నగరిపై మొదటి నుంచి కక్ష సాధింపే
►విద్యుత్ బిల్లులు చెల్లించని వారిపై కేసులు పెడితే ఉద్యమిస్తాం
►ముఖ్యమంత్రి తీరుపై ఎమ్మెల్యే రోజా ధ్వజం
పుత్తూరు: నగరి నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి నుంచి కూడా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. బుధవారం పుత్తూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ బిల్లులు చెల్లించాలం టూ ప్రభుత్వం దళితులను వేధించడాన్ని ఎమ్మెల్యే రోజా ఆక్షేపించారు. గత ప్రభుత్వ హయాం నుంచి దళిత, గిరిజన గృహాలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 50 నుంచి 70 యూనిట్లకు పెంచా మని ఆర్భాటపు ప్రకటనలిస్తూ క్షేత్రస్థాయిలో మాత్రం వారిని బిల్లులు చెల్లించాలని వేధించడాన్ని ఆమె తప్పుపట్టారు.
కరెంట్‌బిల్లు చెల్లించని దళితులు, గిరిజ నులపై రాష్ట్రప్రభుత్వం కేసులు నమోదుచేస్తే ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా తాగునీటి ఎద్దడి పొంచి ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌డబ్ల్యూఎస్, ఇతర ఇంజినీరింగ్ అధికారులను కుప్పంకు డిప్యుటేషన్‌పై పంపడం సరికాదన్నారు. మొదటిసారి ప్రకటించిన కరువు మండలాల జాబితాలో నగరి నియోజకవర్గం మొత్తానికి చోటు కల్పించకపోవడమే అందుకు ఉదాహరణ అన్నారు.
ఎంపీడీవోలు, జేబీ కమిటీలతో కుమ్మక్కై అనర్హులకు సామాజిక భద్రతా పింఛన్లను కట్టబెడుతున్నారని ఆమె మండిపడ్డారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కుప్పానికి తరలించిన అధికారులను వెంటనే యథాస్థానానికి పంపించే విధంగా కలెక్టర్ చొరవ తీసుకోవాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై, నాయకులు రవిశేఖర్‌రాజు, దిలీప్‌రెడ్డి, ప్రతాప్, నారాయణ బాబు, మాహీన్, వడమాలపేట ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సురేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు.