సమయం లేదు మిత్రమా
- వారం రోజుల్లో పీఏ శేఖర్‌ను సాగనంపాల్సిందే
- లేకుంటే ఎన్టీఆర్ విగ్రహంవద్ద నిరాహార దీక్ష
- విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీసీ, అంబికా
హిందూపురం అర్బన్ : ‘‘వారం రోజులే గడువు. బాలకృష్ణ ఎమ్మెల్యే పీఏ శేఖర్‌ను సాగనంపాల్సిందే. లేదంటే హిందూపురం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షలకు దిగుతాం’’ అని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ ఆదివారం ముక్తకంఠంతో చెప్పారు. సినీనటుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వారం రోజులుగా టీడీపీలో అసమ్మతి సెగలు రేగుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) చంద్రశేఖర్ (శేఖర్)ను హిందూపురం నుంచి వారం రోజుల్లోగా తప్పించాలని అసమ్మతి వర్గం అల్టిమేటం ఇచ్చింది.
30 యాక్ట్, 144 సెక‌్షన్
చిలమత్తూరులో అసమ్మతి నాయకులు ఆదివారం పెద్దఎత్తున సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే పోలీసు అధికారులు 30 యాక్టు, 144 సెక‌్షన్ అమలు చేయడంతో చిలమత్తూరు సమీపంలోని ఏడో నంబరు జాతీయ రహదారిలో నడుచుకుంటూ కృష్ణారెడ్డి తోటకు చేరుకున్నారు. కానీ అక్కడికీ పోలీసులు చేరుకుని సమావేశాన్ని అడ్డుకున్నారు. అనంతరం బాగేపల్లి సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద సమావేశం నిర్వహిస్తుండగా కర్ణాటక పోలీసులు వచ్చి భగ్నం చేశారు. దీంతో టీడీపీ అసమ్మతి నాయకులు సమావేశ స్థలాలు మూడుసార్లు మార్చుకోవాల్సి వచ్చింది.
అడ్డుకోవడం సిగ్గుచేటు
అసమ్మతి వర్గానికి నాయకత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ తమ సమావేశాన్ని పోలీసు బలగాలతో అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ‘‘మేం రాడికల్స్ కాదు. దేశద్రోహులు అసలే కాదు. పార్టీకి, ప్రభుత్వానికీ వ్యతిరేకమూ కాదు. కార్యకర్తల సమస్యలు మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశాన్ని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.
వారం రోజులు డైడ్‌లైన్
ఎమ్మెల్యే బాలకృష్ణ, పార్టీ అధిష్టానంపై గౌరవంతో తమ నిర్ణయం (మూకుమ్మడి రాజీనామా) వారం రోజులు వాయిదా వేస్తున్నట్టు అసమ్మతి నేతలు ప్రకటించారు. వారంలోపు పీఏ శేఖర్‌ను సాగనంపకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని చెప్పారు.