- ఇన్‌పుట్ సబ్సిడీలో అన్యాయం చేస్తే సహించం
- 12న వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
- ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి
విడపనకల్లు : రైతులకు పార్టీలు అంట గట్టి ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరులో తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే వ్యవహరిస్తున్న వ్యవసాయాధికారుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం విడపనకల్లులో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ కనుసన్నల్లో అధికారులు పని చేస్తున్నారని, అధికారిగా ఉంటూ రైతులకు అన్యాయం చేస్తే సహించమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ఇళ్లలో ఊడిగం చేస్తున్నారా అని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ వాళ్లు చెప్పిన వారికి పంటలు హెక్టారు కన్నా తక్కువ ఉన్నా కూడా 2016 సంవత్సరానికి సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ రు.30 వేలు, రూ.29 వేలు, రూ.27 వేలు ప్రకారం మంజూరు చేశారన్నారు.
టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి ఒకే ఇంట్లో 5 మంది ఉంటే అలాంటి వారికి కూడా ఒక్కొక్కరికీ రు. 30 వేల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేశారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న రైతులకు మాత్రం 15 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్న వారికి కూడా రూ.3 వేలు, రూ. 5 వేలు, రూ.6 వేలు మాత్రమే ఇన్‌పుట్ సబ్సీడీ మంజూరు చేశారని ధ్వజమెత్తారు. అధికారులు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని మంజూరు చేయాలే తప్పా రైతులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. డొనేకల్లు, ఆర్.కొట్టాల గ్రామాల్లో దాదాపు 1500 మంది రైతులు ఉంటే టీడీపీకీ అనుకూలంగా ఉన్న 600 మంది రైతులకు మాత్రమే రు. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసి, మిగతా రైతులకు తీవ్ర అన్యాయం చేశారని ఆక్రోశం వ్యక్తం చేశారు.
అధికారుల తప్పుడు గా తయారు చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ జాబితాను సరిచేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసేలా ఈ విషయాన్ని వ్యవశాయ జేడీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. టీడీపీ నేతలు చెప్పినట్లు వ్యవహరించి ‡రైతులకు అన్యాయం చేస్తే మీరే బలి కావాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. గతంలో కూడా వ్యవసాయాధికారులు హావళిగిలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరులో తీవ్ర అన్యాయం చేశారని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీనా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడిమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ తిప్పయ్య, వైఎస్సార్‌సీపీ కిసాన్‌సెల్ నాయకులు గోపాల కృష్ణ, డొనేకల్లు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు పార్టీలను అంటగడతారా ?
Published Thu, Jun 8 2017 10:59 PM | Last Updated on Tue, Oct 30 2018 5:12 PM
Advertisement