ఎమ్మెల్సీగా చిక్కాల ఏకగ్రీవం
ధ్రువీకరణ పత్రం అందజేసిన రిటర్నింగ్ అధికారి
కాకినాడ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తెలుగుదేశం అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఎన్నికల ప్రత్యేకాధికారి కరికాల వల్లభన్ సమక్షంలో ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని చిక్కాలకు అందజేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్. చెన్నకేశవరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, డీసీసీబీ చైర్మన్ వరుపులరాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్.వీర్రెడ్డి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు పాల్గొన్నారు. ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం చిక్కాల రామచంద్రరావు కలెక్టరేట్ నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. చిక్కాలకు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప స్వీట్ తినిపించి అభినందించారు.