వివక్షపై దీక్ష | MLA Anil two days fast begins | Sakshi
Sakshi News home page

వివక్షపై దీక్ష

Published Thu, Sep 29 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

వివక్షపై దీక్ష

వివక్షపై దీక్ష

 
  • నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ నిరాహారదీక్ష ప్రారంభం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) :
అభివృద్ధి నిధుల కేటాయింపులో నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయంపై సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ బుధవారం గాంధీబొమ్మ వద్ద చేపట్టిన నిరాహారదీక్షలో నిరసన గళాలు ఎగసిపడ్డాయి. నియోజకవర్గంలో అసలైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాల మంజూరులో జరుగుతున్న జాప్యంపై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేసినప్పటికీ వివక్షత చూపుతున్న అధికారపార్టీపై వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. తొలుత వివిధ డివిజన్ల నుంచి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ర్యాలీలుగా నిరాహారదీక్ష వేదికకు తరలివచ్చారు. మహాత్మాగాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు, వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే అనిల్‌ దీక్షను ప్రారంభించారు. క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరాహారదీక్ష ప్రారంభోత్సవ సభలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీజిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు పముజుల దశరథరామయ్య తదితరులు నగర నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్, డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ రూప్‌కుమార్‌యాదవ్, పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్బన్‌ ఆర్యవైశ్య సంఘం నాయకులు, బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ నాయకులు, కిరాణామర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు నిరాహారదీక్షకు మద్దతు తెలిపారు.
భారీ ర్యాలీ..
వైఎస్సార్‌సీపీ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో నిరాహారదీక్ష శిబిరానికి చేరుకున్నారు. భారీగా జనం చేరడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కార్పొరేటర్లు కుంచాల కృష్ణవేణి, వేలూరు సుధారాణి, గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్‌ అహ్మద్, దేవరకొండ అశోక్, దామవరపు రాజశేఖర్, ఓబిలి రవిచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కొణిదెల సుధీర్,  రఘు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, ఎస్సీ సెల్‌ నాయకులు పాల్గొన్నారు. 
 
 
ఆత్మపరిశీలన చేసుకోవాలి – మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ
ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిధుల కేటాయింపులో వివక్షత చూపించడంపై పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నగర ఎమ్మెల్యే అనిల్‌ ఎంత విసిగి వేసారి పోయి ఉంటే నిరాహారదీక్ష చేపడతారు. మేయర్‌కు కూడా ప్రజలు ఓట్లేశారు. ఆ విషయాన్ని గుర్తించుకోవాలి. అభివృద్ధి నిధులను కేటాయించకపోవడంలో బాధ్యులైన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఇది. వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు అసహ్యించుకుంటున్నారు. పొరపాట్లను సరిదిద్దుకొని ఇప్పటికైనా నిధులు కేటాయించాలి. 
 
చరిత్రాత్మక నిర్ణయం –  సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం నిరాహారదీక్ష చేపట్టడం చరిత్రాత్మక నిర్ణయం. కార్పొరేషన్‌ పాలన నెల్లూరుకు పట్టిన దౌర్భాగ్యం. 10 నెలలుగా ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను విస్మరించి కేవలం దోచుకోవాలనే ఆలోచనతో మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌లకు ఉండడం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఇంత ఏకపక్షపాలన ఎన్నడూ చూడలేదు. నగర ప్రజల అభివృద్ధికోసం ఎమ్మెల్యే నిరాహారదీక్ష చేయాల్సిన పరిస్థితులు రావడం బాధాకరం. 
 
అభివృద్ధికి కలిసి పనిచేసేందుకు సిద్ధం – అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే
నగర ప్రజల అభివృద్ధికోసం కలిసి పనిచేసేందుకు సిద్ధం.. కలుపుకుని పనిచేసేందుకు మీరు సిద్ధమా?. దీక్షలో చెప్పిన వివరాలు తప్పని నిరూపిస్తే క్షమాపణ చెబుతా. రెండున్నరేళ్లలో 28 డివిజన్లలో కేవలం రూ.12 కోట్ల నుంచి రూ.13కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. నగర నియోజకవర్గంపై వివక్షత ఎందుకు. అర్హులైన 3,500 మందికి పింఛన్లు అందడంలేదు. రైల్వే స్థలాలవద్ద ఉంటున్నవారికి నివేశన స్థలాలు విషయం పట్టించుకునేవాళ్లు లేరు. మంత్రి ఎప్పుడు వస్తాడో... ఎప్పుడు వెళ్తాడో తెలియదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి శఠగోపం పెట్టారు. మేయర్‌ పుట్టుకతోనే ప్రజాసేవకుడు అయినట్టు మాట్లాడుతున్నాడు. అధికారం శాశ్వతం కాదు. అధికార అహంతో పాతాళలోకానికి పోయిన చాలా మంది ఉన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకో.. వివక్షత వీడు. కనీసం షాదీమంజిల్‌ మరమ్మతు పనులైనా ఇంతవరకు చేపట్టలేదు. టెండర్ల ప్రక్రియ వరకు ఆగిపోయింది. మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బిక్షతోనే మేయర్‌వు అయ్యావు. ఇప్పటికైనా ప్రజా సమస్యలు పట్టించుకో.
 
కేవలం ఆరోపణలు కాదు – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే
అభివృద్ధి నిధుల వివక్షతలో కేవలం ప్రతిపక్ష ఆరోపణలు కాదు. ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలుగా ఎన్నిసార్లు చెప్పినా మంత్రి, మేయర్‌ పట్టించుకోలేదు. పత్రికల్లో వస్తున్న పుంకాలు పుంకాలు వార్తలకు సమాధానం ఏం చెబుతారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. సొంత కార్పొరేషన్‌పై మంత్రి దృష్టి సారించాలి. అభివృద్ధి పనులకోసం మంత్రి ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరిస్తాం. అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.
 
వైఎస్సార్‌ హయాంలో మాదిరిగా పథకాలు అందాలి – ఆనం విజయకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మాదిరిగా పేదలందరికీ పథకాలు అందాలి. చట్టబద్ధతలేని జన్మభూమి కమిటీ చెప్పిన వారికి సౌలభ్యాలు కల్పిచండం మంచిది కాదు. ఇంతటి ఏకపక్ష ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్‌లో అభివృద్ధి నిధులు కేటాయించాలి. 
 
చిత్తశుద్ధిగల ఎమ్మెల్యే అనిల్‌ –పముజుల దశరథరామయ్య, సీపీఐ రాష్ట్ర నాయకుడు 
పిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై నిజాయితీతో పనిచేస్తున్న నగర ఎమ్మెల్యే అనిల్‌ దీక్ష అర్థవంతమైంది. అభివృద్ధికోసం ఓటు వేసిన అందరికీ సాయం చేయాలనే తపన పాలకవర్గానికి కనువిప్పుకావాలి. పక్షపాతంతో కార్పొరేషన్‌లో పనులు చేయడం మంచి పద్దతి కాదు. న్యాయం జరిగే వరకు ఎవరు పోరాటం చేసినా పార్టీ తరపున మద్దతు ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement