లాలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలోనూ ఇలాంటి తప్పులు కోకొల్లలుగా ఉన్నాయి. భార్య పేరు ఉంటే భర్త పేరు గల్లంతవడం, ఇద్దరుపి ల్లలు ఉంటే.. ఒకరి పేరు మాత్రమే ఉండటం, కొన్ని కార్డుల్లో అసలు ఫొటోలే ముద్రించకపోవడం వంటి లోపాలు ప్రతిచోట కనిపిస్తున్నాయి. పేర్లు, వయసు తప్పుగా నమోదు కావడం ప్రతిచోట ఉంది. సోమవారం ప్రారంభమైన జన్మభూమి గ్రామసభల్లో కొత్త కార్డులు అందుకున్న వారి అందులోని వివరాలను చూసి తెల్లబోయారు.
48,173 కొత్త కార్డులు మంజూరు
జిల్లాకు జన్మభూమిమా ఊరు కార్యక్రమంలో భాగంగా 48,173 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీటిని సోమవారం నుంచి ఈ నెల11 వరకు నిర్వహించే జన్మభూమి గ్రామసభల్లో పంపిణీ చేయనున్నారు. తెల్ల రేషన్ కార్డుల కోసం 81,094 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో వివిధ కారణాలతో 2,739 దరఖాస్తులను తిరస్కరించారు. 56,929 దరఖాస్తుల అర్హమైనవిగా తహసీల్దార్లు, జాయింట్ కలెక్టర్ నిర్ధారించారు. అయితే, వీటిలో 48,173 మందికి కార్డులు మాత్రం మంజూరయ్యాయి. వాటి ప్రింటింగ్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో అన్ని మండలాలకు పూర్తిస్థాయిలో కార్డులు అందలేదు. 20 శాతం కార్డులు అందలేదని ప్రాథమికంగా అంచనా వేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుగానే చర్చించుకుని గ్రామ సభల షెడ్యూల్‌ను ఖరారు చేసినప్పటికీ కార్డులు అందని కారణంగా చాలాచోట్ల గ్రామసభలను వాయిదా వేశారు.
రేషన్‌కు కోతే
జన్మభూమిలో అందించే కొత్తకార్డుల్లో ముద్రించిన ఫొటోల్లో ఎంతమంది ఉన్నా.. పేర్లు నమోదైన కుటుంబ సభ్యులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు రేషన్ సరుకులు కేటాయిస్తారు. తప్పుల
కారణంగా కొత్త కార్డుల్లో సుమారు 50 వేల మంది పేర్లు గల్లంతై ఉంటాయని అంచనా. వీరందరికీ రేషన్ బియ్యం అందని పరిస్థితి. వీరంతా ఎన్టీఆర్ వైద్య సేవలకు దూరం కావాల్సిన పరిస్థితి.
4 మండలాలకు అందని కార్డులు
తణుకు, ద్వారకాతిరుమల, కామవరపుకోట, పెదవేగి మండలాలకు సంబంధించి కొత్తకార్డులు ప్రింటింగ్ కాలేదు. దీంతో ఈ నాలుగు మండలాల్లో జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జీలుగుమిల్లి మండలానికి 638 అందాల్సి ఉండగా 51కార్డులు మాత్రమే ప్రింటి అయ్యాయి. వేలేరుపాడు మండలంలో 292 కార్డులు మంజూరైతే 44 కార్డులు మాత్రమే ప్రింటింగ్ కావడంతో ఇక్కడ గ్రామసభ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు.
అందరి పేర్లు నమోదు కాలేదు
ఏడాది క్రితం రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాను. జన్మభూమి కార్యక్రమంలో ఆధికారులు కార్డు ఇచ్చారు. నేను, నా భార్య, నలుగురు పిల్లలు ఫొటో తీయించుకుని దరఖాస్తు అందజేశాను. ప్రస్తుతం కార్డులో ఇద్దరి పిల్లల పేర్లు మాత్రమే నమోదయ్యాయి. అధికారులను అడిగితే పేర్లు నమోదుకు మీ సేవలో దరఖాస్తు చేసుకోమని చెబుతున్నారు.
ఎరిపెల్లి ముసలయ్య, కుమారదేవం, కొవ్వూరు మండలం
సమాచారం లేదు:
కొత్త రేషన్ కార్డుల్లో తప్పులు ప్రచురితం అయినట్టు ఏ తహసీల్దార్ నుంచి సమాచారం అందలేదు. ఎక్కడైనా తేడాలుంటే పూర్తి వివరాలను తహసీల్దార్ ద్వారా పంపితే సరిదిద్దేంకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. ఆధార్ నంబర్ అనుసంధానం కాకపోవడం, చిన్న అక్షర దోషాలు వచ్చిన పేర్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
సయ్యద్ యాసిన్, జిల్లా పౌర సరఫరాశాఖ అధికారి