మోగిన నగరా
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
మార్చి 9 ఎన్నికలు, 15న కౌంటింగ్
పీడీఎఫ్ తరపున సీటూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజశర్మ
స్వతంత్ర అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ రమణమూర్తి
కాంగ్రెస్ తరపున యడ్ల ఆదిరాజు
టీడీపీ–బీజేపీల మ««ధ్య కొలిక్కిరాని పొత్తు
కోడ్ కూసింది.. ఎన్నికల వేడి రాజుకుంది. ఆశావాహులు ఎదురుచూపులు ఫలించాయి. మరో 55 రోజుల్లో ఖాళీ కానున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నగరా మోగింది. ఏపీలో గడువు మీరనున్న ఎమ్మెల్సీ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.
విశాఖపట్నం : ఉత్తరాంధ్ర (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) పట్టభద్రుల ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న ఎం.వి.ఎస్.శర్మ పదవీ కాలం వచ్చే నెల 29వ తేదీతో ముగియనుంది. ఈలోగా ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ కారణంగానే గతేడాది అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు జరిగింది. వివాదాల నడుమ ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. తొలుత అంతంతమాత్రంగా నమోదైన ఓట్లు చివరికొచ్చేసరికి 1.55,957 అర్హులుగా తేలారు. గత విడతలో 1,61,374 మంది ఓటు హక్కు నమోదు చేయించుకోగా.. ఈసారి సుమారు 5వేల మేర తగ్గాయి. వీరిలో పురుçష పట్టభద్రులు 1,04,063, మహిళా పట్టభద్రులు 51,333 నమోదు ఉన్నారు. తొలిసారిగా ఇతర పట్టభద్రులు 561 మందికి ఓటుహక్కు కల్పించారు.
13న ఎన్నికల నోటిఫికేషన్
ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 21వ తేదీన వీటిని పరిశీలిస్తారు. 23వ తేదీ వరకు ఉపసంహరణకు గడువునిచ్చారు. మార్చి 9న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 15వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. మార్చి 18 నాటికి ఎన్నికల ప్రక్రియను ముగించే విధంగా షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టయ్యింది. మార్చి 18 వరకు ఈ మూడు జిల్లాల్లో ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఓటర్ల నమోదు నుంచే ప్రచారం
ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచే ఆశావాహులు రంగంలోకి దిగారు. ఎవరికి వారు తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు చేపట్టారు. ఇలా కొన్ని విద్యాసంస్థల అధినేతలు చేపట్టిన ఓటర్ల నమోదు రాష్ట్ర స్థాయిలో వివాదస్పదమైంది. ముచ్చటగా మూడోసారి కూడా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తమ పరం చేసుకునేందుకు ప్రొగ్రెస్సివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఉవ్విళ్లూరుతోంది. ఈసారి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎ.అజశర్మను బరిలోకి దింపుతోంది. ఉద్యోగ, కార్మిక వర్గాల్లో తమకున్న పట్టును మరోసారి నిరూపించుకునేందుకు చాపకింద నీరులా అజశర్మ ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున విజయనగరం జిల్లాకు చెందిన యడ్ల ఆదిరాజు బరిలోకి దిగుతున్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటికే ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి సీనియర్ పాత్రికేయుడు వి.వి.రమణమూర్తి రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే మూడు జిల్లాలలో తమకు పరిచయం ఉన్న అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్తున్నారు.
బీజేపీ తరపున పీవీఎన్ మాధవ్?
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసే అంశంపై టీడీపీ–బీజేపీల మధ్య సయోధ్య కుదిరినట్టు ఇరు పార్టీలోనూ చర్చ జరుగుతోంది. ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ బలపర్చే అభ్యర్థిని బరిలోకి దింపాలనే భావిస్తున్నారు. కాగా టీడీపీ తరపున బరిలోకి దిగాలని ఆళ్వార్‌దాస్ విద్యా సంస్థల కార్యదర్శి సుంకర రవీంద్ర, నలంద విద్యాసంస్థల అధినేత నలంద కిశోర్ తదితరులు ఆరాట పడుతున్నప్పటికి రానున్న జీవీఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకే వదిలిపెట్టాలని టీడీపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి రామకోటయ్య, ఫృద్వీరాజ్ తదితర నేతలు ఇప్పటికే రేసులో ఉన్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.వి.చలపతిరావు తనయుడు మాధవ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మాధవ్‌ను బరిలోకి దింపితే కలిసొస్తుందన్న ఆశతో ఉన్నారు.