మల్లన్నసాగర్ పాకిస్తాన్‌లో ఉందా?
మల్లన్నసాగర్ తెలంగాణలో ఉందా లేక పాకిస్తాన్‌లో ఉందా అని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఎన్నిరోజులు అడ్డుకునే ప్రయత్నం చేసినా మేము మాత్రం అక్కడికి వెళ్లే వరకు విశ్రమించేది లేదని ఘంటాపధంగా తెలిపారు. మల్లన్నసాగర్‌పై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడంలేదని అన్నారు. ఫామ్‌హౌస్‌లో ఉంటూ పోలీసు రాజ్యం నడుపుతున్నారని విమర్శించారు.
మల్లన్న సాగర్ రైతులను కాంగ్రెస్ నాయకులు పరామర్శించడానికి వెళ్తుంటే ప్రభుత్వ పెద్దలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీల అరెస్ట్‌లను ఖండిస్తున్నానని ఆమె తెలిపారు. మాకేమో 144 సెక్షన్ అంటున్న పోలీసులు.. టీఆర్‌ఎస్ నాయకులకు ఎలా ర్యాలీలకు అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు.
ఎంసెట్ పేపర్-2 లీకేజీ అయ్యి వేలాది మంది విద్యార్థులు ఆందోళనలో ఉన్నా కేసీఆర్ స్పందికపోవడం వెనక మతలబు ఏమిటన్నారు. అవినీతి ఆరోపణల వచ్చిన వెంటనే గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యపై చర్య తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. దీనిని బట్టి చూస్తే లీకేజే వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.