ఎమ్మెల్యే రాజా నిర్బంధం
-
హైదరాబాద్ వెళ్లేందుకు అంగీకరించిన పోలీసులు
-
విమానాశ్రయానికి తరలింపు
తునిరూరల్ :
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత హైదరాబాద్ వెళ్లేందుకు అంగీకరించి మధురపూడి విమానాశ్రయానికి తరలించారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్.అన్నవరంలో స్వగృహం నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే రాజాను పట్టణ సీఐ బి.అప్పారావు, ఎస్సై శంకరరావు, పోలీసులు వెంబడించి తునిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. దివీస్ ల్యాబ్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆరవ తేదీన బాధితులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అధికారేతర పార్టీల నాయకులు, సంఘాల వారు నిర్ణయించారు. దీంతో మంగళవారం అన్ని ప్రాంతాల నుంచి వచ్చే నాయకులను అడ్డుకునే క్రమంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను నిర్బంధించేందుకు పోలీసులు యత్నించారు. దివీస్‌కు వ్యతిరేకంగా జరిగే సమావేశానికి వెళ్లనివ్వబోమని సీఐ అప్పారావు స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌లో జరిగే పార్టీ సమావేశానికి వెళతానని ఎమ్మెల్యే రాజా పోలీసులకు చెప్పారు. దివీస్‌కు వ్యతిరేకంగా జరిగే సమావేశానికి వెళతారన్న అనుమానంతో ఉన్న పోలీసులు హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతిస్తామని, విమానాశ్రయం వరకు తామే పంపిస్తామని ఎమ్మెల్యేకు చెప్పారు. ఇందుకు అంగీకరించడంతో ఎమ్మెల్యేను మధురపూడి విమానాశ్రయానికి పోలీసులు తరలించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ పాండురంగారావును తన ఆస్పత్రిలో నిర్బంధించారు. పంపాదిపేట సమీపంలో అదుపులోకి తీసుకున్న సీపీఐ (ఎం.ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి బుగత బంగార్రాజు, తుని ఏరియా కార్యదర్శి కె.జనార్ధన్‌లను పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.